అసలు ట్రంప్ పేరు ఎత్తేందుకు కూడా మోడీ భయపడుతున్నారా?
'ఆపరేషన్ సిందూర్'పై పార్లమెంటు ఉభయ సభల్లోనూ.. 16 గంటల చొప్పున ప్రభుత్వం కేటాయించి.. చర్చ చేపట్టింది.;
`ఆపరేషన్ సిందూర్`పై పార్లమెంటు ఉభయ సభల్లోనూ.. 16 గంటల చొప్పున ప్రభుత్వం కేటాయించి.. చర్చ చేపట్టింది. సోమవారం, మంగళవారం లోక్‌సభలోను, మంగళవారం, బుధవారం.. రాజ్యసభలోనూ ఈ చర్చ నడిచింది. మంగళవారం లోక్‌సభలో ప్రధానినరేంద్ర మోడీ దాదాపు 2 గంటల 15 నిమిషాలకు పైగా నే సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఇక, బుధవారం కూడా ఆయన రాజ్యసభలో దీనిపై ప్రసంగించనున్నారు. అయితే.. మంగళవారం నాడు ప్రధాని చేసిన ప్రకటనపై విపక్షాలు బుధవారం కూడా ఆందోళనను కొనసాగించాయి.
బుధవారం ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాలు.. ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని ప్రసంగాన్ని తప్పుబడుతూ.. ఆయన ప్రజలను, దేశాన్ని కూడా ఏమార్చారని నినాదాలతో హోరెత్తించారు. విపక్షాలు.. అడిగిన ఏ ప్రశ్నకూ సూటిగా ప్రధాని సమాధానం చెప్పలేక పోయారని.. రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నిలదీశారు. ఇక, లోక్‌సభలోనూ.. ఇదే తంతు నడిచింది. సభ 11 గంటల కు ప్రారంభమయ్యాక.. ఇరు సభల్లోనూ ప్రతిపక్షాలు ఇదే విషయాన్ని ప్రస్తావించాయి.
అయితే.. స్పీకర్ ఓంబిర్లా.. లోక్ సభలో ప్రశ్నోత్తరాలు చేపట్టారు. దీనికి విపక్ష సభ్యులు అడుగడుగునా అడ్డు పడ్డారు. ప్రధాని మోడీకి చిత్తశుద్ధి లేదని.. సైనిక బలగాలను చెప్పుచేతల్లో పెట్టుకుని దేశ భద్రతను పణంగా పెడుతున్నారని తృణమూల్ కాంగ్రెస్(బెంగాల్ అధికార పార్టీ) సభ్యులు నిప్పులు చెరిగారు. అసలు ఆపరేషన్ సిందూర్ తానే ఆపేశానని ట్రంప్ చేసిన ప్రకటనలపై మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని.. ప్రశ్నించారు. అంతేకాదు.. అసలు ట్రంప్ పేరు ఎత్తేందుకు కూడా మోడీ భయపడుతున్నారా? అని నిలదీశారు.
రాజ్యసభలోనూ.. ఇదే తంతు నడిచింది. సూటిగా సుత్తిలేకుండా.. మోడీ ఎందుకు సమాధానం చెప్పలేక పోయారని.. సభ్యులు నిలదీశారు. అయితే.. బుధవారం ప్రధాని రాజ్యసభలో మళ్లీ సమాధానం ఇస్తారని.. చైర్మన్ స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. జీరో అవర్ కొనసాగించాలని కోరారు. అయితే.. సభ్యులు శాంతించలేదు. మెజారిటీ ప్రతిపక్ష సభ్యులు ఈ చర్చకు దూరంగా ఉండిపోయారు. మొత్తంగా.. మోడీ సమాధానంతో విపక్షాలు శాంతించ లేదన్న విషయం స్పష్టమైంది.