బాప్ రే! డి-కంపెనీ బెదిరించినా డోంట్ కేర్.. ఏటా వార‌సుడికి ఫెరారీ కానుకిచ్చే IPL డాడీ!!

ఆర్థిక, పరిపాలనాపరమైన దర్యాప్తులతో 2010లో భారతదేశాన్ని వీడి లండన్‌లో స్థిరపడిన ఈ వివాదాస్పద వ్యాపారవేత్త తాజాగా తన వ్యక్తిగత జీవితం- విలాసవంతమైన జీవనశైలికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను మీడియాతో షేర్ చేసుకున్నారు.

Update: 2026-06-05 06:33 GMT

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మ‌న్ లలిత్ మోదీ అంటేనే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. ఐపీఎల్ ప్రారంభంలో అండర్ వరల్డ్ మాఫియా దావూద్ ఇబ్రహీం `డి-కంపెనీ` చంపేస్తామ‌ని బెదిరించినా లెక్కచేయకుండా లీగ్‌ను విజయవంతంగా నడిపించి క్రికెట్ ప్రపంచాన్ని శాసించారు. ఇటీవ‌ల మాజీ విశ్వ‌సుంద‌రి సుస్మితాసేన్ తో ప్రేమాయ‌ణం, బ్రేక‌ప్ కార‌ణంగాను నిరంత‌ర వార్త‌ల్లో నిలిచిన పాపుల‌ర్ ప‌ర్స‌నాలిటీ ఆయ‌న‌. ఆర్థిక, పరిపాలనాపరమైన దర్యాప్తులతో 2010లో భారతదేశాన్ని వీడి లండన్‌లో స్థిరపడిన ఈ వివాదాస్పద వ్యాపారవేత్త తాజాగా తన వ్యక్తిగత జీవితం- విలాసవంతమైన జీవనశైలికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను మీడియాతో షేర్ చేసుకున్నారు.

తన కొడుకు పుట్టినరోజుకు ప్రతియేటా ఒక లగ్జరీ ఫెరారీ కారును బహుమతిగా ఇచ్చే విచిత్రమైన సంప్రదాయాన్ని లలిత్ మోదీ కొనసాగిస్తున్నారు. తన కుమారుడికి 21 ఏళ్లు నిండినప్పటి నుండి ప్రతి సంవత్సరం ఒక ఫెరారీని కానుకగా ఇస్తున్నానని.. ప్రస్తుతం అతడి వద్ద 12 ఫెరారీ కార్లు ఉన్నాయని మోదీ వెల్లడించారు. తన బాల్యంలో తండ్రి నుండి ఆశించిన వస్తువులు దక్కకపోవడమే తన పిల్లల విషయంలో ఇంతటి విలాసవంతమైన కానుకలు ఇవ్వడానికి అస‌లైన కారణమని పేర్కొన్నారు.

తాజా ఇంటర్వ్యూలో లలిత్ మోదీ తన పెంపకం, సంపదపై తన అభిప్రాయాలను నిస్సంకోచంగా వెల్ల‌డించారు. ``నాలుగు ప‌దుల వ‌య‌సులో క‌నీసం నా పుట్టినరోజున‌ నాకంటూ వోన్ ఫెరారీ అయినా లేదు. నా తండ్రి నాకు ఎప్పుడూ అలాంటివి కొనివ్వలేదు.. చివరకు నా బావ నాకు దానిని బహుమతిగా ఇచ్చారు!`` అని మోదీ తన గతాన్ని గుర్తుచేసుకున్నారు. చిన్నతనంలో కోరికలు తీరకపోవడం వల్ల కలిగిన అసంతృప్తి తనపై తీవ్ర ప్రభావం చూపిందని.. అందుకే తన పిల్లలు దేనికోసం ఎదురుచూడకూడదనే ఉద్దేశంతోనే వారు కోరినవన్నీ ఇస్తున్నట్లు సమర్థించుకున్నారు.

అయితే పిల్లలకు ఇలాంటి మితిమీరిన లగ్జరీలను అలవాటు చేయడం సరైన పెంపకమేనా? అనే ప్రశ్నకు మోదీ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. సంపదను, విలాసాలను చిన్నప్పటి నుంచే పుష్కలంగా అందుబాటులో ఉంచడం వల్ల పిల్లల్లో డబ్బుపై అత్యాశ తగ్గుతుందని వాదించారు. ప్రస్తుతం 31 ఏళ్ల వయసున్న తన కుమారుడు ఆర్థిక విషయాల్లో ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాడని...నాన్న, మీ క్రెడిట్ కార్డ్ బిల్లులు చాలా ఎక్కువగా వస్తున్నాయి.. కొంచెం ఖర్చులు తగ్గించుకోండి! అని ఇప్పుడు కొడుకే తనకు సలహా ఇస్తున్నాడని మోదీ నవ్వుతూ చెప్పారు.

తన కుటుంబ నేపథ్యం గురించి చెబుతూ.. తన తాతమ్మలు ఎంతో సాంప్రదాయబద్ధంగా ఉండేవారని.. కానీ తన తండ్రి, బాబాయ్‌లు మాత్రం ఢిల్లీలోనే అత్యంత విలాసవంతమైన పార్టీలను హోస్ట్ చేసే వారని మోదీ పేర్కొన్నారు. ``మా నాన్న ప్రపంచంలోనే అతిపెద్ద ప్లేబాయ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు`` అని చెబుతూ... బహుశా ఆ లక్షణాలు తనకూ అబ్బి.. తాను దానిని మరో స్థాయికి తీసుకువెళ్లానంటూ లలిత్ మోదీ వ్యాఖ్యానించారు.

మోదీ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి సుస్మితాసేన్ మాత్ర‌మే అతడి ల‌వ్ లైఫ్ లో మొద‌టి స‌హ‌చ‌రి కాద‌ని కూడా దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.

Tags:    

Similar News