ఎమ్మెల్యే భర్తకు హక్కులు ఉండవా? జనసేన ఎమ్మెల్యే భర్త
అయితే నియోజకవర్గంలో పొలిటికల్ ఫైట్ పై తరచూ పత్రికల్లో కథనాలు రావడం జనసేన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు.;
మహిళా నేతల తరఫున వారి భర్తలు రాజకీయాలు చేయడం అత్యంత సాధారణం. ఇలాంటి వారిపై వార్తలు, విమర్శలు కూడా వస్తుంటాయి. కానీ, తన భార్య బదులుగా రాజకీయాలు చేస్తున్న నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి భర్త లోకం ప్రసాద్ మాత్రం ఆ విమర్శలను తట్టుకోలేకపోతున్నారు. తనపై విమర్శనాత్మక కథనాలు ప్రసారం చేసే వాళ్ళ తాట తీస్తానంటూ ఆయన బహిరంగంగా హెచ్చరికలు చేస్తున్నారు. పైగా ఎమ్మెల్యే భర్తకు హక్కులు ఉండవా? అంటూ ఆయన ప్రశ్నించడం చర్చనీయాంశం అవుతోంది.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో జనసేన నుంచి లోకం మాధవి ఎన్నికయ్యారు. అయితే ఎన్నికలు జరిగిన కొద్దిరోజులకే టీడీపీ నేత కర్రోతు బంగార్రాజుతో ఎమ్మెల్యే వర్గానికి భేదాభిప్రాయాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయంపై అనేకసార్లు పత్రికలు, టీవీల్లో కథనాలు ప్రసారమయ్యాయి. ఇరుపార్టీల అగ్రనాయకత్వం కల్పించుకుని ఈ విభేదాలను సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ, పరిస్థితి ఇంతవరకు మెరుగుపడలేదని ఇప్పటికీ ప్రచారం జరుగుతూనే ఉంది.
అయితే నియోజకవర్గంలో పొలిటికల్ ఫైట్ పై తరచూ పత్రికల్లో కథనాలు రావడం జనసేన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. దీంతో ఎమ్మెల్యే లోకం మాధవి మీడియా సమావేశం నిర్వహించి తన అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేతోపాటు నియోజకవర్గానికి చెందిన జనసేన ముఖ్యనేతలు అంతా విలేకరులతో మాట్లాడుతూ ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఆలోచనలో తాము ఉంటే మమ్మల్ని రాజకీయ కక్షతో వ్యక్తిగతంగా బురదజల్లే ప్రయత్నం జరగడం బాధాకరమని ఆవేదన చెందారు. ఈ సమయంలో ఎమ్మెల్యే భర్త లోకం ప్రసాద్ కల్పించుకుని మీడియాపై విరుచుపడటం సంచలనంగా మారింది. ఆయన మాట్లాడిన మాటల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎన్నికల సమయంలో తాము హామీ ఇచ్చిన విధంగా 100 రోజులలో వంద కంపెనీలు తీసుకురాలేదని పత్రికల్లో రాయడమే ఆయన ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారు. ఈ సందర్భంగా వేషాలేస్తే తోలుతీస్తానంటూ ఆయన వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే భర్త వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మాట్లాడుతున్న సమయంలో ఎమ్మెల్యే వారించే ప్రయత్నం చేసినా, ఆయన పట్టించుకోకపోవడం వీడియోలో రికార్డు అయింది. ‘తానే తప్పు చేయలేదని, ప్రజల కోసమే పనిచేస్తున్నామని’ ఎమ్మెల్యే భర్త వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఏ పీకుతారు? అంటూ ఆయన ప్రశ్నించడం చర్చకు దారితీసింది. అయితే ఆయన ఆగ్రహానికి కారణం కేవలం విలేకరులేనా? ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.