మేయర్ లేదా జెడ్పీ చైర్మన్ గా ముద్రగడ కుమార్తె ?

కాపు నాయకుడు, మాజీ మంత్రి దివంగత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతికి కీలకమైన పదవిని ఇచ్చేందుకు జనసేన వ్యూహ రచన చేస్తోంది అని అంటున్నారు.

Update: 2026-10-15 03:41 GMT

కాపు నాయకుడు, మాజీ మంత్రి దివంగత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతికి కీలకమైన పదవిని ఇచ్చేందుకు జనసేన వ్యూహ రచన చేస్తోంది అని అంటున్నారు. ఇప్పటికే వంగవీటి రాధాక్రిష్ణను జనసేనలోకి తీసుకుని విజయవాడ పరిసరాలలో పార్టీ బలం పెంచుకున్న జనసేన గోదావరి జిల్లాలలో మరింతగా పాతుకునిపోవాలని చూస్తోంది. దాంతో కాపుల ఐకాన్ గా పేరుపడిన ముద్రగడ పద్మనాభం కుమార్తెకు జనసేనలో మంచి పొజిషన్ ఇవ్వాలని చూస్తోంది అని అంటున్నారు. ముద్రగడ జీవించి ఉన్నపుడే 2024 ఎన్నికల ముందు ఆయన కుమార్తె క్రాంతి జనసేనలో చేరారు. అయితే ఇన్నాళ్ళు ఆమె పార్టీ పరంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పనిచేస్తూ వస్తున్నారు. అక్కడ ఇటీవలనే వైసీపీ మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత పరువుల సుబ్బారావు జనసేనలో చేరారు. దాంతో ఆయన 2029 ఎన్నికల్లో ఆ సీటు నుంచి పోటీ చేస్తారు అని తెలుస్తోంది. దాంతో క్రాంతికి మంచి స్థానం ఇవ్వాలని జనసేన అధినాయకత్వం ఆలోచన చేస్తోంది అని అంటున్నారు.

కాకినాడ మేయర్ రేసులో :

ఇక కాకినాడ మేయర్ సీటుని పొత్తులో భాగంగా జనసేన తీసుకుంటోంది. దాంతో ఆ సీటులో పోటీకి క్రాంతిని నిలబెట్టాలని ఆలోచిస్తోంది అని అంటున్నారు. ఒకవేళ అలా సాధ్యపడకపోతే తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఆమెను పోటీ చేయించాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఈ రెండు సీట్లను జనసేన పొత్తులో తీసుకుని పోటీ చేయబోతోంది. దాంతో ముద్రగడ కుమార్తెకు కీలక పదవిని అప్పగించాలని జనసేన చూస్తోంది అని అంటున్నారు.

పార్టీ పరంగానే :

జనసేన పార్టీ పరంగా పటిష్టం కావడమే కాదు ఉత్తరాంధ్రా నుంచి దక్షిణ కోస్తా జిల్లాల వరకూ విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో బలమైన సామాజిక వర్గాలకు చెందిన కుటుంబాలను పార్టీలో కీలకంగా చేస్తూ మరింతగా ఆ వర్గాలకు దగ్గర కావాలని చూస్తోంది. ఇక వంగవీటి అంటే ఒక బ్రాండ్ ఉంది. ఆయన జనసేనలో చేరడంతో ఆ పార్టీకి మరింతగా బలం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా ముద్రగడ మరణించారు. ఆయన చేసిన సేవలకు గానూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయన వారసుడిగా కుమారుడు వైసీపీలో ఉన్నారు. అయితే ముద్రగడ కుమార్తెకు మంచి స్థానం కల్పించడం ద్వారా ఆయన అభిమానులను కూడా ఏకీకృతం చేస్తూ జనసేన మరింతగా బలోపేతం చేసుకోవాలన్న వ్యూహం ఉంది అని అంటున్నారు.

అన్ని వర్గాలను ఆకట్టుకుని :

జనసేన అంటే కేవలం ఒకే సామాజిక వర్గానికి చెందినది కాదు అన్న భావనను వ్యాప్తి చెందేలా చూడడం అదే సమయంలో ఇతర వర్గాలను కూడా దగ్గరకు తీయాలన్న ఆలోచన కూడా ఉందని అంటున్నారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కూడా జనసేన పెద్ద పీట వేస్తుందని చెబుతున్నారు. అలాగే బడుగు వర్గాలకు తగిన ప్రాధాన్యత పార్టీ పరంగా ఇచ్చేందుకు చూస్తున్నారు. వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించడం ద్వారా జనసేన స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి అయ్యేనాటికి ఏపీలో కీలకమైన శక్తిగా ఆవిర్భవించాలని చూస్తోంది అని అంటున్నారు. 2029 ఎన్నికలలో జనసేన మరింతగా బలం పెంచుకోవడానికి స్థానిక సంస్థల ఎన్నికలను ఒక మార్గంగా చేసుకుంటోంది అని అంటున్నారు. అందుకే పట్టుదలగా పట్టుబట్టి మరీ తనకు కావాల్సిన సీట్లను పొత్తులో భాగంగా తీసుకుంటోంది అని చెబుతున్నారు.

Tags:    

Similar News