ఆ మాజీ మంత్రికి అరెస్టు ముప్పు.. గ్రౌండ్ రెడీ చేసిన చంద్రబాబు

అధికారం చేపట్టిన ఏడాదిగా వరుస అరెస్టులతో వైసీపీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తున్న చంద్రబాబు సర్కారు తాజాగా లిస్టులో మరో పేరును చేర్చినట్లు కనిపిస్తోందని అంటున్నారు.;

Update: 2025-08-08 07:34 GMT

మరో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. అధికారం చేపట్టిన ఏడాదిగా వరుస అరెస్టులతో వైసీపీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తున్న చంద్రబాబు సర్కారు తాజాగా లిస్టులో మరో పేరును చేర్చినట్లు కనిపిస్తోందని అంటున్నారు. అగ్రి గోల్డ్ భూముల విక్రయంలో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేశ్ కుటుంబంపై విచారణ చేపట్టిన రెవెన్యూ, ఏసీబీ అధికారులు తుది నివేదికను రెడీ చేశారు. 11 పేజీల నివేదికలో జోగి కుటుంబం అక్రమాలకు పాల్పడినట్లు తేల్చారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఏ క్షణమైనా మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టు జరగవచ్చని అంటున్నారు.

జోగి కుటుంబంపై ఆరోపణలు

వైసీపీ అధికారంలో ఉండగా మంత్రిగా వ్యవహరించిన జోగి రమేశ్ హోంశాఖ ఆధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా చేజిక్కించుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన కుమారుడు, సోదరుడు పేరుతో ముందుగా రిజిస్ట్రేషన్లు చేయించుకుని ఆ తర్వాత వేరే వారికి విక్రయించేశారని జోగి కుటుంబంపై ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి గతంలో జోగి రమేశ్ కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఈ అక్రమ రెజిస్ట్రేషన్లపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. రెవెన్యూ, ఏసీబీ అధికారులతో సంయుక్తంగా దర్యాప్తు చేయగా, అక్రమాలు నిజమని నిర్ధారిస్తూ ప్రభుత్వానికి నివేదిక అందింది.

సంయుక్తంగా విచారణ

రెవెన్యూ, ఏసీబీ సంయుక్తంగా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, కొన్ని కీలక ఆధారాలను సేకరించినట్లు చెబుతున్నారు. విజయవాడ రూరల్ తహసిల్దార్ సుగుణ తన విచారణపై సమగ్ర నివేదికను ఏసీబీ, సీఐడీ విభాగాలకు అందజేశారు. జోగి రమేశ్ తనయుడు, ఆయన సోదరుడు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకుని, వేరేవారికి విక్రయించడం చెల్లుబాటు కాదని రెవెన్యూ, ఏసీబీ జాయింట్ కమిటీ తేల్చింది. ఆ భూములు ముమ్మాటికీ అగ్రిగోల్డ్ వని స్పష్టం చేసింది.

భూముల విక్రయం అక్రమం

ఏసీబీ, రెవెన్యూ అధికారులు సంయుక్త విచారణలో అనేక అంశాలను గుర్తించారు. అంబాపురం గ్రామం ఆర్ఎస్ నెంబర్ 87లో 2293.05 చదరపు గజాల భూమిని పెదపాడు పోలీసు స్టేషన్ లో నమోదైన క్రైమ్ నెంబర్ 3/2015 ప్రకారం జీవో ఎంఎస్ నెంబర్ 133, 117 అనుసరించి రాష్ట్ర హోంశాఖకు అటాచ్ చేసిందని తెలిపింది. ఈడీ జాయింట్ డైరెక్టర్ ప్రొవిజనల్ అటాచ్ మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చారని, వాటికి సంబంధించిన దస్తావేజుల నెంబరులతో సహా ఆ భూమి ఎవరిది, వారికి ఎలా వచ్చింది, వేరే వారికి ఎలా విక్రయించింది అన్న విషయాలను సమగ్రంగా నివేదించారు. ఈ విచారణలో వీరి స్థలాల హద్దులలో వివిధ దిక్కులలో అగ్రిగోల్డ్‌ భూములు ఉన్నాయని గుర్తించారు. కాబట్టి పెదపాడు పోలీసు స్టేషన్‌ కేసుకు సంబంధించి హోమ్‌ డిపార్ట్‌మెంట్‌ అటాచ్‌ మెంట్‌లో ఉన్న అగ్రి గోల్డ్‌ భూములేనని తేల్చారు. దీంతో జోగి రమేశ్‌ తన కుటుంబ సభ్యుల పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్‌ చేయించుకుని తిరిగి వేరే వారికి విక్రయించారని నిర్ధారిస్తూ నివేదిక సమర్పించారు.

Tags:    

Similar News