జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్ట్.. అమరావతి మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలే కారణమా ?

సాక్షి ఛానెల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల వివాదంలో ఆయన అరెస్టయ్యారు.;

Update: 2025-06-09 06:07 GMT

సాక్షి ఛానెల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల వివాదంలో ఆయన అరెస్టయ్యారు. ఈ ఘటన జర్నలిస్టు కాలనీలోని హైదరాబాద్‌ లోని ఆయన ఇంట్లోనే జరిగింది. ఈ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా జర్నలిజం, రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనం సృష్టించింది. కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి టీవీలో నిర్వహించిన ఒక చర్చా కార్యక్రమంలో, జర్నలిస్ట్ కృష్ణంరాజు "అమరావతి వేశ్యల రాజధాని" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున నిరసనలకు దారితీశాయి. అమరావతి రైతులు, మహిళలు ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి రైతులు, మహిళల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కృష్ణంరాజుతో పాటు, ఆ డిబెట్‌ను నిర్వహించిన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపైనా, సాక్షి యాజమాన్యంపైనా కూడా కేసులు నమోదయ్యాయి. కొమ్మినేనిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు, గుంటూరుకు తరలిస్తున్నారు.

సాక్షి ఛానెల్‌లో జరిగిన చర్చలో కృష్ణంరాజు అమరావతి గురించి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మహిళలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను మహిళలతో సహా పలువురు ప్రముఖులు ఖండించారు. ఈ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా, షో నిర్వహిస్తున్న కొమ్మినేని అడ్డుకోకపోవడంపై కూడా పలువురు ప్రశ్నించారు. అందుకే ఆయనపైనా కేసు నమోదైంది. ఈ కేసులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సహా పలువురు ప్రముఖులు మహిళలను కించపరిచేలా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే తేల్చి చెప్పారు.

కృష్ణంరాజు కోసం పోలీసుల గాలింపు

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుపైనా తుళ్లూరులో ఫిర్యాదు నమోదైంది. కృష్ణంరాజు విజయవాడలోని అయోధ్య నగర్‌లో నివసిస్తున్నారు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి వెళ్ళగా, ఇంటికి తాళం వేసి ఉంది. ప్రస్తుతం కృష్ణంరాజు ఎక్కడ ఉన్నారనే సమాచారం లేదు. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

Tags:    

Similar News