యుద్ధంలో ఇరానే గెలిచిందా? ఇజ్రాయెలీలు అదే భావిస్తున్నారా?
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన తాజా సైనిక ఘర్షణలు అంతర్జాతీయ రాజకీయాలను తీవ్రంగా కుదిపేశాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన తాజా సైనిక ఘర్షణలు అంతర్జాతీయ రాజకీయాలను తీవ్రంగా కుదిపేశాయి. యుద్ధ క్షేత్రంలో సైనికంగా ఇరు దేశాలు తామే విజయం సాధించామని ప్రకటించుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు మాత్రం భిన్నమైన కథను చెబుతున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశంలో నిర్వహించిన ఒక తాజా సర్వే ఫలితాలు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. యుద్ధంలో సైనిక విజయాల కంటే యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ పౌరుల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి అక్కడి నెతన్యాహు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.
షాకింగ్ నిజాలను బయటపెట్టిన సర్వే
జెరూసలెంలోని ప్రముఖ హెబ్రూ యూనివర్సిటీ, అగమ్ ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా ఇజ్రాయెల్ పౌరుల అభిప్రాయాలను సేకరించాయి. జూన్ 17 నుండి జూన్ 20 వరకు మొత్తం 3,644 మంది ఇజ్రాయెల్ పౌరులపై నిర్వహించిన ఈ సర్వేలో నమ్మలేని వాస్తవాలు వెలుగుచూశాయి. సర్వేలో పాల్గొన్న వారిలో ఏకంగా 92 శాతం మంది ఇజ్రాయెలీలు ఈ యుద్ధం వల్ల ఇరాన్‌కే ఎక్కువ ప్రయోజనం చేకూరిందని అభిప్రాయపడ్డారు. యుద్ధం ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ దేశ రక్షణ వ్యవస్థ, భద్రత మరింత బలహీనపడ్డాయని 82.9 శాతం మంది భావిస్తున్నారు. శత్రు దేశాలను అడ్డుకునే వ్యూహాత్మక సామర్థ్యంపై ప్రజల్లో నమ్మకం సడలిందని ఇది స్పష్టం చేస్తోంది. యుద్ధం ముగింపునకు కుదిరిన తాత్కాలిక లేదా శాంతి ఒప్పందాన్ని 63 శాతం మంది తీవ్రంగా వ్యతిరేకించారు.
నెతన్యాహు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ యుద్ధంలో తమదే పైచేయి అని.. తాము విజయం సాధించామని ప్రకటనలు గుప్పిస్తున్నారు. అయితే సొంత దేశ ప్రజలే ఆయన మాటలను నమ్మడం లేదు. "ప్రధాని నెతన్యాహు చేస్తున్న విజయ వాదనలను తాము నమ్మడం లేదని 73 శాతం మంది ఇజ్రాయెల్ పౌరులు స్పష్టం చేశారు." ఇది ప్రభుత్వంపై , సైనిక నాయకత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని, పెరుగుతున్న అపనమ్మకాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. యుద్ధం వల్ల సాధించిన ప్రయోజనాల కంటే దేశానికి జరిగిన నష్టమే ఎక్కువని మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు.
ఈ ఫలితాల అర్థం ఏమిటి?
ఈ సర్వే ఫలితాలు ఇరాన్ సైనికంగా ఇజ్రాయెల్‌ను ఓడించిందని చెప్పలేవు. కానీ, మానసిక, రాజకీయ యుద్ధంలో ఇరాన్ పైచేయి సాధించిందనే సంకేతాలను ఇస్తున్నాయి. యుద్ధంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనే అంశంపై అంతర్జాతీయ రక్షణ రంగ విశ్లేషకుల్లో ఇంకా భిన్నమైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
కానీ ఇజ్రాయెల్ అంతర్గత పరిస్థితులను గమనిస్తే ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సరిహద్దుల్లో బాంబుల మోత ఆగిపోయి ఉండవచ్చు, క్షిపణుల దాడులు శాంతించి ఉండవచ్చు... కానీ యుద్ధం సృష్టించిన భయాందోళనలు, అభద్రతాభావం మాత్రం ఇజ్రాయెల్ ప్రజల మనసుల్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రజాభిప్రాయం రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్ అంతర్గత రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి.