దేశంలో పడిపోయిన సంతానోత్పత్తి.. డీలిమిటేషన్ ప్రక్రియకు తీవ్ర ఆటంకం?
భారతదేశం ప్రస్తుతం `డెమోగ్రాఫిక్ డివిడెండ్` (ఉత్పాదక వయస్సు గల జనాభా ఎక్కువగా ఉండటం) దశలో ఉంది.
భారతదేశ చరిత్రలో తొలిసారిగా జనాభా స్థిరత్వాన్ని కాపాడే స`తానోత్పత్తి రేటు` (టోటల్ ఫెర్టిలిటీ రేట్- TFR) అవసరమైన స్థాయి కంటే కిందకు పడిపోయింది. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (SRS) తాజా సమీక్ష ప్రకారం.. దేశ సగటు సంతానోత్పత్తి రేటు 1.9 కి చేరుకుంది. దీర్ఘకాలంలో జనాభా పెరగకుండా, తరగకుండా స్థిరంగా ఉండాలంటే ఈ రేటు 2.1 గా ఉండాలి. దశాబ్దాలుగా జనాభా విస్ఫోటనాన్ని ఎదుర్కొన్న భారత్ ఇప్పుడు భవిష్యత్తులో కార్మిక కొరత - వృద్ధుల జనాభా పెరిగిపోయే సరికొత్త సవాలు వైపు అడుగులు వేస్తోంది. 2000వ సంవత్సరంలో 3.3 గా ఉన్న ఈ రేటు.. ఇంత వేగంగా క్షీణించడం గమనార్హం.
మహిళల్లో విద్యావంతుల సంఖ్య పెరగడం.. కుటుంబ నియంత్రణ సాధనాలు అందుబాటులోకి రావడం.. మారుతున్న ఆర్థిక పరిస్థితులే ఈ మార్పునకు ప్రధాన కారణాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే గతంతో పోలిస్తే శిశు మరణాల రేటు 2019లో 1000 మందికి 30 ఉండగా... 2024 నాటికి 24 కి తగ్గడం వల్ల ఎక్కువ మంది పిల్లల్ని కనాలనే ఆలోచన తగ్గుతోంది. నేటి ఆధునిక కాలంలో పిల్లల పెంపకానికి అయ్యే ఖర్చులు విపరీతంగా పెరగడం కూడా కుటుంబాలను చిన్నవిగా మార్చేలా చేస్తోంది.
ఈ జనాభా మార్పులు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకేలా లేవు. ప్రాంతాల వారీగా తీవ్ర వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. కేరళ, తమిళనాడు (1.3), ఆంధ్రప్రదేశ్ (1.4), ఢిల్లీ (1.2) వంటి ప్రాంతాలలో టి.ఎఫ్.ఆర్ చాలా తక్కువగా ఉంది. దీనికి విరుద్ధంగా విద్యా ప్రమాణాలు, ఆరోగ్య సదుపాయాలు తక్కువగా ఉన్న బీహార్ (2.9), ఉత్తరప్రదేశ్ (2.6) వంటి ఉత్తరాది రాష్ట్రాలలో సంతానోత్పత్తి రేటు ఇంకా ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతీయ అసమానతలు భవిష్యత్తులో దేశ రాజకీయ, ఆర్థిక వనరుల పంపిణీలో.. ముఖ్యంగా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) సమయంలో తీవ్ర వివాదాలకు దారితీసే అవకాశం ఉంది.
భారతదేశం ప్రస్తుతం `డెమోగ్రాఫిక్ డివిడెండ్` (ఉత్పాదక వయస్సు గల జనాభా ఎక్కువగా ఉండటం) దశలో ఉంది. ఇది 2055 వరకు కొనసాగుతుందని అంచనా. గతంలో జపాన్, చైనా వంటి దేశాలు ఈ దశను ఉపయోగించుకునే ఆర్థిక అగ్రరాజ్యాలుగా ఎదిగాయి. అయితే భారత్‌లో ఇంకా నిరుద్యోగ సమస్య పూర్తిగా సమసిపోకముందే జనాభా వృద్ధాప్యం వైపు మళ్లడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కొన్ని రాజకీయ వర్గాలు ప్రచారం చేస్తున్నట్లుగా కాకుండా.. ముస్లింలు సహా అన్ని మతాల వారిలోనూ సంతానోత్పత్తి రేటు వేగంగా తగ్గుతోందని ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ విలక్షణ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడో, నాలుగో సంతానాన్ని ప్రోత్సహించేందుకు నగదు బహుమతులను ప్రకటించగా.. గోవా, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలు ఉచిత ఐవిఎఫ్ (IVF) కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. అయితే కేవలం పిల్లల సంఖ్యను పెంచడమే కాకుండా.. మునుముందు రోజుల్లో పెరగనున్న వృద్ధుల జనాభాను దృష్టిలో ఉంచుకుని మెరుగైన ఆరోగ్య సంరక్షణ, పెన్షన్లు - సామాజిక భద్రత కల్పించేలా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర జాతీయ విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.