రిజల్ట్ కు ముందే కాంగ్రెస్‌లో కుర్చీలాట..!
అతిపెద్ద పార్టీ కావడం.. 134 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న పురాతన పార్టీగా గుర్తింపు పొందడంతో పాటు అనేకమంది సీనియర్లు పదవుల కోసం పోరాడుతూ ఉంటారు.;
కాంగ్రెస్ పార్టీలో కుర్చీలాట సహజం. అతిపెద్ద పార్టీ కావడం.. 134 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న పురాతన పార్టీగా గుర్తింపు పొందడంతో పాటు అనేకమంది సీనియర్లు పదవుల కోసం పోరాడుతూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం అంతర్గత కుమ్ములాటలు, నాయకుల మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉంటుంది. అయితే చిత్రం ఏంటంటే ఎన్నికల ఫలితం ఇంకా రాకముందే నాయకులు ఒకరికొకరు సిగపట్లు పడుతున్నారు. ముఖ్యమంత్రి పీఠం మాదంటే మాదేనని నాయకుల మధ్య కీచులాటలు జరుగుతున్నాయి.
ఇది చిత్రంగా ఉన్నప్పటికీ వాస్తవం. కేరళలో ఈనెల 9న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వీటి ఫలితం రావడానికి ఇంకా దాదాపు మూడు వారాలకు పైగా సమయం ఉంది. మే నాలుగున గానీ ఫలితం రాదు. కానీ ఇంతలోనే కేరళలో ముఖ్యమంత్రి పీఠంపై కీలక నాయకులు మీడియా ముందు బహిరంగ ప్రకటనలు చేసుకుంటున్నారు. మాకంటే మాకేనని చెప్పుకుంటున్నారు. వీరిలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మాజీ ఇన్చార్జిగా ఉన్న కేసి వేణుగోపాల్ కూడా ఉన్నారు.
దీంతో పాటు సీనియర్ నాయకుడు సతీష్ అదే విధంగా రమేష్ చెన్నితల కూడా పోటీ పడుతున్నారు. వాస్తవానికి రిజల్ట్ ఇంకా రాలేదు. అసలు ఏ పార్టీ గెలుస్తుంది అనే విషయంపై స్పష్టత లేదు. అయినప్పటికీ ముఖ్యమంత్రి పీఠంపై ఇప్పుడే వివాదాలు చర్చనీయాంశంగా మారింది. అధికార పక్షానికి ఆయుధాలు అప్పగించేలాగా పరిస్థితి మారిపోయింది. సీఎం విజయన్ ఈ విషయంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు మీ ప్రభుత్వం వస్తుందన్న గ్యారెంటీ ఏముందని ఆయన ప్రశ్నించారు.
అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పీఠంపై కుమ్ములాటలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు అధిష్టానం మాత్రం ఇప్పుడు ఎవరూ మాట్లాడొద్దు రిజల్ట్ రానివ్వండి అని స్పష్టం చేసింది. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ పక్ష నాయకుడిని ఎంపిక చేసే విషయంపై ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. అయినా కూడా ముఖ్యమంత్రి పీఠంపై నాయకులు ఎవరికి వారు వ్యాఖ్యలు చేస్తున్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ సియాజ్ కూడా ఈ రేసులో ఉన్నారు. ఎర్నాకులం నుంచి ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఎవరు కాలేదని కాబట్టి ఎర్నాకులం నుంచి ప్రాతినిధ్యం వహించే వ్యక్తికి ముఖ్యమంత్రి పీఠం అప్పగించాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది ఆయనే. దీంతో ముఖ్యమంత్రి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో రిజల్టుకు ముందే హాట్ టాపిక్ గా మారడం విశేషం.