ఇండియాలో ఈ స్కూల్స్ ఫీజులు చూస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. హైయెస్ట్ ఎక్కడంటే?

మన దేశంలో కొన్ని స్కూళ్లలో వార్షిక ఫీజులు రూ. 10 లక్షల నుంచి ప్రారంభమై రూ. 22 లక్షల వరకూ వెళ్తున్నాయి.

Update: 2026-05-14 19:30 GMT

ఇప్పటి పరిస్థితుల్లో మధ్యతరగతి కుటుంబాలకు పిల్లలను సాధారణ ప్రైవేట్ స్కూల్లో చేర్పించడం కూడా సులభం కాదు… ఫీజులు లక్షల స్థాయికి చేరుకున్నాయి. మరి కోటీశ్వరులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల పిల్లలు చదివే స్కూళ్లలో ఫీజులు ఇంకెంత ఉంటాయో ఊహించగలరా? ఏడాదికి ఒక పెద్ద ఉద్యోగి సగటు జీతం అంత ఫీజు ఇక్కడ ఉంటుంది. దేశంలోనే అత్యంత ఖరీదైన పాఠశాలలు ఏవి? అక్కడ ఫీజులు ఎంత ఉంటాయో తెలిస్తే మీరు నిజంగానే షాక్ అవుతారు..మరి ఆ వివరాలు చూద్దాం..

లక్షల్లో ఫీజులు… చూపరులను ఆశ్చర్యపరిచే సౌకర్యాలు:

మన దేశంలో కొన్ని స్కూళ్లలో వార్షిక ఫీజులు రూ. 10 లక్షల నుంచి ప్రారంభమై రూ. 22 లక్షల వరకూ వెళ్తున్నాయి. ముంబైలోని అంబాని ఇంటర్నేషన్ల్ స్కూల్ లో చదవాలంటే సంవత్సరానికి దాదాపు రూ. 12 లక్షల నుంచి మొదలై, రూ. 15 లక్షలకు మించి కూడా ఫీజులు వసూలవుతున్నాయి. ఇక అలాగే డెహ్రాడూన్‌లోని ప్రసిద్ధ ‘డూన్ స్కూల్’ లో కూడా దాదాపు రూ. 15 లక్షల వరకు ఉంటుంది. ఒక సామాన్యుడి జీవితకాల పొదుపు ఇక్కడ కేవలం ఒక ఏడాది ఫీజుతో సమానం అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.

అత్యంత ఖరీదైన పాఠశాలలు ఇవే:

దేశంలోనే అత్యధిక ఫీజు వసూలు చేసే స్కూళ్ల జాబితాలో బెంగళూరులోని హారో ఇంటర్నేషనల్ స్కూల్ మొదటి స్థానంలో ఉంటుంది. ఇక్కడ ఫీజు ఏకంగా రూ. 18 లక్షల నుండి రూ. 22 లక్షల వరకు ఉంటుంది. అలాగే ముస్సోరీలోని ఉడ్‌స్టాక్ స్కూల్‌లో రూ. 16 లక్షల నుండి రూ. 18 లక్షల వరకు ఫీజు వసూలు చేస్తారు. ఇక అజ్మీర్‌లోని మాయో కాలేజీలో రూ. 7 లక్షల నుండి రూ. 9 లక్షల వరకు, గ్వాలియర్ లోని సింధియా స్కూల్ లో రూ. 12 లక్షల పైచిలుకు ఫీజులు ఉంటాయి.

అసలు అక్కడ ఏముంటుంది?:

ఇంత ఫీజు తీసుకుంటున్నారంటే సౌకర్యాలు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. ఈ స్కూళ్లు కేవలం చదువుకే పరిమితం కావు. ఒలింపిక్ స్థాయి స్విమ్మింగ్ పూల్స్, అత్యాధునిక స్పోర్ట్స్ స్టేడియాలు, ఆర్ట్ స్టూడియోలు, ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్‌లో డైనింగ్ హాల్స్ ఉంటాయి. ఇక కొన్ని స్కూళ్లలో అయితే గుర్రపు స్వారీ , గల్ఫ్, షూటింగ్ వంటి ఖరీదైన క్రీడల్లో కూడా శిక్షణ ఇస్తారు. విద్యార్థులకు ప్రపంచ స్థాయి ఎక్స్‌పోజర్ లభిస్తుంది.

ఫీజులు ఎందుకు అంత ఎక్కువ?:

ఈ స్కూళ్లలో టీచర్-స్టూడెంట్ రేషియో చాలా తక్కువగా ఉంటుంది. అంటే ప్రతి ఐదుగురు లేదా పదిమంది విద్యార్థులకు ఒక టీచర్ ఉంటారు. వీరికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఐబీ సిలబస్ బోధిస్తారు. విదేశీ యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించడం వీరికి చాలా సులభం అవుతుంది. అందుకే సంపన్న వర్గాల వారు తమ పిల్లల భవిష్యత్తు కోసం కోట్లు ఖర్చు చేయడానికి వెనకాడరు.

చదువు అనేది విజ్ఞానం పంచడమే అయినా, ఈ ఖరీదైన స్కూళ్లు మాత్రం చదువును ఒక లగ్జరీగా మార్చేశాయి. అయితే ఫీజు లక్షల్లో ఉన్నా, వేలల్లో ఉన్నా విద్యార్థి నేర్చుకునే ఆసక్తి, పట్టుదలే వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఏది ఏమైనా, ఒక సామాన్య వ్యక్తి ఏడాది సంపాదన కంటే ఎక్కువ ఫీజు ఉన్న ఈ స్కూళ్ల గురించి వింటే మాత్రం గుండె ఆగిపోవాల్సిందే.



Tags:    

Similar News