భారత రక్షణ రంగంలో సరికొత్త శకం: సైన్యంలోకి 100% స్వదేశీ ‘షేర్’ ఏకే-203

భారతీయ సైన్యాన్ని మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దే దిశగా మన రక్షణ రంగం మరొక చారిత్రాత్మక ముందడుగు వేసింది.

Update: 2026-08-24 05:53 GMT

భారతీయ సైన్యాన్ని మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దే దిశగా మన రక్షణ రంగం మరొక చారిత్రాత్మక ముందడుగు వేసింది. దశాబ్దాలుగా మన సరిహద్దులను కాపాడుతున్న ఇన్‌సాస్ రైఫిళ్ల స్థానంలో అత్యంత ఆధునికమైన ‘ఏకే-203’ అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నాయి. 'షేర్' అని పిలుచుకునే ఈ సమర్థవంతమైన ఆయుధం సంపూర్ణంగా 100 శాతం స్వదేశీ భాగాలు.. ముడిసరుకుతో భారతదేశంలోనే తయారవడం ప్రశంసనీయం.

అమేఠీ కేంద్రంగా రూపుదిద్దుకున్న 'ఆత్మనిర్భర్' ఆయుధం

ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ జిల్లా కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఆర్ఆర్.పీఎల్) నేతృత్వంలో ఈ ఆయుధాల ఉత్పత్తి వేగవంతమైంది. గతంలో కేవలం కొన్ని భాగాలను స్థానికంగా అసెంబుల్ చేయడానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రతి చిన్న విడిభాగాన్ని ముడిసరుకును భారత పరిశ్రమల నుంచే సేకరించి నిర్మించడం ద్వారా భారత్ తన సమగ్ర రక్షణ తయారీ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ఇప్పటికే తొలి దశ ఫైరింగ్ , బరస్ట్ పరీక్షలు విజయవంతమై ప్రోత్సాహకర ఫలితాలను సాధించాయి.

అసాధారణ వేగం.. ఎదురులేని శక్తి

సాంకేతికంగా ఏకే-203 ఒక అత్యుత్తమ గ్యాస్ ఆపరేటెడ్ అసాల్ట్ రైఫిల్. శత్రువుల గుండెల్లో నిద్రపోయేలా చేసే ఈ రైఫిల్ ప్రత్యేకతలున్నాయి. ఫైరింగ్ వేగంతో నిమిషానికి ఏకంగా 700 రౌండ్ల వరకు బుల్లెట్లను వర్షంలా కురిపించగలదు. సుమారు 3.6 కిలోల బరువు ఉండే ఈ ఆయుధం 800 మీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం సమర్థవంతంగా ఛేదించగలదు. 7.62×39 మిమీ కాలిబర్ బుల్లెట్లను ఉపయోగించడం వల్ల తక్కువ, మధ్యస్థ దూరాల్లో అత్యంత బలమైన ప్రభావం చూపుతుంది.

2030 నాటికే 6 లక్షల రైఫిళ్ల ఉత్పత్తి లక్ష్యం

భారత సైన్యానికి మొత్తం 6,01,427 ఏకే-203 రైఫిళ్లను అందించడానికి ఐఆర్ఆర్.పీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. రక్షణ అవసరాల దృష్ట్యా ఈ సంస్థ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని ఊహించని రీతిలో పెంచుతోంది. ప్రతి 100 సెకన్లకు ఒక ‘షేర్’ రైఫిల్‌ను తయారు చేసే సాంకేతిక వేగాన్ని అందుకుంది. దీని ద్వారా ఏడాదికి 1.5 లక్షల రైఫిళ్లను ఉత్పత్తి చేస్తూ నిర్దేశిత 2032 గడువు కంటే దాదాపు ఏడాది ముందే.. అంటే 2030 చివరి నాటికే మొత్తం ఆర్డర్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

రక్షణ ఉత్పత్తుల స్వయంసమృద్ధిలో ఈ 'షేర్' రైఫిల్ నవభారత విప్లవానికి ప్రతీక. మన సైనికులకు ఆధునిక రక్షణను అందించడమే కాకుండా ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో రక్షణ రంగాన్ని ఆత్మనిర్భర భారత్ వైపు నడిపిస్తున్న ఘనమైన ఘట్టమిది.

Tags:    

Similar News