ట్రంప్ ను వ్యతిరేకించాలి.. అమెరికాను కాదు బాస్
అసలు విషయాన్ని చెప్పే ముందు ఒక చిన్న ఉదాహరణను చెబితే విషయం మరింత బాగా అర్థమవుతుంది.;
అసలు విషయాన్ని చెప్పే ముందు ఒక చిన్న ఉదాహరణను చెబితే విషయం మరింత బాగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి కొందరు స్నేహితులు ఉంటారు. వారు.. ఆర్థికంగా..సామాజికంగా బలవంతులు. అలాంటి వారితో స్నేహం ఉన్నంత వరకు బాగుంటుంది.కానీ.. ఏదో ఒక రోజు ఏదో విషయంలో తేడా రావొచ్చు.మీ తప్పు లేకుండానే వారితో గొడవ షురూ కావొచ్చు. తమకున్న బలాల్ని ప్రదర్శిస్తూ అహంకారాన్ని ప్రదర్శించొచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తాం? అంతో ఇంతో తగ్గే ప్రయత్నం చేస్తాం. అదే సమయంలో నీలో అహంకారం ఎక్కువైంది.. దాని కారణంగా ఇబ్బందిగా ఉంది.. పద్దతి మార్చుకోవాలని చెబుతాం.
దాన్ని అర్థం చేసుకునే కన్నా అపార్థం చేసుకొని.. మరింతగా ద్వేషించటం మొదలు పెడితే ఏం చేయాలి? అతడికి కాస్త దూరంగా ఉంటే సరిపోతుంది. అంతే తప్పించి.. అతడి మీద కోపంతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవటం..అతడ్ని అధిగమించేందుకు మనకున్న పరిమిత వనరుల్ని.. శక్తి సామర్థ్యాల్ని వినిగించటం చేస్తామా? అంటే చేయమనే చెబుతాం. ఎందుకుంటే.. మనకున్న పరిమిత వనరుల్ని అనవసరంగా ఖర్చు పెడితే పాత స్నేహితుడికి పోయేదేమీ ఉండదు కానీ.. మనకు మాత్రం జరిగే నష్టం ఎక్కువ అవుతుంది.
కొన్నిసందర్భాల్లో ఓపిక పడితే.. కాలం నేర్పే పాఠాలతో దూరమైన పాత స్నేహితుడిలో మార్పు వచ్చి.. మనకు మళ్లీ స్నేహ హస్తాన్ని చాచే ప్రయత్నం జరుగుతుంది. అందుకు భిన్నంగా.. మనతో తప్పుగా ప్రవర్తించాడని.. మనం కూడా తప్పులు చేసుకుంటూ పోతే ఇరువురికి నష్టం కదా. ఇప్పుడు ట్రంప్ పుణ్యమా అని భారత్ ఎదుర్కొంటున్న ఇబ్బంది కూడా ఈ కోవలోకే వస్తుంది. ట్రంప్ చేస్తున్న పనులు.. తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలపై కోపంతో.. అమెరికాను ద్వేషించటం తప్పు. అమెరికా వేరు.. ట్రంప్ వేరు అన్న విషయాన్నిమర్చిపోకూడదు.
మహా అయితే ట్రంప్ మరో రెండు.. మూడేళ్లు మాత్రమే అధికారంలో ఉంటారు. ఇప్పటికే ట్రంప్ కారణంగా అమెరికా విదేశాంగ విధానంలో చోటు చేసుకుంటున్న మార్పులు.. దశాబ్దాల తరబడి అనుసరిస్తున్న విధానాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న ఆయ శైలి కారణంగా.. ఇప్పటికే అమెరికాతో ఉన్న స్నేహితులు పలువురు దూరం అవుతున్నారు. ఇలాంటి సందర్భాల్లోనే కొంత ఓపికతోనూ.. ఓర్పుతోనూ వ్యవహరిస్తే కాలపరీక్షలో నెగ్గే వీలుంటుంది.
ట్రంప్ మీద కోపంతో అమెరికా మీద ఆగ్రహాన్ని పెంచుకోవటం ద్వారా దీర్ఘకాలంలో నష్టాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎవరు అవునన్నా.. కాదన్నా అమెరికా అగ్రరాజ్యం. అమెరికా కాకుండా మరే దేశమైనా అగ్రరాజ్యంగా అవతరిస్తే.. ఇప్పుడు ఉన్న పరిస్థితుల కంటే ఇబ్బందికర పరిణామాలే చోటు చేసుకుంటాయని చెప్పాలి. అందుకే అహంకారంతో ఎగెరెగిరి పడుతున్న ట్రంప్ తో భారత్ ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది.అయినప్పటికీ కాస్త సహనంతో వ్యవహరిస్తే.. ట్రంప్ తర్వాత అమెరికాతో భారత్ సంబంధాలు మరింత మెరుగు అవుతాయని చెప్పక తప్పదు. మొత్తంగా చెప్పేదేమంటే.. ట్రంప్ మీద కోపం ఉండటంలో తప్పు లేదు. కానీ.. అమెరికా మీద మనకున్న స్నేహాన్ని మాత్రం వదులుకోవటం భారతదేశ ప్రయోజనాల పరంగా మంచిది కాదన్నది మర్చిపోకూడదు.