రాహుల్ జగన్ లను ఈవీఎంలు కలుపుతాయా ?
ఎవరికి ఎవరూ మిత్రులు కాదు, శత్రువులూ కానే కాదు ఆ మాటకు వస్తే వైసీపీ ఏపీలో ఇపుడు తటస్థంగా ఉంది.;

ఎవరి ఏ దారిలో ఉన్నా రాజకీయ గోదావరి అందరినీ కలుపుతుంది. ఇది పొలిటికల్ రూల్. రాజకీయాలు ఎపుడూ అవసరాల మీద ఆధారపడి సాగుతాయి. ఎవరికి ఎవరూ మిత్రులు కాదు, శత్రువులూ కానే కాదు ఆ మాటకు వస్తే వైసీపీ ఏపీలో ఇపుడు తటస్థంగా ఉంది. ఆ పార్టీ బీజేపీకి దగ్గర కాదు, దూరం ఉందా అంటే కాలం చెప్పాలి.
మరో వైపు చూస్తే దేశంలో ఎన్డీయే ఇండియా కూటములు రెండూ ఉన్నాయి. ఈ రెండు కూటములలో చేరని పార్టీలు బీఆర్ఎస్ బీజేడీ, వైసీపీ వంటివి ఉనాయి. బీఆర్ఎస్ కి కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రత్యర్ధి. బీజేపీ అధికారం కోసం తమతో పోటీ పడుతున్న ప్రత్యర్ధి. అందువల్లనే బీజేపీ తటస్థ వైఖరిని ఎంచుకుంది. అది అనివార్యమైంది.
ఇక ఒడిషాలో చూస్తే బీజేడీకి ఇలాంటి సీన్ ఉంది. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ బీజేపీడి గట్టి ప్రత్యర్ధి. తమతో అధికారం కోసం పోటీ పడుతున్న కాంగ్రెస్ మరో ప్రత్యధి. అందుకే నవీన్ పట్నాయక్ కూడా జాతీయ స్థాయిలో న్యూట్రల్ స్టాండ్ కొనసాగిస్తున్నారు. ఆయనది కూడా అనివార్యమైన పరిస్థితే.
కానీ ఏపీలో వైసీపీది మాత్రం విచిత్రమైన పరిస్థితి. ఆ పార్టీకి ఏపీలో బీజేపీ డైరెక్ట్ గానే ప్రత్యర్ధి. ఎలాగంటే ఏపీలో టీడీపీ జనసేనలతో కలసి ఎన్డీయే ప్రభుత్వం ఏపీలో ఉంది. ప్రతిపక్షంలో వైసీపీ ఉంది. పోటీగా మరో పార్టీ సమీపంలో కూడా లేదు. కాంగ్రెస్ అయితే ఉనికి పోరాటం చేస్తోంది. దాంతో వైసీపీకి కాంగ్రెస్ వంటి పార్టీతో చేతులు కలపడం వల్ల రాజకీయ లాభమే తప్ప నష్టం అయితే ఏ కోశానా లేదు.
ఇక మూడు పార్టీలతో బలంగా ఉన్న టీడీపీ కూటమిని ఎదుర్కోవాలంటే జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో చేరడమే వైసీపీకి ఉత్తమమైన మార్గం అని అంటున్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు యాంటీగా ఇండియా కూటమితో పాటే వైసీపీ ఓటు చేసింది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే విధానాలలో చాలా వాటిని వ్యతిరేకిస్తోంది.
ఇక మైనారిటీలు, దళిత్స్ ఇతర బలహీన వర్గాలు ఇండియా కూటమికి ఓటు బ్యాంక్ అయితే వైసీపీకి వారే అండగా ఉంటున్నారు. కేంద్రంలో బీజేపీ ఎన్డీయే పాలిత రాష్ట్రాలలో ప్రత్యర్ధులను ఏదో కేసులలో ఇరికిస్తోంది అని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. ఏపీలో వైసీపీ నేతల మీద వరస కేసులు ఎన్డీయే కూటమి ప్రభుత్వం పెట్టి గత ఏడాదిగా ఇబ్బంది పెడుతోంది.
మరో వైపు చూస్తే ఈవీఎంలతో పాటు వ్యవస్థలను మేనేజ్ చేసి 2024 ఎన్నికల్లో గెలిచారు అన్నది వైసీపీ నేతల ఆరోపణ. అవే ఆరోపణలను రాహుల్ గాంధీ కూడా చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో రాసిన వ్యాసంలో ఇదే విషయం మీద తీవ్ర విమర్శలు చేశారు.
గత ఏడాది నవంబరులో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై రాహుల్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం నియామక ప్యానెల్‌ను తారుమారు చేయడం, ఓటర్ల జాబితాలో నకిలీ ఓటర్లను చేర్చడం, ఓటింగ్ శాతాన్ని కృత్రిమంగా పెంచి చూపడం, దొంగ ఓటింగ్ వంటి వాటిని పేర్కొంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ కారణాల వల్లనే కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయం పాలైందని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘం సంతకం లేని నోట్స్ విడుదల చేసిందని ఆయన పేర్కొన్నారు. తాను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా సందేహాల నివృత్తికి ఏకంగా బూత్‌ల సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అయితే కేంద్ర ఎన్నికల సంఘం రాహుల్ ఆరోపణలను పూర్తిగా కొట్టేసింది. పోలింగ్ సమయంలో గానీ, ఆ తర్వాత జరిగిన పరిశీలనలో గానీ కాంగ్రెస్ సహా ఏ రాజకీయ పార్టీ ఏజెంట్ల నుంచి కూడా తీవ్రమైన ఫిర్యాదులు రాలేదని ఈసీ స్పష్టం చేసింది. అయితే రాహుల్ సీసీ ఫుటేజ్ డిమాండ్ మీద మాత్రం స్పందించడం లేదు.
ఇక హర్యానా ఎన్నికల వేళ కూడా రాహుల్ ఇదే రకమైన ఆరోపణలు చేశారు వైసీపీ కూడా ఈ విధంగానే మాట్లాడుతూ వస్తోంది. మరి ఒక రకమైన డిమాండ్ ఒకే రకమైన భావజాలం ఒకే రకమైన వర్గాల కోసం పోరాడుతున్న రెండు పార్టీల మధ్య భావ సారూప్యత చాలానే ఉంది అని అంటున్నారు.
మరో వైపు 2029 ఎన్నికల్లో కూడా బీజేపీతో కలసి పోటీ చేస్తామని టీడీపీ జనసేన ప్రకటించిన నేపధ్యంలో ఒంటరిగా ఏపీలో ఎదుర్కోవడం అన్నది వైసీపీకి బిగ్ టాస్క్ అని అంటున్నారు. ప్రజలు ఉన్నారు ఓట్లేస్తారు అనుకున్నా చాలా రకాలైన వ్యూహాలను ఎదుర్కోవాలంటే జాతీయ స్థాయిలో అండ అన్నది వైసీపీకి అవసరం అని అంటున్నారు. మరి ఈవీఎంల మీద ఒకే గొంతుకతో ఉన్న రాహుల్ జగన్ లను అదే కలుపుతుందా అంటే వెయిట్ అండ్ సీ.