బిగ్ అప్ డేట్... ప్రపంచ పారిశ్రామిక పటంలో కుప్పం ముద్ర!

అవును... రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అనేది నెగిటివ్ సౌండ్ అయితే.. అదే రాజు తలచుకుంటే అభివృద్ధికి కొదవా అనేది పాజిటివ్ సౌండ్, ప్రస్తుతం ఏపీలో బలంగా వినిపిస్తోన్న సౌండ్ అని అంటున్నారు పరిశీలకులు.;

Update: 2025-11-09 06:06 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రం పారిశ్రామికంగా ఊహించని స్థాయిలో అభివృద్ధి చెందుతుందనే కామెంట్లు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అటు ఐటీ పరిశ్రమలతో పాటు మరెన్నో పరిశ్రమలు ఏపీ వైపు అడుగులు వేస్తున్నాయి. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ దీనికి తాజా ఉదాహరణ కాగా... అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా కుప్పానికి గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం.

అవును... రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అనేది నెగిటివ్ సౌండ్ అయితే.. అదే రాజు తలచుకుంటే అభివృద్ధికి కొదవా అనేది పాజిటివ్ సౌండ్, ప్రస్తుతం ఏపీలో బలంగా వినిపిస్తోన్న సౌండ్ అని అంటున్నారు పరిశీలకులు. అందుకు కారణం ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్థలు ఏపీవైపు అడుగులు వేయడమే. ఈ క్రమంలో తాజాగా ప్రపంచ పారిశ్రామిక పటంలో కుప్పం ముద్ర కనిపించే కీలక పరిణామం చోటు చేసుకుంది.

ఇందులో భాగంగా... ప్రఖ్యాత ఆదిత్య బిర్లా గ్రూప్‌ కు చెందిన హిందాల్కో ఇండస్ట్రీస్ కుప్పంలో కొత్త అల్యూమినియం ఎక్స్‌ ట్రూషన్ ప్లాంట్‌ ను ఏర్పాటు చేయడానికి రూ.586 కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఈ ప్లాంట్ ఐఫోన్‌ ల కోసం హై-గ్రేడ్ అల్యూమినియం ఛాసిస్‌ ను ఉత్పత్తి చేస్తుంది. అంటే.. ఈ కీలకమైన ఆపిల్ భాగాలు ఇప్పుడు కుప్పంలో తయారు చేయబడతాయన్నమాట. ఇది కుప్పానికి మహా గొప్ప శుభవార్త!

మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు!:

ఈ సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆదిత్య బిర్లా గ్రూపుకు చెందిన హిందాల్కో ఇండస్ట్రీస్‌ రాష్ట్రానికి రావడం మన ఎలక్ట్రానిక్స్‌ ఎకో సిస్టంలో కీలక మలుపని అన్నారు. ఈ కీలక పరిణామం ద్వారా యాపిల్‌ గ్లోబల్‌ సప్లై చైన్‌ లో ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామి కానుందని తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఎక్స్ వేదికగా వెల్లడించారు.

ఇందులో భాగంగా... కుప్పంలో రూ.586 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక అల్యూమినియం ఎక్స్‌ ట్రూజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు కాబోతుందని.. దీనిద్వారా సుమారు 613 మందికి ప్రత్యక్షంగా, మరెందరికో పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని వెల్లడించారు. వేగవంతమైన అనుమతులు, ప్రోత్సాహకాల కారణంగానే ఇది సాధ్యమైందని తెలిపారు.

ఇదే సమయంలో... బెంగళూరుకు 120 కి.మీ, చెన్నైకి 200 కి.మీ దూరంలో వ్యూహాత్మక స్థానంలో కుప్పం ఉందని చెప్పిన నారా లోకేష్... భవిష్యత్తులో స్మార్ట్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల తయారీలో గ్లోబల్‌ తయారీ కేంద్రంగా ఈ ప్రాంతం మారనుందని.. 2027 మార్చి నాటికి ఈ యూనిట్‌ నుంచి పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

ప్రపంచానికి దిక్సూచిగా కుప్పం!:

మరోవైపు శనివారం కుప్పం నియోజకవర్గంలో 241 ఎకరాల్లో రూ.2,203 కోట్లతో ఏడు పరిశ్రమలకు వర్చువల్ విధానంలో సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన.. భూసేకరణకు రైతులు సహకరించారని.. నాయకులు సమిష్టిగా పనిచేసారని అన్నారు. ప్రతి ఇంటి నుంచీ ఒక్కొక్కరు వ్యాపారవేత్తగా ఎదగాలని, అదే తన లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.

Tags:    

Similar News