కవిత డిప్రెషన్ లో ఉన్నట్టు ఉంది..
మీడియాతో మాట్లాడుతూ జగ్గారెడ్డి, తెలంగాణ రాజకీయాల్లో ఏదో జరిగిపోతుందనే చర్చ జరుగుతోందని, కొత్త పార్టీల గురించి అన్ని రాజకీయ పక్షాల్లోనూ చర్చలు నడుస్తున్నాయని అన్నారు.;
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖపై తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. కవిత లేఖ వల్ల కాంగ్రెస్‌కు ఎలాంటి నష్టం జరగదని, అది బీఆర్‌ఎస్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత అంశమని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడే కేటీఆర్, హరీష్ రావు, కవిత నాయకులని, కేసీఆర్‌ను దేవుడని అంటూనే దెయ్యాలని సంబోధించడం దేనికి సంకేతమని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కవిత వ్యవహారం తన కొమ్మను తాను నరుకున్నట్టుగా ఉందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మీడియాతో మాట్లాడుతూ జగ్గారెడ్డి, తెలంగాణ రాజకీయాల్లో ఏదో జరిగిపోతుందనే చర్చ జరుగుతోందని, కొత్త పార్టీల గురించి అన్ని రాజకీయ పక్షాల్లోనూ చర్చలు నడుస్తున్నాయని అన్నారు. కవిత లేఖతో కాంగ్రెస్‌కు ఎలాంటి నష్టం లేదని, కాంగ్రెస్ ఎప్పటినుంచో బలంగా ఉందని, భవిష్యత్తులోనూ బలంగానే ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ బలహీన పార్టీ అని, బీఆర్ఎస్ ఉద్యమం పేరుతో బలమైన పార్టీగా అవతరించిందని, రాష్ట్ర విభజన కోణంలోనే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని ఆయన విశ్లేషించారు. కాంగ్రెస్ పరిపాలనా దక్షతతో అధికారంలోకి వచ్చిందని, భవిష్యత్తులోనూ వస్తుందని ఆయన అన్నారు. మతం, హిందుత్వ పేరుతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో బలమైన పార్టీలుగా కాంగ్రెస్ మొదటి స్థానంలో, బీఆర్ఎస్ రెండో స్థానంలో, బీజేపీ మూడో స్థానంలో ఉన్నాయని జగ్గారెడ్డి చెప్పారు. కమ్యూనిస్టు పార్టీలు ఉన్నప్పటికీ అధికారంలోకి వచ్చే పరిస్థితిలో లేవని ఆయన అన్నారు.
కేసీఆర్‌తోనే ఉనికి..
కవిత లేఖతో నష్టం జరుగుతుంది అనేది కేసీఆర్ కుటుంబ వ్యక్తిగత అంశమని జగ్గారెడ్డి అన్నారు. కవిత లేఖతో కేసీఆర్ కుటుంబంలో గొడవలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భావించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కవిత లేఖ వల్ల బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ వైపు చూసే అవకాశం ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో బలమైన క్యాడర్ ఉండడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కంటే బీజేపీ వైపు చూసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్ కుటుంబంలో ఉన్నవారు తామే గొప్ప అనే భావన మంచిది కాదని, కేసీఆర్‌తోనే బీఆర్ఎస్ ఉనికి ఉంటుందని, కేసీఆర్ ఉంటేనే కేటీఆర్, హరీష్ రావు, కవిత నాయకులని ఆయన స్పష్టం చేశారు.
బీజేపీకి ప్లస్ అవుతోంది..
తండ్రి కూతురుగా కవిత నాయకురాలిగా ఎదిగారని, కేసీఆర్‌ను దేవుడని అంటూనే దెయ్యాలని సంబోధించడం దేనికి సంకేతమని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ దేవుడని అంటూనే కేసీఆర్‌ను రాజకీయ సమాధి చేసేలా కవిత వ్యవహారం ఉందని ఆయన అన్నారు. కవిత వ్యవహారం తన కొమ్మను తాను నరుకున్నట్టుగా ఉందని, కవిత లీకుల వ్యవహారం బీజేపీని బలపరిచేలా ఉందని ఆయన విమర్శించారు. కవిత డిప్రెషన్‌లో ఉండి లేఖ విడుదల చేసినట్లుగా ఉందని, బీఆర్ఎస్ ఉనికిని దెబ్బతీస్తూ బీజేపీని పెంచి పోషించేలా బీఆర్ఎస్ వ్యవహారం ఉందని ఆయన అన్నారు. లేఖలు, లీకులు మీడియాలో వార్తలకు పనికి వస్తాయి కానీ, మీ మనుగడ దెబ్బతీస్తాయనే విషయం మర్చిపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి లేని బలాన్ని బీఆర్ఎస్ ఇస్తుందని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అలర్ట్ కావాలని ఆయన హెచ్చరించారు.
కవితకు అవగాహన లేదు..
బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ వైపు తిప్పుకునే వ్యూహం అమలు చేయాలని, దీనిపై పీసీసీ, సీఎంతో మాట్లాడుతానని జగ్గారెడ్డి అన్నారు. నాయకత్వం లేని బీజేపీకి బీఆర్ఎస్ ఎందుకు అవకాశం ఇస్తుందో అర్థం కావడం లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేసీఆర్ లోతైన ఆలోచన చేస్తారని, పిల్లలు దారి తప్పారని కేసీఆర్ భావిస్తున్నట్లు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తండ్రి గురించి కవితకు పూర్తి అవగాహన లేకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. కుటుంబానికి వారసుడు కొడుకే అవుతాడని, కొడుకు లేని పక్షంలో కూతురు వారసురాలు అవుతుందని ఆయన పేర్కొన్నారు. కవిత ఏదో రాష్ట్ర రాజకీయాలను తిప్పేస్తుందని కాదని, చర్చల వల్ల నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. కేసీఆర్ కూతురు కాబట్టే మీడియాలో కవితకు ప్రాధాన్యత అని, కవిత లేఖలు తమ శత్రువు బీజేపీకి ఉపయోగపడతాయనే తమ బాధ అని జగ్గారెడ్డి ముగించారు.