80 ఏళ్ల తర్వాత కేజీఎఫ్ ఓపెన్ .. భారత్‌కు బంగారు పండగ?

కర్ణాటక రాష్ట్రంలోని చారిత్రక కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF) మళ్లీ తెరుచుకోబోతున్నాయన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.;

Update: 2025-06-16 18:00 GMT

కర్ణాటక రాష్ట్రంలోని చారిత్రక కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF) మళ్లీ తెరుచుకోబోతున్నాయన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఏకంగా 80 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఈ బంగారు గనులకు కొత్త జీవం పోసేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోని భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (BGML) ఆధ్వర్యంలో 1,003 ఎకరాల విస్తీర్ణంలో మైనింగ్ పునఃప్రారంభానికి రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది నిజంగా దేశ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా కర్ణాటకకు ఒక శుభవార్త.

-80 ఏళ్ల బంగారు చరిత్ర.. మళ్లీ ప్రారంభం

KGF చరిత్ర ఎంతో ప్రాచీనమైనది. చోళులు, విజయనగర సామ్రాజ్యం, మైసూరు రాజులు కూడా ఇక్కడ బంగారు తవ్వకాలు జరిపినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. అయితే, ఆధునిక పద్ధతిలో 1880లో బ్రిటిష్ వారు తవ్వకాలు ప్రారంభించారు. 2001 వరకు ఈ తవ్వకాలు నిరాటంకంగా కొనసాగాయి. ఈ నడుమ దాదాపు 900 టన్నుల బంగారం వెలికి తీసినట్లు లెక్కలు చెబుతున్నాయి. కానీ, 2001లో నష్టాల కారణంగా తవ్వకాలు పూర్తిగా నిలిచిపోయాయి. అప్పటి నుండి KGF ఒక శిథిలావస్థకు చేరి, ఒకప్పుడు వెలుగు జిలుగుల ప్రాంతం చీకట్లోకి జారిపోయింది. ఇప్పుడు, 80 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆ గనులకు మళ్ళీ ప్రాణం పోస్తున్నారు.

23 టన్నుల బంగారం మళ్లీ వెలికితీయనున్నారు!

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతితో 13 టైలింగ్ డంప్‌లలో ఉపరితల మైనింగ్ జరగనుంది. అంటే, గతంలో తవ్వకాల ద్వారా ఏర్పడిన వ్యర్థ కుప్పల నుండి మళ్లీ బంగారం వెలికితీస్తారు. ఇందులో దాదాపు 32 మిలియన్ టన్నుల గ్రేడెడ్ మెటీరియల్ ఉండగా, దానిలో నుంచి 23 టన్నుల బంగారం వెలికితీయవచ్చని అంచనా. ఆధునిక హిప్ లీచింగ్, కార్బన్-ఇన్-పల్స్ వంటి సాంకేతికతలను ఉపయోగించి ఏటా 750 కిలోల బంగారం ఉత్పత్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇది ఒక పెద్ద ఎత్తున జరగనున్న ప్రాజెక్టు.

-దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి

ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశం భారత్. ప్రతి సంవత్సరం వందల టన్నుల బంగారం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల మన విదేశీ మారకద్రవ్యం గణనీయంగా ఖర్చవుతుంది. KGF గనుల పునరుద్ధరణతో దేశ విదేశీ మారకద్రవ్య భద్రత మెరుగుపడనుంది. దాదాపు లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని దేశంలోని నుంచే ఉత్పత్తి చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి కూడా దోహదపడుతుంది.

-స్థానిక అభివృద్ధికి దారి

KGF మళ్లీ ప్రారంభమైతే కేవలం బంగారం మాత్రమే కాదు, ప్రాంతీయ ఉపాధి అవకాశాలు, వాణిజ్య కార్యకలాపాలు, లాజిస్టిక్స్ అభివృద్ధి కూడా ఊపందుకుంటాయి. 2001 తర్వాత శిథిలావస్థకు చేరిన KGF పట్టణం మళ్లీ కొత్త ఊపుతో బతికే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక పెద్ద ప్రోత్సాహం.

ఇన్ని దశాబ్దాల విరామం తరువాత కోలార్ బంగారు గనులు తెరుచుకుంటున్నాయన్న వార్త దేశానికి, ముఖ్యంగా ఆర్థిక రంగానికి ఒక శుభవార్త. దేశంలో బంగారం అవసరాలను తగ్గిస్తూ, విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేస్తూ, స్థానిక అభివృద్ధికి దారి తీర్చే ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావాలని ఆశిద్దాం. KGF మరోసారి భారత బంగారు రాజధానిగా నిలవాలని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పునరుద్ధరణ భారతదేశ ఆర్థిక భవిష్యత్తుకు ఎంతవరకు దోహదపడుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News