విజ‌య్ ప్ర‌భుత్వం... 'బీజేపీకి జిరాక్స్': స్టాలిన్ హాట్ కామెంట్స్‌

త‌మిళ‌నాడులో ఏర్ప‌డిన నటుడు విజ‌య్ ప్ర‌భుత్వంపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Update: 2026-06-14 11:30 GMT

త‌మిళ‌నాడులో ఏర్ప‌డిన నటుడు విజ‌య్ ప్ర‌భుత్వంపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి జిరాక్స్ కాపీ మాదిరిగా విజ‌య్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని విమ‌ర్శించా రు. త‌మ డీఎంకే ఎమ్మెల్యేల కోసం తెర‌చాటు బేరాలుసాగిస్తున్నార‌ని.. ఇది అ నైతిక చ‌ర్య అని వ్యాఖ్యానించారు. ఇలాంటి చ‌ర్య లు కేవ‌లం కేంద్రంలోని బీజేపీకి మాత్ర‌మే ప‌రిమిత‌మ‌ని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇవే ప‌నులు ఇక్క‌డ విజ‌య్ కూడా చేస్తు న్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

ఇదేస‌మ‌యంలో మ‌రో ప్ర‌తిప‌క్ష పార్టీ అన్నాడీఎంకే నుంచి న‌లుగురు ఎమ్మెల్యేల‌ను విజ‌య్ త‌న‌వైపు తిప్పుకొన్నార‌ని స్టాలిన్ తెలిపారు. వారికి ఎలాంటి ఆశ‌లు చూపించార‌ని.. మంత్రి ప‌ద‌వులు ఇస్తామ‌ని ఆశ‌పెట్టారా? అని నిల‌దీశారు. ప్ర‌జ‌లు ఇచ్చిన గౌర‌వ ప్ర‌ద‌మైన మెజారిటీతోనే ప్ర‌భుత్వాన్ని ఐదేళ్లూ కొన‌సాగించ‌వ‌చ్చ‌ని.. కానీ, ఇలా బీజేపీ మాదిరిగా విజ‌య్ వ్య‌వ‌హ‌రిస్తే.. ప్ర‌జ‌లే అస‌హ్యించుకుంటున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌జ‌ల తీర్పును తాము గౌర‌వించామ‌ని.. అందుకే.. మెజారిటీ ఉన్నా లేకు న్నా.. అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించిన విజ‌య్‌కు తమ కూట‌మిలోని పార్టీల మ‌ద్ద‌తు కూడా ఇస్తామంటే ఓకే చెప్పాన‌న్నారు.

కానీ, విజ‌య్ మాత్రం ఫ‌క్తు బీజేపీకి జిరాక్స్ కాపీ మాదిరిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని స్టాలిన్ దుయ్య‌బ‌ట్టారు. ఇక‌, అధికార పార్టీ టీవీకేలో ముస‌లం పుట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని స్టాలిన్ వ్యాఖ్యానించారు. వైకుంఠ‌పురంలో ఓ మ‌హిళ‌ల‌పై కొంద‌రు లైంగిక దాడికి పాల్ప‌డ్డార‌ని.. బాధితురాలు.. నిందితులు ఇరువురు కూడా టీవీకే పార్టీకి చెందిన వారేన‌ని తెలిపారు. అయితే.. బాధితురాలిని ఆదుకుని నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల్సిన ప్ర‌భుత్వం.. బాధితురాలిని పార్టీ నుంచి బ‌హిష్క‌రించింద‌ని.. నిందితుల‌ను కాపాడే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ``ఇదేనా.. మ‌హిళ‌ల‌కు మీరిచ్చే గౌర‌వం`` అని సీఎం విజ‌య్ ను ఉద్దేశించి స్టాలిన్ ప్ర‌శ్నించారు.

మ‌న‌దే ప్ర‌భుత్వం..

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా.. డీఎంకేను ప్ర‌జ‌లు ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నార‌ని స్టాలిన్ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగి.. స్టాలిన్ స‌ర్కారు గ‌ద్దె దిగి రెండు నెల‌లు కూడా కాక‌ముందే..ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్రంలో మ‌హిళ‌లంతా త‌మ ప‌క్షానే ఉన్నార‌ని తెలిపారు. మ‌రింతగా ప్ర‌జ‌ల‌ను డీఎంకే వైపు న‌డిపించేందుకు మ‌హిళా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కృషి చేయాల‌ని స్టాలిన్ పిలుపునిచ్చారు. టీవీకే ప్ర‌భుత్వం ఐదు సంవ‌త్స‌రాలు కొన‌సాగాల‌నే తాను మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్న‌ట్టు చెప్పారు. ప్ర‌భుత్వాన్ని కూల‌దోసి.. తాము ఎప్ప‌టికీ అధికారంలోకి రాబోమ‌న్నారు. కానీ.. త‌నంత‌ట తానే కూలిపోయే ప‌రిస్థితి తెచ్చుకుంటున్నార‌ని విజ‌య్‌పై వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News