నీలాంటోడు ఊరికి ఒక్కడుంటే చాలు.. ఆ వరుడి రిటర్న్ గిఫ్ట్ కు ఊరంతా ఫిదా

“వరుడి రిటర్న్ గిఫ్ట్ అంటే ఇదే” అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

Update: 2026-05-27 05:24 GMT

మామూలుగా పెళ్లిళ్లు అంటే వందలాది మంది అతిథులు.. భారీ విందులు.. ఖరీదైన అలంకరణలు.. బంగారు బహుమతులు గుర్తుకొస్తాయి. కానీ మహారాష్ట్రలో జరిగిన ఓ పెళ్లి మాత్రం పూర్తిగా భిన్నంగా నిలిచింది. వరుడు చేసిన ఒక వినూత్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. “వరుడి రిటర్న్ గిఫ్ట్ అంటే ఇదే” అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

గ్రామ ప్రజలందరికీ అద్భుతమైన కానుక

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన సిద్ధేశ్వర్ పేత్కర్ అనే యువకుడు తన వివాహాన్ని కేవలం ఒక కుటుంబ వేడుకగా కాకుండా సామాజిక బాధ్యతకు ప్రతీకగా మార్చాడు. సిద్ధేశ్వర్ పేత్కర్ తన పెళ్లి సందర్భంగా తన గ్రామ ప్రజలందరికీ అద్భుతమైన, ఎవరూ ఊహించని కానుకను అందించాడు. గ్రామాల్లోని మొత్తం 3,465 మంది ప్రజలకు ఒక్కొక్కరికి ఏడాదిపాటు రూ.1 లక్ష ప్రమాద బీమా చేయించాడు. అంటే మొత్తం గ్రామానికి కలిపి సుమారు రూ.33.6 కోట్ల ఆర్థిక భరోసాను రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చినట్టయ్యింది. పెళ్లి వేడుకకు వచ్చిన అతిథులు ఈ నిర్ణయం తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యారు. చాలా మంది దీనిని “నిజమైన మానవత్వం”గా అభివర్ణిస్తున్నారు.

* ఆర్భాటాలు వద్దు.. సామాజిక భద్రతే ముద్దు!

ఈ రోజుల్లో పెళ్లిళ్లలో లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేయడం సాధారణంగా మారిపోయింది. కానీ సిద్ధేశ్వర్ మాత్రం ఆ డబ్బును సమాజానికి ఉపయోగపడేలా వినియోగించాలనే అద్భుతమైన ఆలోచన చేశాడు. ప్రమాదం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో కనీస భద్రత గ్రామ ప్రజలకు ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. ముఖ్యంగా పేద కుటుంబాలకు ఇలాంటి బీమా ఎంతో ఉపయోగపడుతుందని ఆయన బలంగా భావించాడు. "పెళ్లి అనేది కేవలం ఇద్దరి జీవితాల కలయిక మాత్రమే కాదు.. మనల్ని ఆదరించిన సమాజానికి, మన తోటి ప్రజలకు మేలు చేసే ఒక గొప్ప అవకాశం కూడా!" అని సిద్ధేశ్వర్ పేత్కర్ ఈ ప్రకటన చేశారు.

సోషల్ మీడియాలో వైరల్.. నెటిజన్ల సలాం

సిద్ధేశ్వర్ చేసిన ఈ పని కేవలం ఒక రిటర్న్ గిఫ్ట్ మాత్రమే కాదు, సమాజానికి ఇచ్చిన గొప్ప సందేశంగా మారింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ‘నువ్వు దేవుడివి సామీ” “నీలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి ప్రతి ఊర్లో ఒకరు ఉంటే చాలు, ఇక దేశానికి తిరుగుండదు” అంటూ నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

గ్రామ పెద్దలు కూడా సిద్ధేశ్వర్‌ను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. నేటి యువతకు ఆయన ఒక గొప్ప ఆదర్శంగా నిలిచారని వారు కొనియాడారు. సాధారణంగా పెళ్లిళ్లలో ఖరీదైన బహుమతులు, ఆర్భాటాలు, డీజేలు కనిపిస్తుంటాయి. కానీ ప్రజల భద్రత కోసం బీమా చేయించడం వంటి వినూత్న ఆలోచన చేయడం చాలా అరుదని వారు అభిప్రాయపడుతున్నారు.

సామాజిక బాధ్యతకు జరిగిన వేడుక

ఈ ఘటన మరోసారి మన సమాజానికి ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేసింది. మన దగ్గర ఉన్న సంతోషాన్ని, సామర్థ్యాన్ని ఇతరులతో పంచుకుంటే అది మరింత విలువైనదిగా మారుతుంది. సిద్ధేశ్వర్ పేత్కర్ చేసిన ఈ వినూత్న కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తినిస్తోంది. నిజంగా చెప్పాలంటే… ఇది కేవలం ఓ పెళ్లి కాదు, సామాజిక బాధ్యతకు జరిగిన ఒక అద్భుత వేడుకగా చెప్పొచ్చు.

Tags:    

Similar News