జోగి ఫ్యామిలీలో మరొకరిపై కేసు..? అరెస్టుకు రంగం సిద్దం
కల్తీ మద్యం కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో మరొకరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.;
కల్తీ మద్యం కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో మరొకరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం అర్థరాత్రి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మాచవరం ఎస్ఐపై దాడి చేయడంతోపాటు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారనే అభియోగాలతో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ తోపాటు మరికొందరిపై కేసు నమోదైంది. ఇప్పటికే జోగి కుటుంబంలో మాజీ మంత్రి, ఆయన సోదరుడు అరెస్టు అయిన విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఈ నెల 13 వరకు కోర్టు రిమాండ్ విధించింది.
మాజీ మంత్రిని కోర్టులో హాజరు పరిచేందుకు ముందుగా విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో జోగి రమేష్ కుమారుడు రాజీవ్ తోపాటు వందల మంది కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా అత్యావసర సేవల విభాగంలో ఉన్న జోగి సోదరుల వద్దకు చొచ్చుకొళ్లేందుకు ప్రయత్నించారని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా తీవ్రమైన తోపులాట జరిగింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న సంవాదం వల్ల క్యాజువాలిటీ వార్డు అద్దం ధ్వంసమైంది.
ఇదే సమయంలో మాజీ మంత్రి కుమారుడు రాజీవ్ మాచవరం ఎస్ఐపై దౌర్జన్యానికి దిగినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడంతో వైసీపీలో టెన్షన్ మొదలైంది. ఈ కేసులో జోగి రాజీవ్ ను కూడా అరెస్టు చేస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జోగి సోదరుల అరెస్టుతో ఇప్పటికే ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఇలాంటి సమయంలో జోగి కుమారుడు రాజీవ్ పై కూడా అనూహ్యంగా కేసు నమోదు చేయడాన్ని వైసీపీ తీవ్రంగా పరిగణిస్తోంది.
కాగా, కుట్రతోనే కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పై ప్రభుత్వ కేసు పెట్టిందని వైసీపీ ఆరోపిస్తోంది. మాజీ మంత్రి అరెస్టును నిరసిస్తూ వైసీపీకి చెందిన 8 మంది సీనియర్ నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణు, అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, పేర్ని నాని, మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, గడికోట శ్రీకాంత్ రెడ్డి తదితరులు జోగి అరెస్టును ఖండించారు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే జోగిపై కేసు నమోదు చేశారని విమర్శించారు.