ఆద‌ర్శ మంత్రులు: స‌విత వ‌ర్సెస్ సుధారాణి

నిజానికి మంత్రివర్గంలో ఉన్న వారిలో చాలా మంది ఆర్థికంగా బలంగానే ఉన్నారన్నది అందరికీ తెలిసిందే.;

Update: 2025-07-08 00:30 GMT

ముఖ్య‌మంత్రి ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రకటించిన పీ-4 పథకానికి ఎవరు అతీతులు కారని, ఒకింత ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న నాయకులు, మంత్రులు, ఐఏఎస్‌, ఐపీఎస్ లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఇటీవల సూచించారు. దీనికి పార్టీ నాయకుల నుంచి ఇప్పటివరకు అయితే పెద్దగా స్పందన రాలేదు. కానీ ఒక ఇద్దరు మహిళా మంత్రులు మాత్రం స్పందించారు. వెంటనే పీ-ఫోర్ కార్యక్రమం ద్వారా తాము చంద్రబాబు చెప్పినట్టుగా పేదల కుటుంబాలను దత్తత తీసుకుని వారి అభివృద్ధికి పాటుపడతామని ప్రకటించారు. వీరే మంత్రులు గుమ్మిడి సంధ్యారాణి, సంజీవరెడ్డి గారి సవిత.

నిజానికి మంత్రివర్గంలో ఉన్న వారిలో చాలా మంది ఆర్థికంగా బలంగానే ఉన్నారన్నది అందరికీ తెలిసిందే. ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా ఆర్థికంగా బలంగానే ఉన్నారు. అయినా పీ-4 పథకం కింద పేదలను దత్తత తీసుకునే విషయంలో ఇతర మంత్రుల మాట ఎలా ఉన్నా ఈ ఇద్దరు మహిళా మంత్రులు మాత్రం ముందుకు రావడం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న గుమ్మిడి సంధ్యారాణి ఏకంగా 10 కుటుంబాలను పీ-ఫోర్ పథకం ద్వారా దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు.

పార్వతీపురం మన్యం జిల్లాలోని ఎనిమిది మండలాల నుంచి 8 కుటుంబాల‌తో పాటు సాలూరు పట్టణంలోని మరో రెండు కుటుంబాలను కూడా ఆమె దత్తత తీసుకుని వారి అభివృద్ధి సంక్షేమంతో పాటు పిల్లలను చదివించేందుకు కూడా ఆమె సిద్ధమయ్యారు. అదేవిధంగా అనంతపురం జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సవిత అనంతపురం జిల్లాలోని రెండు మూడు మండలాల నుంచి అదే విధంగా తన సొంత నియోజకవర్గాల నుంచి కూడా 10 కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. నిజంగా ఇది చాలా హర్షించాల్సిన విషయం అనే చెప్పాలి.

చంద్రబాబు పిలుపు ఇవ్వడంతోనే స్పందించిన నాయకులుగా కాకుండా సమాజం పట్ల బాధ్యతాయుతమైన నాయకులుగా కూడా ఇద్దరు మహిళా మంత్రులు పేరు తెచ్చుకున్నారని పార్టీలో సంతోషం వ్యక్తమ‌వుతోంది. చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చాలామంది పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారు. కొందరిని ఇప్పటికే దత్తత తీసుకున్నారు. వచ్చే ఆగస్టు 15 నాటికి పది లక్షల కుటుంబాలను దత్తత తీసుకునేలాగా కార్యక్రమాన్ని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఐఏఎస్‌లు, ఐపీఎస్ లు, మంత్రులు సహా పార్టీలోని ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు కూడా ముందుకు రావాలని ఆయన సూచించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఇంకెంత మంది ముందుకు వస్తారో చూడాలి.

Tags:    

Similar News