జనసేన జాతీయవాదం ఇంపాక్ట్ ఎంత ?

ఇదిలా ఉంటే జనసేన జాతీయ వాదాన్ని తీసుకుని ముందుకు సాగితే ఆ ఇంపాక్ట్ తెలుగు రాష్ట్రాలలో ఏ మేరకు ఉంటుంది అన్నది చెప్పడం కష్టమే అని అంటున్నారు.

Update: 2026-06-16 18:30 GMT

జనసేన క్లియర్ కట్ గా తన వాదం ఏంటో చెప్పేసింది. ఢిల్లీలో పార్టీ అధినేత పవన్ అధినేత తమకు దేశ సమగ్రత సమైక్యత ముఖ్యం అని గట్టిగా చెప్పారు. అంతే కాదు జాతీయవాదం మీద స్పష్టంగా మాట్లాడారు. విభజన వాదాలు ప్రమాదకరమన్నట్లుగా పేర్కొన్నారు. ఈ విధంగా ఢిల్లీ వేదికగా జనసేన తన ఫిలాసఫీని వెల్లడించిన నేపధ్యంలో దాని ఇంపాక్ట్ ఏపీతో సహా తెలంగాణాలో జనసేన విస్తరించాలనుకుంటున్న దక్షిణ భారతంలో ఏ మేరకు ఉంటుంది అన్నది ఒక చర్చగా ముందుకు వస్తోంది.

బీజేపీ వాదం కూడా :

నిజం చెప్పాలంటే జాతీయ వాదం అన్నది పాతదే. అది బీజేపీ సొంత అజెండాగా ఈ రోజుకీ ఉంది. బీజేపీ ఈ వాదంతోనే తన రాజకీయాన్ని ముందుకు కొనసాగిస్తూ వచ్చింది. అయితే అది ఉత్తర భారతానికి బాగానే వర్కౌట్ అయింది కానీ సౌత్ స్టేట్స్ లో మాత్రం అనుకున్న ఫలితాలు రాలేదు. ఇపుడు జనసేన ఈ నినాదం అందుకుంది. దేశం ముఖ్యం అన్న భావన గొప్పది, అంతా ఒక్కటిగా ఉండాలన్నది కూడా మంచి ఆలోచన. ప్రాంతీయ ఆలోచనలు భావాలు ఒక దశ వరకూ పరిమితం చేస్తూ దేశం వరకూ వస్తే అంతా గట్టిగా నిలబడాలన్నది కూడా ఉత్తమమైన విధానమే. కానీ ఆచరణలోనే ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు.

సమస్యలు ముందు :

ఎక్కడికక్కడ సమస్యలు ఉన్న చోట వాటిని పరిష్కరించకుండా జాతీయ వాదం అన్న నినాదం ఎంచుకోవడం వల్ల అనుకున్న ఫలితాలు రావని అంటున్నారు. భావోద్వేగమైన ఈ తరహా నినాదాలు ఒకటి రెండు సార్లు ఫలించినా ఆ తరువాత మాత్రం తమ దైనందిన సమస్యలతోనే సగటు జనాలు చిక్కుకుని పోతారు అని అంటున్నారు. ముందు ఆకలి, పేదరికం, నిరుద్యోగం ఇలా కీలక అంశాల మీద దృష్టి సారించకుండా అన్నింటికీ ఒక్కటే పరమావధి అన్నట్లుగా జాతీయవాదం అనే భావనను రుద్దాలనుకుంటే అవి తిప్పికొడతాయని అంటున్నారు.

యువతలో అసహనం :

ఈ రోజున యువతలో అసహనం ఉంది. ఈ దేశంలో నూటికి ఎనభై శాతం యువత 29 ఏళ్ళ లోపు వారు ఉన్నారని గణాంకాలు తెలియచేస్తున్నాయి. దాంతో పదును తేరిన ఈ యువ శక్తిని ఏదో ఒక వాదంతో వివాదంతో కట్టి ఉంచడం బహు కష్టం అని అంటున్నారు. యువత శక్తిని ఉపయోగించుకోవాల్సి ఉంది. అంతే కాదు వారి ఆశలను నిర్వీర్యం కాకుండా చూడాలి. ఉపాధి అవకాశాలు సృష్టించి యువతను ఆ దిశగా మళ్ళించాయి. అపుడు వారికి ఏ వాదం చెప్పినా ఆలకిస్తారు అని అంటున్నారు.

విఫలం కావడమేనా :

ఈ రోజున కాక్రోచ్ అని ఒక పార్టీ రాత్రికి రాత్రి పుట్టుకుని వచ్చింది అంటే రాజకీయ పార్టీల వైఫల్యమే అని అంటున్నారు. వారి సమస్యలను సరిగ్గా అడ్రస్ చేసే వారు లేకపోవడం వల్లనే సోషల్ మీడియా వేదికగా ఒక యువకుడు పెట్టిన పోస్టు ఎట్రాక్ట్ చేసింది. దాంతో బొద్దింకల దండుగా అంతా ఒక్క చోటకు చేరి అక్కడ తమ అసహనాన్ని అసంతృప్తికి వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు.

జనసేనకు మేలేనా :

ఇదిలా ఉంటే జనసేన జాతీయ వాదాన్ని తీసుకుని ముందుకు సాగితే ఆ ఇంపాక్ట్ తెలుగు రాష్ట్రాలలో ఏ మేరకు ఉంటుంది అన్నది చెప్పడం కష్టమే అని అంటున్నారు. జెన్ జీ తరం ఇపుడు నడుస్తోంది. వారి ఆలోచనలు పూర్తిగా వాస్తవిక దృక్పధంలో ఉంటున్నాయి. భావోద్వేగాలకు దూరంగా వారు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో వారిని అడ్రస్ చేయాలంటే వారి ఆలోచనలను తెలుసుకుని ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. జనసేన విషయానికి వస్తే ఈ జాతీయ వాదం నినాదం వల్ల కొత్తగా ఒనకూడేది పెద్దగా ఉండబోదన్న విశ్లేషణలు ఉన్నాయి.

ఈ తరహా ఫిలాసఫీతో సాగితే :

ఒకవేళ అద్భుత ఫలితాలు వస్తే అందుకునేందుకు బీజేపీ ఏనాడో ముందు వరసలో ఉందని చెబుతున్నారు. అలాగని జాతీయ వాదం తప్పు అని కానే కాదు, కానీ ముందు సమస్యల పరిష్కారం మీద ఫోకస్ పెట్టి ఆ మీదట ఈ తరహా ఫిలాసఫీతో సాగితే సరైన ఫలితాలు రావచ్చు అని కూడా విశ్లేషిస్తున్నారు. టోటల్ గా చెప్పేది ఏంటంటే జనసేన జాతీయ పార్టీగా అవతరించేందుకు ఈ తరహా వాదాలు స్ట్రాంగ్ ఇంజన్ గా పనిచేసే అవకాశాలు అయితే తక్కువ అనే అంటున్నారు.

Tags:    

Similar News