'స్థానిక' వాటాలు.. లెక్క కుదరడం లేదా? టీడీపీ, జనసేన తలోమాట!

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమి ధర్మానికి కట్టుబడి తాము కొంత తగ్గామని, ఇప్పుడు తగ్గేదేలే అంటూ జనసేన నేతలు ప్రకటనలు చేస్తున్నారు.

Update: 2026-07-17 12:30 GMT

స్థానిక ఎన్నికల్లో పోటీపై కూటమి నేతల ప్రకటనలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. స్థానిక ఎన్నికలకు సిద్ధమవ్వాలంటూ కేడర్ కు పిలుపునిస్తున్న అగ్ర నేతలు పోటీపై భిన్న ప్రకటనలు చేస్తున్నారు. దీంతో ఎన్నికల్లో పోటీపై టీడీపీ, జనసేన పార్టీల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వచ్చే సెప్టెంబరులో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని, కేడర్ రెడీగా ఉండాలంటూ మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. మూడు పార్టీల కూటమిగా పోటీ చేస్తామని, ప్రతి ఒక్కరూ విజయంపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. ఇదే సమయంలో కూటమి పార్టీల సమన్వయంలో స్థానిక ఎన్నికల్లో పోటీపై అవగాహన కుదరిందని, టీడీపీ 80 శాతం సీట్లలోను జనసేన 15 శాతం, బీజేపీ 5 శాతం సీట్లలో పోటీ చేస్తుందని మంత్రి లోకేశ్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీనికి భిన్నంగా జనసేనకు చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది.

స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై మంత్రి లోకేశ్ ప్రతిపాదనలకు భిన్నంగా జనసేనకు చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ‘స్థానిక ఎన్నికల్లో జనసేన బలాబలాలు ఆధారంగానే పోటీ చేస్తామని, సార్వత్రిక ఎన్నికల్లో మాదిరిగా నాలుగు సీట్లు తగ్గించుకుని పోటీ చేసే పరిస్థితి ఉండదు’ అంటూ మంత్రి మనోహర్ స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి లోకేశ్ ప్రతిపాదించిన సర్దుబాటు లెక్కల ప్రకారం 15 శాతం సీట్లు తీసుకోడానికి జనసేన సిద్ధంగా లేనట్లు జనసేన పార్టీ స్పష్టమైన ప్రకటన చేసిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమి ధర్మానికి కట్టుబడి తాము కొంత తగ్గామని, ఇప్పుడు తగ్గేదేలే అంటూ జనసేన నేతలు ప్రకటనలు చేస్తున్నారు. తమ బలానికి తగినట్లు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఫలితంగా మంత్రి లోకేశ్ చెప్పిన లెక్కకు అంగీకరించేది లేదన్నట్లు జనసేన పార్టీ వైఖరి ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కూటమి సర్దుబాటులో భాగంగా నామినేటెడ్ పదవుల విషయంలో 80:15:5 ప్రాతిపదికన పదవులను పంచుకున్నారని చెబుతున్నారు. ఇప్పుడు ఈ విధంగానే స్థానిక ఎన్నికల్లో సరిపెట్టుకోమంటే తమకు పోటీ చేసే అవకాశం రాదని జనసేనలో ఎక్కువ మంది నేతలు ఆందోళన చెందుతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి నాదెండ్ల ఈ విషయంలో కల్పించుకుని జనసేన కేడర్ కు భరోసా ఇచ్చేలా మాట్లాడారని అంటున్నారు. కూటమిని బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని చెబుతూనే తమ బలానికి తగినట్లు సీట్లు ఇవ్వాలని చెప్పడం ద్వారా స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు దక్కించుకునేలా జనసేన ఒత్తిడి చేసేలా సంకేతాలు పంపుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.

కాగా, రెండు రోజుల క్రితం ఏలూరు జిల్లా కైకలూరులో నిర్వహించిన జనసేన చర్చావేదికలో మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడం కన్నా, గెలిచే స్థానాల్లో పోటీ చేయడానికి ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయనపై కేడర్ నుంచి ఒత్తిడి ఎక్కువైందని అంటున్నారు. ఇదే సమయంలో జనసేనకు 15 శాతం సీట్లు ఇస్తామని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించడంతో వారి ఆందోళన మరింత పెరిగిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ జోక్యం చేసుకుని కార్యకర్తల ఆందోళనలను తగ్గించేలా మాట్లాడారని అంటున్నారు. మొత్తానికి మంత్రులు లోకేశ్, నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు బట్టి కూటమిలో స్థానిక ఎన్నికల సీట్ల సర్దుబాటు కొంత సంక్లిష్టంగా మారే పరిస్థితి ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.



Tags:    

Similar News