ఎర్ర కోట గెలుస్తుందా...కామ్రేడ్స్ ఉనికి నిలుస్తుందా ?

కేరళ రాష్ట్రానికి ఈ నెల 9న ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 140 అసెంబ్లీ సీట్లకు గానూ జరిగే ఎన్నికల్లో విజేత ఎవరు కాబోయే సీఎం ఎవరు అన్నది కేరళ రాష్ట్ర ప్రజలు నిర్ణయించనున్నారు.;

Update: 2026-04-09 03:06 GMT

కేరళ రాష్ట్రానికి ఈ నెల 9న ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 140 అసెంబ్లీ సీట్లకు గానూ జరిగే ఎన్నికల్లో విజేత ఎవరు కాబోయే సీఎం ఎవరు అన్నది కేరళ రాష్ట్ర ప్రజలు నిర్ణయించనున్నారు. ఇదిలా ఉంటే కేరళ కామ్రేడ్స్ కి ఒక విధంగా కంచుకోట. ఇప్పటికి ఏడు దశాబ్దాల నుంచి కమ్యూనిస్టులు అక్కడ పాగా వేస్తూ వస్తున్నారు. అనేక దఫాలుగా వారు గెలిచి ప్రభుత్వాలను నడుపుతున్నారు. ఇక కేరళ తరువాతనే దేశంలోని ఇతర రాష్ట్రాలను కూడా కామ్రేడ్స్ గెలుచుకున్నారు. అందులో పశ్చిమ బెంగాల్, త్రిపుర వంటివి ఉన్నాయి. అయితే బెంగాల్ 2011 నుంచి పోయింది. త్రిపుర కూడా బీజేపీ పాలనలోకి వెళ్ళిపోయింది. ఇక మిగిలింది ఒక్కటే రాష్ట్రం. అదే కేరళం. అక్కడ కూడా ఎర్ర కోట గెలవకపోతే కామ్రేడ్స్ ఉనికి నిలుస్తుందా అన్న చర్చ సాగుతోంది.

రెండవ ఎన్నికల్లోనే :

ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 1952 నుంచి రాజ్యాంగ రచన తరువాత ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. అలా రెండవ ఎన్నికలు 1957లో జరిగినపుడే కేరళలో తొలిసారి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాతు అయింది. అలా ఈఎం ఎస్ నంబూద్రిపాద్ ముఖ్యమంత్రిగా కేరళలో ఎర్రన్నల పాలన స్టార్ట్ అయింది. అయితే 1959లో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని నాటి కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూల్చేసింది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఆ మీదట చూస్తే ఒక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే మరో ఎన్నికలో కమ్యూనిస్టులు గెలుస్తూ వస్తున్నారు. ఇది ఆనవాయితీగా మారుతోంది.

పదేళ్ళుగా అధికారం :

ఇక కేరళలో 2016 నుంచి పదేళ్ళుగా కమ్యూనిస్టుల పాలన సాగుతోంది. పినరయి విజయన్ సీఎం గా మేలు అయిన పాలనే అందించారు. అయితే విమర్శలు ఉన్నాయి. ప్రజా వ్యతిరేకత ఉంది దాని కంటే మించి బీజేపీతో లోపాయి కారీగా కామ్రేడ్స్ లాలూచీ పడుతున్నారు అన్న కాంగ్రెస్ ఆరోపణలు జనంలోకి వెళ్ళిపోయాయి. దాంతో ఈసారి కేరళలో పెద్ద సంఖ్యలో మైనారిటీలు కాంగ్రెస్ వైపునకు మొగ్గు చూపిస్తున్నారు అన్న అంచనాలు ఉన్నాయి. దాంతో కామ్రేడ్స్ కి కష్టకాలమే దాపురిస్తుందా అన్న చర్చ సాగుతోంది. మధ్యలో పోటీకి దిగిన బీజేపీ ఎవరి ఓట్లు చీలుస్తుందో అన్న బెంగ కూడా ఉంది అంటున్నారు.

హామీలతో కాంగ్రెస్ :

కాంగ్రెస్ కేరళలో సూపర్ ఫైవ్ హామీలతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వ్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కళాశాలకు వెళ్లే బాలికలందరికీ నెలకు వేయి రూపాయల నగదు సహాయం, ఒక్కో కుటుంబానికి పాతిక లక్షల ఆరోగ్య బీమా, వృద్ధులకు, బలహీన వర్గాలకు నెలకు మూడు వేల రూపాయల పింఛన్లు, యువత సొంత వ్యాపారాలు ప్రారంభించేందుకు అయిదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు వంటి ఆకర్షణీయమైన హామీలను కాంగ్రెస్ ఇచ్చింది. అంతే కాదు పినరయి విజయన్ ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలను సృష్టించడంలో విఫలం అయిందని, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో కూడా నిర్లక్ష్యం వహించింది అని కాంగ్రెస్ ప్రధాన ఆరోపణగా ఉంది. రైతులు, మత్స్యకారులు, కార్మికులకు అండగా ఉండడంలోనూ విఫలం చెందింది అని కాంగ్రెస్ బాణాలను ఎక్కు పెట్టింది. సర్వే అంచనాలు చూస్తే ఈసారి కమ్యూనిస్టులకు ఎదురుగాలి అని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే దేశంలో కమ్యూనిస్టుల ఒకే ఒక్క కోట కూడా కుప్పకూలి ఉనికి పోరాటం చేయడం తధ్యమని అంటున్నారు.

Tags:    

Similar News