బిగ్ డిబేట్: మోడీ 'క్రెడిట్' కోసం.. ధన్‌ఖడ్ బలి!?
తాజాగా దేశ ఉపరాష్ట్రపతి పదవికి జగదీప ధన్ ఖడ్ ఆకస్మికంగా రాజీనామా చేశారు. అయితే.. ఆయన అనారోగ్య సమస్యలు అంటూ.. ఫార్మల్‌గా తన రాజీనామా పత్రంలో పేర్కొన్నారు.;
రాజకీయాల్లో ఏ చిన్న అవకాశం వచ్చినా..తమకు అనుకూలంగా నాయకులు, పార్టీలు కూడా మార్చుకుంటాయి. ఎక్కడ ఏ చిన్న ప్లస్ ఉన్నా..తమకు, బిగ్ మైనస్‌లు ఉంటే.. అవి ప్రతిపక్షాలకు అంటగట్టే రాజకీయాలు కొన్ని దశాబ్దాలుగా దేశంలో సాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ అయితే.. మరింత దూకుడుగా ఉంటున్నా రు. ప్రచారం కోసం.. ఆయన పాకులాడుతున్నారన్న విషయం కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి ఎప్పుడూ విమర్శల రూపంలో బయటకు వస్తూనే ఉంది. `మొక్క నాటినా.. మొక్కలు తీర్చినా.. మోడీకి ప్రచారం` అనే నానుడి ఉండనే ఉంది.
తాజాగా దేశ ఉపరాష్ట్రపతి పదవికి జగదీప ధన్ ఖడ్ ఆకస్మికంగా రాజీనామా చేశారు. అయితే.. ఆయన అనారోగ్య సమస్యలు అంటూ.. ఫార్మల్‌గా తన రాజీనామా పత్రంలో పేర్కొన్నారు. కానీ, బలమైన కారణం లేకుండా.. దేశ రెండో అతిపెద్ద రాజ్యాంగ పరమైన పదవిని ఎవరు మాత్రం వదులుకుంటారు? . సో.. ఈ కోణంలోనే కేంద్రంలో రాజకీయాలపై జాతీయ మీడియా సహా కాంగ్రెస్ పార్టీలు.. నిఘా ను తీవ్ర తరం చేశాయి. జగదీప్ రాజీనామాకు తెరవెనుక ఉన్న కారణాలపై అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక కీలక విషయం తెరమీదికి వచ్చింది.ప్రధాని మోడీకి క్రెడిట్ ఇచ్చే అంశంలో జగదీప్ ధన్‌ఖడ్ మొండిగా వ్యవహరించారని.. అందుకే ఆయనను తప్పించేశారన్నది కాంగ్రెస్ నేతలు, జాతీయ మీడియ చెబుతున్న మాట.
విషయం ఏంటి?
1) అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జశ్వంత్‌వర్మ ఇంట్లో వందల కోట్ల నగదు కాలిపోయింది. అప్పట్లో ఆయన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఇది పెను దుమారం రేగింది. చివరకు సుప్రీంకోర్టు ఆయననుఅభిశంసన ద్వారా తొలగించాలని కేంద్రానికి సిఫారసు చేసింది.
2) న్యాయవ్యవస్థలో జవాబుదారీ తనం, అవినీతిని సహించేది లేదని.. మోడీ పదే పదే చెబుతున్న నేపథ్యంలోను, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తామే ఎంపిక చేస్తామని..(కొలీజియం) చెబుతున్న సమయంలో జరిగిన పరిణామాన్నితమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.
3) అంటే.. జస్టిస్ వర్మ అభిశంసన తీర్మానాన్ని తామే ప్రవేశ పెట్టి.. ``ఇదిగో న్యాయవ్యవస్థలో అవినీతిని సహించేది లేదని మేం నిరూపించుకున్నాం`` అని చెప్పాలని ప్రయత్నించింది.
4) కానీ.. రాజ్యసభలో చైర్మన్ జగదీప్(రాజీనామా చేశారు).. అధికార పక్షానికి అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టేందుకు అవకాశం ఇవ్వకుండా.. తొలుత కాంగ్రెస్ పక్షం నుంచి సంతకాలు సేకరించారు. అంటే.. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ దే పైచేయిగా మారుతుంది. దీనిని బీజేపీ జీర్ణించుకోలేక పోయింది. దీంతో .. తమ పేర్లను కూడా సంబంధిత అభిశంసన తీర్మానంలో చేర్చాలని.. ఈ విషయంలో తాము కూడా నిబద్ధతతో ఉన్నామన్న చర్చపెట్టాలని కోరింది.
5) కానీ, ముందుగా కాంగ్రెస్ ముందుకు వచ్చింది కాబట్టి.. తాను వారి పేర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటానని జగదీప్ స్పష్టం చేశారు. అనంతరం.. ఆయన దీనిపై నిర్వహించిన సమావేశానికి బీజేపీ సభ్యులు డుమ్మా కొట్టారు. ఇదీ.. జగదీప్ రాజీనామాకు కారణమై ఉంటుందన్నది ప్రస్తుతం తెరమీదికి వచ్చిన చర్చ. దీనిలో మోడీ కి దక్కాల్సిన క్రెడిట్‌ను జగదీప్ కాంగ్రెస్‌కు ఇచ్చేశారన్నది అధికార పార్టీ వాదన.