బీజేపీ వ‌ర్సెస్ టీడీపీ.. క‌డ‌ప ర‌చ్చ‌కు కార‌ణం ఇదేనా.. ?

కడపలో తాజాగా వెలుగు చూసిన వివాదం వెనుక బిజెపి, టిడిపి నాయకుల అంతర్గత వ్యవహారాలే కారణమని తెలుస్తోంది.;

Update: 2026-05-10 09:30 GMT

కడపలో తాజాగా వెలుగు చూసిన వివాదం వెనుక బిజెపి, టిడిపి నాయకుల అంతర్గత వ్యవహారాలే కారణమని తెలుస్తోంది. కడపలోని అల్మాస్ పేట సర్కిల్ పేరును టిప్పు సుల్తాన్ సర్కిల్ గా మార్చాలన్నది బిజెపి నాయకుల ప్రమేయం తోనే జరిగిందని స్థానికంగా చర్చ నడుస్తోంది. అయితే, ఇది మైనారిటీ వర్గాలకు సంబంధించిన వ్యవహారం కావడంతో ఈ విషయంలో తమకు తీవ్ర నష్టం జరుగుతుందని భావిస్తున్న టిడిపి నాయకులు జోక్యం చేసుకున్నారు.

ముఖ్యంగా టిడిపి కడప పార్లమెంట్ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకుని పేరు మార్చేందుకు వీలు లేదని తేల్చి చెప్పారు. మరోవైపు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని భారీ ఎత్తున విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బిజెపి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పాటు టిప్పు సుల్తాన్ సెంటర్ గా పేరు మార్చాలని కూడా పట్టుబడుతున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. అయితే, ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని పార్టీ అధిష్టానం నుంచి సంకేతాలు స్పష్టంగా వచ్చాయి.

అయినప్పటికీ స్థానికంగా మైనారిటీ వర్గాల ఓటు బ్యాంకు ను ప్రభావితం చేసే అంశం కావడంతో భూపేష్ రెడ్డి జోక్యం చేసుకోవడం గమనార్హం. మరోవైపు బిజెపి నేతలు కూడా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఈ సెంటర్ పేరును మార్చి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు. గతంలో గుంటూరులోనూ ఇదే తరహా రాజకీయం చోటుచేసుకుంది. ఇక్కడ జిన్నా టవర్ సెంటర్ ను పేరు మార్చాలన్న వాదన వినిపించింది. పెద్ద ఎత్తున వివాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో వైసీపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా ఈ వివాదాన్ని సర్దుబాటు చేసేలాగా వ్యవహరించింది. ఇప్పుడు కూడా అదే తరహా విధానాన్ని అనుసరించాలన్నది టిడిపి వ్యూహంగా ఉంది. కానీ, స్థానికంగా ఉన్న ఓటు బ్యాంకు సహా రాజకీయంగా ఇది వివాదంగా మారుతున్న నేపథ్యంలో ఏ తరహా పరిస్థితులు ఏర్పడతాయి అన్నది చూడాలి. ప్రస్తుతానికైతే టిప్పు సుల్తాన్ సెంటర్ పేరును మార్చి తీరాలని బిజెపి నాయకులు పట్టుబడుతున్నారు. కానీ, దీనిని అడ్డుకొని తీరుతామని టిడిపి నుంచి బలమైన వాదన వినిపిస్తోంది.

మొత్తంగా కడప జిల్లాలో జరుగుతున్న ఈ వివాదం కూటమి పార్టీల మధ్య తీవ్ర వివాదానికి విభేదాలకు కూడా దారి తీసే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, ఇంత జరుగుతున్నప్పటికీ వైసీపీ నాయకులు ఈ విషయంలో మౌనంగా ఉన్నారు. ఎవరూ జోక్యం చేసుకోవడం లేదు. పైగా ఏం జరుగుతుందో చూడాలనే పరిస్థితిలో కొనసాగుతున్నారు. తద్వారా ఎన్నికల నాటికి దీనిని అనుకూలంగా వినియోగించుకునే అవకాశాన్ని కూడా వైసిపి నాయకుల పరిశీలిస్తుండడం గమనార్హం.

Tags:    

Similar News