24 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. సరికొత్త శిఖరం!.. మోదీ సాధించిన అసాధారణ విజయం ఏంటి?

నరేంద్ర మోదీ 22 మార్చి, 2026 నాటికి అత్యధిక కాలం ఒక ప్రభుత్వానికి అధిపతిగా (ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా) ఉన్న భారతీయ నాయకుడిగా సరికొత్త చరిత్ర సృష్టించారు.;

Update: 2026-03-23 09:30 GMT

భారత రాజకీయ చరిత్రలో ఇదొక అరుదైన, చారిత్రాత్మకమైన మైలురాయి. ఒక సామాన్య కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి, దేశాన్ని శాసించే స్థాయికి ఎదగడమే కాకుండా.. అత్యధిక కాలం పదవిలో ఉన్న నాయకుడిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు సృష్టించడం ఆయన పట్ల ప్రజలకున్న అచంచలమైన నమ్మకానికి నిదర్శనం. నిన్నటి వరకు (మార్చి 22, 2026) సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ పేరిట ఉన్న ఈ రికార్డును మోదీ ఇప్పుడు అధిగమించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకే వ్యక్తి ఇన్ని సంవత్సరాల పాటు నిరంతరాయంగా అధికారంలో ఉండడం అనేది ఆయన వ్యూహాలకు, పనితీరుకు నిలువుటద్దం. ఈ చారిత్రాత్మక రికార్డు, ప్రధాని మోదీ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుంటే ఆనందంగా పులకరించడం ఖాయం.

చామ్లింగ్ రికార్డు బద్దలు!

నరేంద్ర మోదీ 22 మార్చి, 2026 నాటికి అత్యధిక కాలం ఒక ప్రభుత్వానికి అధిపతిగా (ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా) ఉన్న భారతీయ నాయకుడిగా సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ 8,930 రోజుల పాటు పదవిలో ఉండి అగ్రస్థానంలో ఉండగా, మోదీ 8,931 రోజులతో ఆ రికార్డును అధిగమించారు. కేవలం ఒక రాష్ట్రానికే కాకుండా, దేశానికే ప్రధానిగా ఉంటూ రికార్డు సాధించడం విశేషం.

25 ఏళ్ల ప్రస్థానం!

నరేంద్ర మోదీ 7 అక్టోబర్, 2001న గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి 21 మే, 2014 వరకు సుమారు 13 ఏళ్ల పాటు గుజరాత్ సీఎంగా పనిచేసి, ఆ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచారు. ఆ తర్వాత 26 మే, 2014న భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, వరుసగా 2014, 2019, 2024 ఎన్నికల్లో తన పార్టీని విజయపథంలో నడిపించి మూడోసారి ప్రధానిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 7 నాటికి ఆయన అధికారంలో ఉండి పాతికేళ్లు (25 ఏళ్లు) పూర్తి చేసుకోనున్నారు.

రికార్డుల రారాజు

కేవలం పదవీ కాలమే కాకుండా, మోదీ రాజకీయ ప్రస్థానం అనేక ఇతర రికార్డులతో ముడిపడి ఉంది

అత్యధిక అనుభవం: ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాని అయిన వారిలో అత్యధిక కాలం సీఎం అనుభవం ఉన్న ఏకైక నాయకుడు ఆయనే.

వరుస విజయాలు: గుజరాత్ అసెంబ్లీలో నాలుగు సార్లు, లోక్‌సభలో మూడు సార్లు వరుసగా తన నాయకత్వంలో ఎన్నికల విజయాలను సాధించారు.

ప్రధానిగా రికార్డు: జూలై 2025లో ఇందిరా గాంధీ రికార్డును (4,077 రోజులు) దాటి, నిరంతరాయంగా అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న రెండో వ్యక్తిగా (నెహ్రూ తర్వాత) నిలిచారు.

డిజిటల్ ఆధిపత్యం: ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ల ఫాలోవర్లను దాటిన ప్రపంచంలోనే మొదటి రాజకీయ నేతగా ఈ ఏడాది ఫిబ్రవరిలో రికార్డు సృష్టించారు.

‘దేశమే మొట్టమొదటి ప్రాధాన్యత’ అనే నినాదంతో సాగుతున్న మోదీ ఈ సుదీర్ఘ ప్రయాణం భారత రాజకీయాల్లో ఒక సుస్థిరమైన అధ్యాయాన్ని లిఖించింది. కేబినెట్ సహచరులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ వంటి వారు ఈ మైలురాయిని ఒక 'యుగం'గా అభివర్ణించారు. 2047 నాటికి 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారత్) సాధించడమే లక్ష్యంగా ఆయన తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ పాతికేళ్ల నిరంతర శ్రమ దేశాభివృద్ధిలో ఎన్నో కీలక మార్పులకు నాంది పలికింది.

Tags:    

Similar News