మహిళా సెంటిమెంట్...ఎన్డీయేను కాపాడుతుందా ?

లోక్ సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు సందర్భంగా జరిగిన చర్చలో ప్రధానమంత్రి నరంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.;

Update: 2026-04-16 15:30 GMT

లోక్ సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు సందర్భంగా జరిగిన చర్చలో ప్రధానమంత్రి నరంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు రాజకీయ సాధికారతకు తొలి అడుగు అన్నారు. ఇది చారిత్రాత్మకం అని కూడా అభివర్ణించారు. మహిళా సారధ్యంతో సంపూర్ణ వికసిత్ భారత్ అని చెప్పుకొచ్చారు. ఈ బిల్లుని ఎవరైనా వ్యతిరేకిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అని హెచ్చరించారు. మహిళా జాతి అసలు క్షమించదు అన్నట్లుగా బిగ్ సౌండ్ చేశారు.

రెండూ వేరు అంటూ :

అయితే దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా మహిళా బిల్లుని ఏ మాత్రం వ్యతిరేకించడం లేదు, పైగా పూర్తి మద్దతు ఇస్తోంది. డీలిమిటేషన్ లేకుండానే మహిళలకు ఉన్న 543 సీట్లలో మూడవ వంతు కేటాయించవచ్చు అని సూచిస్తోంది. అదే సమయంలో డీలిమిటేషన్ ని 2027 జనాభా గణన జరిగాక అన్ని లెక్కలు తెలిసాక పూర్తి స్థాయిలో లోక్ సభ సీట్లను 2034 నాటికి కూడా పునర్ వ్యవస్థీకరించవచ్చు అని ప్రతిపక్షాలు సూచిస్తున్నాయి. అయితే మహిళా బిల్లు మూడవ వంతు వారికి కోటా అందుకోసం డీలిమిటేషన్ బిల్లు అదనపు సీట్లు ఇలా కేంద్రం ఆలోచనలు ఉన్నాయి. అక్కడ అధికార ఎన్డీయే విపక్ష ఇండియా కూటమి ఢీ కొట్టాల్సి వస్తోంది.

మోడీ ఏమన్నారు అంటే :

దేశాభివృద్ధిలో నారీ శక్తి కీలక పాత్ర పోషిస్తోందని విధాన రూపకల్పనలో వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించడం తక్షణ అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేస్తున్నారు. నారీ శక్తి వందన్ అధినియంకు సంబంధించిన రాజ్యాంగ సవరణలపై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చారిత్రక చట్టానికి రాజకీయ రంగు పులమవద్దని ప్రధానమంత్రి ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజాస్వామ్యానికి ఈ బిల్లులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని ఆయన తెలిపారు. ఈ చట్టాన్ని ఇప్పుడు వ్యతిరేకించేవారు భవిష్యత్తులో తగిన పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. దేశ గమనాన్ని భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఈ చట్టం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకొచ్చారు. అభివృద్ధి చెందిన భారతదేశం కేవలం మౌలిక సదుపాయాలు రైల్వేలు లేదా ఆర్థిక సూచికలకు మాత్రమే పరిమితం కాదని అందులో మహిళల సమాన భాగస్వామ్యం కూడా తప్పనిసరి అని ఆయన నొక్కి చెప్పారు. విధాన రూపకల్పనలో 'సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటోందని నరంద్ర మోడీ గట్టిగా చెప్పారు.

కీలక బిల్లులుగా :

ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం లోక్ సభ రాజ్యాంగ 131వ సవరణ బిల్లు- 2026, డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు- 2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ) బిల్లు- 2026 ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లుల మీద ఈ చర్చలో పాల్గొన్న సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ అయితే మహిళా రిజర్వేషన్లకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు. అయితే, ఇంతటి కీలకమైన చట్టాన్ని ప్రభుత్వం అత్యంత హడావిడిగా తీసుకురావడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. తాజా జనాభా గణన ప్రక్రియ పూర్తయిన తర్వాత మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు.

డీలిమిటేషన్ తో ముడి వద్దు :

ఇక కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ కేంద్రం తీరు మీద విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్‌కు అనుకూలమేనని అయితే ఈ ప్రక్రియను సరళీకృతం చేయాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజనతో మహిళా బిల్లుకు ముడిపెట్టకూడదని అన్నారు. లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాల ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళా రిజర్వేషన్ల అమలులో ప్రభుత్వం అనవసర జాప్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. దీనిని తక్షణమే అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. మహిళా రిజర్వేషన్‌కు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తూనే ఉందని గౌరవ్ గొగోయ్ గట్టిగా చెప్పారు.

Tags:    

Similar News