'ఇది ఫైనల్'... మావోయిస్టులకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్!

తాజాగా బస్తర్‌ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన హోంమంత్రి.. 2026 మార్చి 31 నాటికి దేశం మావోయిస్టు రహితంగా మారుతుందని పునరుద్ఘాటించారు.;

Update: 2025-10-04 17:18 GMT

మార్చి 31, 2026 తర్వాత దేశంలో మావోయిస్టు అనేవాళ్లు కనిపించరని.. మావోయిస్టు రహిత భారతదేశం ఆవిష్కరించబోతున్నామని.. ఇప్పటికే అల్టిమేటం జారీ చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా... ఈ విషయంలో తగ్గేదేలే అని, వారితో ఎలాంటి మాటల్లేవని, మాట్లాడుకోవడాలు ఇకపై కుదరదని చెబుతూ.. ఉన్న ఆప్షన్ ఒక్కటే నని మరోసారి స్పష్టం చేశారు.

అవును... మావోయిస్టులను ఏరివేసే ప్రయత్నాలు కేంద్రం సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 మర్చి 31తర్వాత దేశంలో మావోయిస్టు అనేవాళ్లు కనిపించరని అమిత్ షా ఇప్పటికే నొక్కి చెప్పారు. ఆ వ్యాఖ్యలకు తగ్గట్లుగానే పోలీసులు ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో ఆయుధాలు వదిలేసి చర్చలకు వచ్చే విషయంపై కథనాలు వస్తున్నాయి.

మరోవైపు ఇలా ఆయుధాలు వదిలేసి చర్చలకు వచ్చే విషయంలో మావోయిస్టుల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్న పరిస్థితి. మరోవైపు కొంతకాలం ఈ కార్యక్రమాలు రద్దు చేసి మౌనం వహించాలనే అభిప్రాయాలు వారి మధ్య ఉన్నాయని అంటున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... మావోయిస్టులతో ప్రభుత్వం ఎటువంటి చర్చలు జరపదని.. ఆయుధాలు వదిలేసి లొంగిపోవడమే వారి ముందున్న ఆప్షన్ అని.. అలా ముందుకు వస్తే వారిని స్వాగతిస్తామని అన్నారు. తమ మాట విని లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వం నుంచి అందాల్సిన వివిధ ప్రయోజనాలు అందిస్తామని, పునరావాసం కల్పిస్తామని షా హామీ ఇచ్చారు.

తాజాగా బస్తర్‌ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన హోంమంత్రి.. 2026 మార్చి 31 నాటికి దేశం మావోయిస్టు రహితంగా మారుతుందని పునరుద్ఘాటించారు. ఇదే సమయంలో.. తమతో చర్చలు జరపాలని మావోయిస్టులు ప్రభుత్వాన్ని కోరుతున్నారని.. అయినా ఇప్పుడు వారితో మాట్లాడటానికి ఏముందని ఎదురు ప్రశ్నించారు.

బస్తర్‌ ప్రాంతంలో ఆయుధాలతో శాంతికి విఘాతం కలిగించే వారికి భద్రతా దళాలు తగిన సమాధానం ఇస్తాయని ఈ సందర్భంగా అమిత్ షా హెచ్చరించారు. ఇకపై గ్రామాల అభివృద్ధిని మావోయిస్టులు అడ్డుకోలేరని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు.

ప్రధానంగా... ఛత్తీస్‌ గఢ్ ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమ లొంగుబాటు విధానాన్ని రూపొందించిందని.. తద్వారా ఒకే నెలలో 500 మందికి పైగా లొంగిపోయారని చెప్పిన షా... మిగిలినవారూ లొంగిపోవాలని సూచించారు. ఒక గ్రామం నక్సలైట్ల నుండి విముక్తి పొందిన వెంటనే.. ఛత్తీస్‌ గఢ్ ప్రభుత్వం దాని అభివృద్ధి కోసం ₹ 1 కోటి ఇస్తుందని తెలిపారు.

నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ సభ్యుడు వేణుగోపాల్ అలియాస్ సోను.. ఆయుధాలు మానుకోవాలని పిలుపునివ్వడం, తెలంగాణకు చెందిన పౌర సమాజ సంస్థలు నక్సల్స్‌ తో చర్చలు ప్రారంభించాలని ప్రభుత్వానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

Tags:    

Similar News