బాలయ్య నూరు శాతం అర్హుడు
ఇలా సుదీర్ఘ కాలం నటుడిగా ఉంటూ మంచి పేరు తెచ్చుకోవడమూ ఒక రికార్డే అని చెప్పాలి. ఆ విధంగా చూస్తే బాలయ్యకు అవార్డులు అన్నవి వరించి రావాలనే అంటున్నారు.;
ఎన్టీఆర్ కుమారుడిగా కాదు ఒక సాటి నటుడిగా చూసుకుంటే నందమూరి బాలకృష్ణ తనదైన ప్రతిభతో ఉన్నతమైన స్థానానికే చేరుకున్నారు. ఆయనదైన బాణీ ఉంది. బాడీ లాంగ్వేజ్ ఉంది. డైలాగ్ డెలివరీలో సెపరేట్ స్టైల్ ఉంది.
ఆహార్యం ఉంది. వాచకం ఉంది, అభినయ కౌశలం ఉంది. అర్ధ శతాబ్దం అనుభవం ఉంది. మరి ఇన్ని ఉన్న బాలయ్యకు ఎన్టీఅర్ నేషనల్ అవార్డు ఇవ్వడం నూరు శాతం కరెక్ట్ అని అంటున్నారు. బాలయ్యకు ఈ అవార్డు ఇవ్వడం ఎంతగానో సముచితం అని చెప్పాలి.
ఎన్టీఆర్ నాలుగు జానర్లలో నటించి సత్తా చాటారు. బాలయ్య కూడా తండ్రి మాదిరిగా పౌరాణిక జానపద, చారిత్రాత్మక, సాంఘిక చిత్రాలలో తనదైన ముద్ర వేసుకున్నారు అలాగే రౌద్ర రసంలో ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు.
ఒక యాభై ఏళ్ళు వరసగా నటించడం అంటే మాటలు కాదు ఆ అరుదైన ఫీట్ ని బాలయ్య సాధించారు. అంతే కాదు అనేక రకాలైన పాత్రలను పోషించారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం బాలయ్యకే చెల్లు అన్నట్లుగా ఆయన చేసిన చాలా పాత్రలు కనిపిస్తాయి.
తెలుగు భాష మీద మంచి పట్టుంది. సినిమా మీద మంచి అవగాహన ఉంది. ఈ రోజుకీ సినిమా చేస్తే తొలి రోజు తొలి షాట్ కి హాజరయ్యే కొత్త నటుడి ఒద్దిక వినయం నిబద్ధత బాలయ్యలో ఉంది. ఆయన దర్శకుడి హీరో అంటారు. ఆయన నిర్మాతల హీరో అని కూడా అంటారు.
ఇలా సుదీర్ఘ కాలం నటుడిగా ఉంటూ మంచి పేరు తెచ్చుకోవడమూ ఒక రికార్డే అని చెప్పాలి. ఆ విధంగా చూస్తే బాలయ్యకు అవార్డులు అన్నవి వరించి రావాలనే అంటున్నారు. అయితే వాటికీ సమయం సందర్భం ఉందేమో. అందుకే ఇపుడు కరెక్ట్ టైం అని భావించి అలా క్యూ కడుతున్నాయని నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు
ఇదే ఏడాది బాలయ్యకు దేశంలోని పౌర పురస్కారాలలో మూడవది అయిన పద్మభూషణ్ దక్కింది. ఇక ఇపుడు చూస్తే తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన అవార్డు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఆయనకు దక్కింది.
ఇలా అవార్డులు అన్నీ కలసి రావడం వరసగా సినిమాలు విజయం సాధించడం చేతిలో మరిన్ని సినిమాలు ఉండడం ఆరున్నర పదుల బాలయ్య జీవితంలో ఇది సువర్ణ యుగం అని అంటున్నారు. ఇంతకు ఇంతా మరింత కాలం నటించే స్టామినా కలిగిన బాలయ్యకు ఈ అవార్డులు ఎనలేని బూస్టింగ్ ఇస్తాయని అంటున్నారు. ఆయన ఇప్పటిదాక చేసినవి ఒక ఎత్తు అయితే చేయాల్సిన పాత్రలు చాలానే ఉన్నాయని అంటున్నారు.
కేవలం బాలయ్యకు మాత్రమే సాధ్యమయ్యే పాత్రలు ఎన్నో ఉన్నాయి. ఆ పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేయాల్సిన సమయం ఇదే అంటున్నారు. నిండారా నటనానుభవం పండించుకున్న బాలయ్య చారిత్రాత్మక పౌరాణిక సాంఘిక పాత్రలు చరిత్రలో నిలిచేవి ఎన్నో చేయాలని అభిమాన జనంతో పాటు సినిమా అభిమాన జనం మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.
ఆయన శ్రీ కృష్ణ దేవరాయలుగా ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించాలని ఆశపడుతున్నారు. అలాగే ఆయన డ్రీం ప్రాజెక్ట్ అయిన చంఘీజ్ ఖాన్ గా గర్జించాలని, గోన గన్నారెడ్డిగా విరాట్ స్వరూపాన్ని వెండి తెర మీద ఆవిష్కరించాలని శ్రీ రామానుజాచార్యులుగా సాక్షాత్కరించాలని ఇంకా ఎన్నో పాత్రలలో కనువిందు చేయాలని అంతా కోరుతున్నారు. ఆ ఆశలు తీర్చే అవకాశం బాలయ్యకే ఉందని అంతా నమ్ముతున్నారు.