ఈసారి మోడీ వేవ్ లేదు... బీజేపీ మహిళా ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు!

అవును... ఈసారి ఎన్నికల్లో మోడీ వేవ్ లేదని స్వయంగా బీజేపీ మహిళా అభ్యర్థి నవనీత్ కౌర్ రాణా తేల్చిచెప్పేశారు.

Update: 2024-04-17 12:40 GMT

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తుండగా.. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని కూడా మార్చే ప్రమాదం ఉందని విమర్శిస్తూ, అలా జరగకూడదంటే తామే అధికారంలోకి రావాలని కాంగ్రెస్ చెబుతుంది! దీంతో ఈసారి జాతీయ స్థాయిలో రసవత్తర పోరు కన్ ఫాం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో బీజేపీ మహిళా ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... ఈసారి ఎన్నికల్లో మోడీ వేవ్ లేదని స్వయంగా బీజేపీ మహిళా అభ్యర్థి నవనీత్ కౌర్ రాణా తేల్చిచెప్పేశారు. ఈ మేరకు రానున్న ఎన్నికల్లో బీజేపీ నుంచి మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నవనీత్ కౌర్ రాణా తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో అమరావతి సీటు నుంచే స్వతంత్ర ఎంపీగా గెలిచిన నవనీత్ కౌర్.. ఈ మధ్యే బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

Read more!

ఈ క్రమంలో స్పందించిన ఆమె... తాము ఈ ఎన్నికలను గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే పోరాడాలని.. మధ్యాహ్నం 12 గంటల వరకు ఓటర్లందరినీ బూత్‌ కు తీసుకొచ్చి ఓటు వేయమని చెప్పాల్సి వస్తుందని అన్నారు. అనంతరం మోడీ వేవ్ ఉందన్న భ్రమల్లో ఉండోద్దంటూ పార్టీ నేతలకు, కార్యకర్తలకు నవనీత్ కౌర్ సూచించారు. ఇదే సమయంలో... గతంలో మోడీ పవనాలు వీచినా తాను ఇండిపెండెంట్ గా గెలిచిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఈసారి ఎంత కష్టపడాలో తెలిపారు.

దీంతో... ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా ఈమె చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ స్పందించింది. ఇందులో భాగంగా... రాణా ఏం మాట్లాడినా అది వాస్తవమని, అది ఆమెకూ తెలుసని ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేష్ తపసే తెలిపారు. ఇదే క్రమంలో... మోడీ వేవ్ లేదనే సంగతి బీజేపీకే తెలుసని.. విపక్షాలను చీల్చి నేతలను పార్టీలో చేర్చుకున్నప్పుడే బీజేపీకి ఇది అర్దమైందని సెటైర్లు వేశారు!

కాగా... గత ఎన్నికల్లో అమరావతి లోక్ సభ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన నవనీత్ కౌర్ రాణా.. సమీప శివసేన పార్టీ అభ్యర్థిపై 36,951 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ క్రమంలో ఆమె ఇటీవల బీజేపీలో చేరి.. ఈసారి పార్టీ టిక్కెట్ పై పోటీ చేస్తున్నారు!

Tags:    

Similar News