కవితకు ఇచ్చి పారేస్తున్న గులాబీ దళం

ఇక ఆమె తాజాగా కూకట్ పల్లి పర్యటనలో బీఆర్ఎస్ నేతలను ఎవరినీ వదలలేదు.;

Update: 2025-12-10 16:37 GMT

బీఆర్ స్ నీడలో కేసీఆర్ కుమార్తె హోదాలో ఉన్నపుడు కవిత అంటే గులాబీ దళం మొత్తం ఎంతో గౌరవించేది. ఆమె తమ పార్టీ అధినేత తనయ అని ఎంతో మర్యాద ఇచ్చేది. కానీ కాలం మారింది. కవిత బీఆర్ఎస్ కి దూరం అయింది. దాంతో ఆమె ఇపుడు తెలంగాణా జాగృతి నాయకురాలిగా జనంలో తిరుగుతున్నారు. అయితే అక్కడే తేడా వస్తోంది. ఆమెను నిన్నటిదాకా పొగిడిన నోళ్ళీ ఇపుడు తెగుడుతున్నాయి. కవితని తీవ్ర స్థాయిలో విమర్శించడానికి ఏ మాత్రం వెనకాడడం లేదు అంటే రాజకీయాలు అంటే ఇలాగే ఉంటాయని కేసీఆర్ ఇంటి ఆడబిడ్డకు ఈ పాటికి అర్ధం అయి ఉంటాయని అంటున్నారు.

బీఆర్ఎస్ టార్గెట్ గా :

ఇక జిల్లాల పర్యటన పేరుతో జనంలోకి వచ్చిన కవిత బీఆర్ఎస్ నే గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. ఏ ప్రాంతం వెళ్లినా ఏ జిల్లా వెళ్ళినా ఆమె అక్కడ ఉన్న స్థానిక బీఆర్ఎస్ నాయకత్వాన్ని విమర్శిస్తున్నారు. నిజానికి బీఆర్ఎస్ అధికారం పోయి రెండేళ్ళు దాటింది. తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఏమైనా అంటే గింటే కాంగ్రెస్ పాలన మీద విరుచుకుపడాలి కానీ కవిత ఆలోచనలు ఏమిటో తెలియదు కానీ బీఆర్ఎస్ మీదనే తన బాణాలను ఎక్కుపెడుతున్నారు. దాంతోనే గులాబీ దళానికి ఎక్కడ లేని కోపం వస్తోంది. వారు తిరిగి కవిత అన్న దానికి వడ్డీలతో సహా అప్పగిస్తున్నారు.

ఘాటుగానే :

ఇప్పటిదాకా కవితను ఎవరూ అనని తీరులోనే గులాబీ దండు నుంచి విమర్శలు వస్తున్నాయని అంటున్నారు ఆమెని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి లిక్కర్ రాణి అని ఘాటుగా విమర్శించారు. ఇక ఆమె తాజాగా కూకట్ పల్లి పర్యటనలో బీఆర్ఎస్ నేతలను ఎవరినీ వదలలేదు. మల్లారెడ్డి నుంచి బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు మాజీల మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు దానికి బదులు అన్నట్లుగా బీఆర్ఎస్ కి చెందిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కవితకు బదులిచ్చారు. ఆమె మీద తీవ్రమైన కామెంట్స్ చేశారు.

బండారం మొత్తం అంటూ :

తమ మీద అదే పనిగా కవిత విమర్శలు చేస్తూ పోతే ఆమె బండారం మొత్తం బయటపెడతామని మాధవరం క్రిష్ణారావు హెచ్చరించడం విశేషం. అంతే కాదు బీఆర్ఎస్ లో ఉన్నపుడు ఆమె చాలానే చేశారు అని కూడా ఆయన లోగుట్టు చెప్పే ప్రయత్నం చేశారు. కవిత విషయంలో తాము ఇంతకాలం ఆగామంటే కేసీఆర్ మీద అభిమానంతో మాత్రమే అని అన్నారు. తాము కూడా అన్నీ ఇక మీదట ఒక్కోటిగా బయటపెట్టాల్సి వస్తుందని ఆయన చెప్పడం విశేషం.

బీఆర్ఎస్ కి ట్రబుల్ :

కేసీఆర్ కుమార్తెగానే జనంలో అందరికీ కవిత తెలుసు. దాంతో పాటు బీఆర్ఎస్ లో కీలక నేతగా ఆమె నిన్నటి వరకూ ఉన్నారు. అలాంటి ఆమె బీఆర్ఎస్ మీదనే విమర్శలు చేస్తూంటే జనంలో ఆ పార్టీ ఇబ్బందులలో పడుతోంది అని గులాబీ దళం భావిస్తోంది. అంతే కాదు స్థానిక సంస్థల ఎన్నికలు ముంగింట్లో ఉన్నాయి. ఇవి పార్టీకి కీలకంగా మారుతున్న వేళ ఈ విమర్శలు జనంలోకి వెళ్తే పార్టీ మరింతగా ఇబ్బందులో పడుతుందని భావిస్తున్నారు. అందుకే కవిత మీద గులాబీ నేతలు గట్టిగా మాట్లాడుతున్నారు. ఆమె కేసీఆర్ కుమార్తె అని ఆలోచిస్తే పార్టీ మొత్తానికి ముప్పు అని వారు గ్రహించడం వల్లనే ఇలా చేస్తున్నారు అని అంటున్నారు మొత్తానికి కవిత బీఆర్ఎస్ మీద విమర్శలు అపాలన్నది గులాబీ నేతల సందేశం. ఆమె ఇంకా దూకుడు చేస్తే ఇచ్చి పడేసేందుకు వారు రెడీగానే ఉన్నారని అంటున్నారు.

Tags:    

Similar News