కేరళ నర్సుకు ఈ నెల 16న మరణశిక్ష అమలు... కేసు వివరాలివే!

వివరాళ్లోకి వెళ్తే... కేరళలోని పాలక్కాడ్‌ జిల్లాకు చెందిన నిమిష ప్రియ.. నర్సు కోర్సు పూర్తి చేశారు.;

Update: 2025-07-09 01:30 GMT

యెమెన్ జాతీయుడిని హత్య చేసినందుకు ఆ దేశంలోని న్యాయస్థానం కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు మరణశిక్ష పడగా.. ఆ శిక్షను ఈ నెల 16న అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే యెమెన్‌ దేశాధ్యక్షుడు రషాద్‌ అల్‌ అలిమి ఇందుకు ఆమోదం తెలపడంతో.. శిక్ష అమలు చేయనున్నారు. ఈ మేరకు స్థానిక మీడియా కథనాలు వెల్లడించింది.

అవును... యెమెన్‌ లో వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో కేరళ నర్సు నిమిష ప్రియకు మరణశిక్ష పడగా... ఆ శిక్షను ఈ నెల 16న ఆమెకు శిక్ష అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విషయాన్ని కేరళలోని ఆమె కుటుంబీకులకు యెమెన్‌ జైలు అధికారులు తెలియజేసినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

వివరాళ్లోకి వెళ్తే... కేరళలోని పాలక్కాడ్‌ జిల్లాకు చెందిన నిమిష ప్రియ.. నర్సు కోర్సు పూర్తి చేశారు. అనంతరం 2008లో యెమెన్‌ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరారు. ఈ క్రమంలో.. 2011లో వివాహం చేసుకున్న ఆమె అక్కడే ఓ క్లినిక్‌ ఓపెన్ చేయాలనుకున్నారు. ఈ సమయంలో... అల్ అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్ను ప్రారంభించారు.

దీనికి ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక తలాల్‌ అదిబ్‌ మెహది అనే వ్యక్తిని నిమిష ప్రియ - థామస్‌ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకొన్నారు. అయితే.. కొన్నేళ్ల తర్వాత ఆమె భర్త, కుమార్తె కేరళకు వచ్చేయగా... నిమిష మాత్రం యెమెన్‌ లోనే ఉంటూ ఆ మెడికల్ కౌన్సిల్ సెంటర్‌ ను కొనసాగించారు.

ఈ సమయంలో నిమిష ప్రియను తన భార్యగా పేర్కొంటూ మెహది వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు! ఈ క్రమంలో ఆమె పాస్‌ పోర్టు లాక్కొన్నాడు. దీంతో.. అతడిపై 2016లో ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలో.. 2017లో మెహదికి మత్తుమందు ఇచ్చి తన పాస్‌ పోర్టును స్వాధీనం చేసుకోవాలని ఆమె భావించింది.

అయితే.. ఆ మత్తు మందు మోతాదు కాస్తా ఎక్కువవడంతో అతడు చనిపోయాడు. దీంతో ఆమె మృతదేహాన్ని ఓ వాటర్‌ ట్యాంక్‌ లో పడేసింది. అనంతరం అక్కడి నుంచి సౌదీకి పారిపోతుండగా ఆమెను అరెస్టు చేశారు. ఈ కేసులోనే ఆమెకు మరణశిక్ష పడింది. అయితే, ప్రియను కాపాడేందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని భారత విదేశాంగ శాఖ ఇటీవల పేర్కొన్న నేపథ్యంలోనే.. తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

Tags:    

Similar News