తాడేపల్లి ప్యాలెస్ కు 200 మీటర్ల దూరంలోనే ఉన్నా.. మంత్రి లోకేశ్ మైండ్ బ్లోయింగ్ సవాల్
ఈ క్రమంలో మంత్రి లోకేశ్ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాము గత పాలకుల్లాగా మోసపూరిత ప్రకటనలు చేయడం లేదన్నారు.
డీఎస్పీపై వైసీపీ విమర్శలకు మంత్రి లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. గత కొంతకాలంలో డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగియాంటూ విపక్షం విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం అధికారుల స్థాయిలో సవివివరంగా వివరణ ఇస్తున్నప్పటికీ ఆరోపణలు ఆపకపోవడంపై మంత్రి లోకేశ్ ఫైర్ అయ్యారు. ఈ విషయంపై తొలిసారిగా స్పందించిన మంత్రి లోకేశ్ నేరుగా విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని టార్గెట్ చేశారు. జగన్ నివాసమైన తాడేపల్లి ప్యాలెస్ కు 200 మీటర్ల దూరంలోనే ఉన్నానని, డీఎస్పీపై ఆరోపణలు చేస్తున్న ఎవరైనా సరే, దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలి బహిరంగ సవాల్ విసిరారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి లోకేశ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మెగా డీఎస్సీపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తుండటంతో వాటికి పుల్ స్టాప్ పెట్టే ఉద్దేశంతో మంత్రి లోకేశ్ నేరుగా రంగంలోకి దిగారని అంటున్నారు. బుధవారం మంగళగిరి నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేశ్ డీఎస్సీ నియామకాలు పూర్తి పారదర్శకంగా జరిగినట్లు తెలిపారు. డీఎస్సీ ప్రక్రియపై వైసీపీ చేస్తున్న ప్రచారాలపై మంత్రి నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ఉపాధ్యాయ నియామకాలను చేపట్టిందని స్పష్టం చేశారు. విపక్ష నేత తన రాజకీయ స్వార్థం కోసం ఎన్ని కుట్రలు చేసినా, కోర్టుల చుట్టూ తిరిగినా, ఎన్ని జన్మలెత్తినా ఏపీలో డీఎస్సీ నియామకాలను ఆపలేరని తేల్చిచెప్పారు.
ఇదే సమయంలో డీఎస్పీపై చర్చించేందుకు రమ్మంటూ సవాల్ విసిరారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి కేవలం 200 మీటర్ల దూరంలోనే తాను ఉన్నానని, చర్చకు తానే స్వయంగా వచ్చానని ప్రకటించి పొలిటికల్ హీట్ పెంచారు. "నేను మీ ఇంటికి కూతవేటు దూరంలోనే నిలబడి మాట్లాడుతున్నా.. డీఎస్సీపై మీకు ఎలాంటి అనుమానాలున్నా సమాధానం చెప్పేందుకు ఇక్కడే సిద్ధంగా ఉన్నా. సవాల్ స్వీకరించే ధైర్యం, దమ్ము ఉన్నవాళ్లు ఎవరైనా సరే నేరుగా చర్చకు రావాలి" అంటూ చాలెంజ్ చేశారు.
ఈ క్రమంలో మంత్రి లోకేశ్ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాము గత పాలకుల్లాగా మోసపూరిత ప్రకటనలు చేయడం లేదన్నారు. "మేము 'సాక్షి' పేపర్‌లో వేసుకునే డమ్మీ క్యాలెండర్లు కాకుండా, నిరుద్యోగులకు మేలు చేసే నిజమైన జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తున్నాం. అసలు మీ ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ అయినా సక్రమంగా నిర్వహించి ఉంటే కదా.. హారిజంటల్ రిజర్వేషన్లు అంటే ఏంటో, వర్టికల్ రిజర్వేషన్లు అంటే ఏంటో అర్థం కావడానికి" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఎక్కువ కాలం పొరుగు రాష్ట్రాలైన బెంగళూరు, హైదరాబాద్ ప్యాలెస్‌లకే పరిమితమవుతున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. జగన్ ఇప్పటికైనా పొరుగు రాష్ట్రాల పర్యటనలు వీడి, ఆంధ్రప్రదేశ్ వైపు కళ్లు తెరిచి చూస్తే కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతోందో స్వయంగా కనిపిస్తుందని హితవు పలికారు. మొత్తానికి, డీఎస్సీపై పొలిటికల్ ఫైట్ మంత్రి లోకేశ్ స్పందనతో మరింత పీక్స్ కు వెళ్లిందని వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రి ఓపెన్ డిబేట్‌కు రమ్మని పిలవడంపై వైసీపీ క్యాంప్ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది.