ట్యాపింగ్‌కు 'మావో' కలర్!
తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి.;
తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా ఎవరు ఏ ఫోన్ ట్యాప్ చేయాలని అనుకున్నా.. టెలికం సంస్థలకు లేఖ రాయాలి. వారి నుంచి అనుమతులు తీసుకోవాలి. అనంతరం.. కొన్ని ఎంపిక చేసిన నెంబర్లను మాత్రమే టెలికం కంపెనీలకు పంపించడం ద్వారా ట్యాప్ చేసేందుకు అవకాశం ఉంది. అయితే.. ఈ విషయంలో బీఆర్ ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి తాజాగా కీలక విషయం వెలుగు చూసిం ది. అసలు ట్యాపింగ్ చేసేందుకు.. అప్పటి అధికారి ప్రభాకర్ రావు టెలికం కంపెనీలకు చెప్పిన విషయం ఏంటనేది తెలిసింది.
సుమారు 3250 మందికిపైగా ఫోన్లను ట్యాప్ చేశారని ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు. అయితే.. అప్పటికే పోలీసు ఎస్ ఐబీ అధికారి ప్రణీత్‌రావు.. ఎన్నికలు ముగిసిన వెంటనే కార్యాలయానికి చేరుకుని డేటాను ధ్వంసం చేసేశారు. దీంతో ఆ ఆధారాలు దాదాపు లేకుండా పోయాయి. అయితే.. టెలికం సంస్థలు.. ఎస్ ఐబీ(ఫోన్ ట్యాప్ చేసింది)కి ఇచ్చిన సమాచారాన్ని రెండు రూపాల్లో పంచుకున్నారు. 1) ఫోన్‌కు పంపించిన సందేశారు. 2) ఈమెయిల్‌కు పంపించిన సమాచారం. ఫోన్లకు పంపించిన సమాచారం పూర్తిగా నాశనం అయింది. అయితే.. ప్రస్తుతం దర్యాప్తుఅధికారులకు మాత్రం ఈమెయిల్ సమాచారం అందింది.
దీనిలోనూ ఆది నుంచిఉన్న మెయిళ్లు లేవు. చివరి దశలో ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు వంటివారు మరిచిపోయిన మెయిళ్లను మాత్రమే అధికారులు గుర్తించారు. ఇలా 650 ఫోన్లకు సంబంధించిన ట్యాపింగ్ వ్యవహారంపై కూపీ లాగారు. దీనిలో సినీ రంగం నుంచి మీడియా వరకు, రాజకీయ నేతల నుంచి ఇన్‌ఫ్లుయెన్సర్ల వరకు కూడా చాలా మంది ఉన్నారు. ఇదిలావుంటే.. అసలు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందన్న విషయంపై కీలక విషయం వెలుగు చూసింది.
``రాష్ట్రంలో మావోయిస్టులకు సహకరించేవారు పెరిగారు. ప్రభుత్వం దీనిపై(బీఆర్ ఎస్) సీరియస్‌గా ఉంది. అందుకే.. ఇలా మావోయిస్టులకు సహకరించే వారు.. ఎవరెవరితో మాట్లాడుతున్నారో తెలుసుకునేందుకు ట్యాప్ చేయాలని భావించాం`` అని ఎస్ ఐబీ చీఫ్ హోదాలో ప్రభాకరరావు టెలికం సంస్థలకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే వారు ట్యాపింగ్‌కు అవసరమైన సమాచారం చేరవేశారు. ఇదీ.. మొత్తంగా ట్యాపింగ్ కోసం ప్రభాకర్‌రావు వేసిన మావో కలర్!!.