వర్చువల్ గా అదరగొట్టబోతున్న మహానాడు

తెలుగుదేశం పార్టీ అంటేనే టెక్నాలజీకి పెట్టింది పేరు. దాంతో వర్చువల్ గా మరింత ఘనంగా క్యాడర్ తో మరింత కనెక్ట్ అవుతూ మహానాడు నిర్వహించడం విశేషంగా చెప్పుకోవాలి.

Update: 2026-05-27 03:52 GMT

తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు పార్టీ పండుగకు సర్వం సిద్ధం అయిపోయింది. ఈ నెల 27, 28 తేదీలలో రెండు రోజుల పాటు మహానాడుని నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసి మహానాడుకు ఘనమైన స్వాగతాన్ని పలుకుతోంది. తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ కార్యకర్తలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన తీరులో ప్రతీ ఏటా మహానాడు నిర్వహిస్తున్న సంగతి విధితమే. అంతే కాదు తెలుగు దేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి మహానాడు కార్యక్రమాన్ని ప్రతీ యేటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా అందులో భాగంగా ఈ ఏడాది లో వచ్చిన మహానాడుకు ఘనంగా నిర్వహిస్తున్నారు.

పరిమితంగానే నేతలు :

కేంద్రం చెప్పిన మార్గదర్శకాలు పాటిస్తూ పొదుపుగా వ్యవహరిస్తూ ఈసారి మహానాడుని జరుపుకుంటున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పరిమిత సంఖ్యలోనే నేతలతో భౌతికంగా వారి హాజరుతో ఈసారి మహానాడును నిర్వహిస్తున్నారు. ఇక వర్చువల్ గా ఇక్కడ నుంచి ఏపీ వ్యాప్తంగా పార్టీ అంతా కనెక్ట్ అవుతోంది. అలాగే దీనికి అనుసంధానంగా నియోజక వర్గాలు మండల కేంద్రాల్లో భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే మహానాడును పూర్తి స్థాయిలో అనుసంధానించారు. ఎంపిక చేసిన నియోజక వర్గాల నుంచి పార్టీ కార్యకర్తలతో పాటు నేతలతో ఈసారి మహానాడులో పార్టీ గురించిన అంశాల మీద మాట్లాడిస్తారని చెబుతున్నారు.

నేరుగా ప్రతీ కార్యకర్తతో :

తెలుగుదేశం పార్టీ అంటేనే టెక్నాలజీకి పెట్టింది పేరు. దాంతో వర్చువల్ గా మరింత ఘనంగా క్యాడర్ తో మరింత కనెక్ట్ అవుతూ మహానాడు నిర్వహించడం విశేషంగా చెప్పుకోవాలి. సాంకేతికత సాయంతో ప్రతి కార్యకర్తను నేరుగా అనుసంధానించే వినూత్న ప్రయత్నం ఈసారి జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఒక వేయి 848 క్లస్టర్ల ద్వారా డిజిటల్ పద్ధతిలో ఈసారి మహానాడు కనీ వినీ ఎరుగని తీరులో అద్భుతంగా జరగనుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేష్ పార్టీ నేతలు టెక్నాలజీ ఆసరాతో నేరుగానే కార్యకర్తలతో మాట్లాడతారని చెబుతున్నారు.

స్త్రీశక్తి ప్రధాన అంశం :

ఈసారి మహానాడులో కీలకమైన అంశంగా స్రీ శక్తి అన్నది అజెండాలో చేర్చారు. స్త్రీశక్తి ప్రధాన అంశంగా ఈ యేడాది మహానాడు కార్యక్రమాన్ని తెలుగుదేశంపార్టీ నిర్వహిస్తోందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఏపీలో టీడీపీ నాయకత్వంలో నడిచే కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా సంక్షేమం కోసం చేసిన కృషిని వివరిస్తారు. అలాగే టీడీపీ ఒక పార్టీగా మహిళల కోసం చేసిన కృషి, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మహానాడు వేదిక మీద నేతలు అంతా పెద్ద ఎత్తున చర్చించనున్నారని చెబుతున్నారు.

మహానాడు షెడ్యూల్ ఇదే :

ఇక కేంద్రం డైరెక్షన్ మేరకు పొదుపు చర్యల్లో భాగంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమంలో ప్రతిరోజు ఆరు గంటల పాటు పార్టీ తీర్మానాలు వాటి పైన చర్చ, అలాగే రాష్ట్రాభివృద్ధిపై చర్చలు వంటివి నిర్వహిస్తారు. ఈ రెండు రోజులూ ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు డిజిటల్ విధానంలో మహానాడు జరగబోతుంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు కార్యకర్తలు ఎవరూ అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లలో నాణ్యతా లోపాలు తలెత్తకుండా టీడీపీ పార్టీ యంత్రాంగం మొత్తం అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దాంతో మహానాడు ఈసారి డిజిటల్ ఫ్లాట్ ఫారం మీద కూడా అదరగొట్టబోతోంది అని అంటున్నారు.

Tags:    

Similar News