ముద్రగడ జనసేనలో చేరేది అపుడే....!?

గోదావరి జిల్లాలలో కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరేది ఎపుడు అన్న చర్చ ముందుకు వస్తోంది.

Update: 2024-01-22 04:17 GMT

గోదావరి జిల్లాలలో కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరేది ఎపుడు అన్న చర్చ ముందుకు వస్తోంది. ఎందుకంటే సంక్రాంతి పండుగ తరువాత ముద్రగడ పవన్ భేటీ ఉంటుందని ప్రచారం సాగింది. ముద్రగడ కుటుంబం వైసీపీకి దూరం అని స్పష్టమైన సంకేతం పంపించారు. తెలుగుదేశంలో ఎటూ డైరెక్ట్ గా ముద్రగడ చేరలేరు. దాంతో జనసేనలో చేరి తన రీ ఎంట్రీ అదిరిపోయేలా ఉండేలా చూసుకోవాలని చూస్తున్నారు.

ఇదిలా ఉంటే ముద్రగడ పద్మనాభాన్ని కలవడానికి పవన్ కళ్యాణ్ స్వయంగా కిర్లంపూడికి వస్తారు అని అంటున్నారు. ఆయన ముద్రగడతో భేటీ అయి ఆయన్ని ఆహ్వానిస్తారని ఆ మీదట మంచి రోజు చూసుకుని పార్టీలో చేరుతారు అని అంటున్నారు. ఇపుడు అయోధ్యలో పవన్ ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తరువాత బహుశా ఈ నెలాఖరులోగా ముద్రగడ పవన్ భేటీ ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

మరో వైపు చూస్తే ముద్రగడ కండిషన్లు కొన్ని ఉన్నాయని అంటున్నారు. వాటి మీద క్లారిటీ వచ్చాకనే పవన్ ముద్రగడ భేటీ ఉంటుందని అంటున్నారు. ఆ కండిషన్లు ఏంటి అంటే పెద్దాపురం, పిఠాపురంలతో పాటు కాకినాడ ఎంపీ సీటు తన సన్నిహితులకు ఒకటి రెండు సీట్లు ముద్రగడ కోరుతారు అని ప్రచారం సాగుతోంది.

మరి వీటిని జనసేన అకామిడేట్ చేయాలి. జనసేన ఇవ్వాలి అంటే టీడీపీతో పొత్తుల వ్యవహారం కధ తేలాలి. ఆ రెండు పార్టీలు కూర్చుని చర్చించిన మీదటనే ఒక క్లారిటీ వస్తుంది. ఇంకో విషయం ఏంటి అంటే ముద్రగడ కోరే సీట్లలో అటు టీడీపీ ఇటు జనసేన నుంచి కూడా ఆశావహులు ఉన్నారు. మరి వారికి నచ్చచెప్పి ఆ సీట్లు ఇవ్వాలి.

Read more!

అదే విధంగా చూసుకుంటే ముద్రగడకు ఇచ్చే సీట్లు అన్నీ జనసేన కోటాలోనే ఇస్తారు. అసలు జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీ ఎన్ని సీట్లు కోరుకుంటోంది అన్నది కూడా చర్చగానే ఉంది. అదే విధంగా చూస్తే ముద్రగడ కోరినన్ని సీట్లు ఇవ్వలేకపోతే అన్న ప్రశ్న కూడా ఆ వెంటనే ఉంది.

ప్రచారంలో ఉన్న మాట అయితే ముద్రగడ ఫ్యామిలీకి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని అంటున్నారు. అదే హామీ వైసీపీ నుంచి కూడా వచ్చినట్లుగా ప్రచారం సాగింది. అక్కడ కుదరకనే ఇటు వైపుగా ఆయన ఫ్యామిలీ చూస్తోంది అని అంటున్నారు. అయితే ఇపుడు ఇక్కడ కూడా అవే నంబర్ అంటే ముద్రగడ కుటుంబం సర్దుకుని పోతుందా లేక ఏమైనా కొత్త ఆలోచనలు చేస్తుందా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ముద్రగడ పవన్ భేటీ ఎపుడు అన్న ప్రశ్నకు జవాబుకు సీట్ల పంచాయతీకి మధ్య లింక్ అయితే గట్టిగానే ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News