భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ ప్రధానిని కలిసిన ఎయిర్ చీఫ్.. అసలేం ఏం జరుగుతోంది?
భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దేశ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఉన్నత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి.;
భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దేశ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఉన్నత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. తాజాగా, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛ లభించిన నేపథ్యంలో, ఈ సమావేశంలో ఎలాంటి కీలక అంశాలు చర్చకు వచ్చాయో తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. అంతకుముందు నౌకాదళాధిపతి కూడా ప్రధానిని కలవడం దేశ రక్షణ రంగంలో జరుగుతున్న సన్నద్ధతను సూచిస్తోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ సమావేశమయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఈ భేటీ జరిగింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఈ సమావేశం జరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతకు ముందు రోజే, నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠీ కూడా ప్రధానిని ఆయన నివాసంలో కలుసుకున్నారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) సమావేశంలో ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడానికి త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. లక్ష్యాలు, దాడి సమయం వంటి విషయాలను వారే నిర్ణయించుకోవచ్చని సీసీఎస్ స్పష్టం చేసింది. ఇక శుక్రవారం సన్నద్ధతలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై భారత వాయుసేన యుద్ధ విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ విన్యాసాలు నిర్వహించడం జరిగింది.
2019లో పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన పాకిస్తాన్‌లోకి చొచ్చుకెళ్లి దాడి చేసింది. ఆ సమయంతో పోలిస్తే ఇప్పుడు రఫెల్ యుద్ధ విమానాలు, ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో భారత వాయుసేన శక్తి గణనీయంగా పెరిగింది. భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిర్ చీఫ్ మార్షల్, ప్రధాని మోదీల భేటీ అనేక ఊహాగానాలకు దారితీస్తోంది. ఈ సమావేశంలో దేశ రక్షణకు సంబంధించిన కీలకమైన వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై చర్చలు జరిగాయని భావిస్తున్నారు. వాయుసేన ప్రస్తుత సన్నద్ధత, సరిహద్దుల్లో నిఘా, అవసరమైతే చేపట్టవలసిన చర్యలపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.