మీది ఈ-పాస్ పోర్టు అయితే ఇమ్మిగ్రేషన్ ఈజీ.. అదెలానంటే?

ఇప్పటివరకు అందజేస్తున్న పాస్ పార్టులకు భిన్నంగా కొత్తగా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ చిప్ తో కూడిన ఈ-పాస్ పోర్టును జారీ చేస్తున్నారు.;

Update: 2025-06-26 09:30 GMT

మీది ఏ పాస్ పోర్టు? ఈ ప్రశ్న కాస్తంత కన్ఫ్యూజ్ కు గురి చేసే అవకాశం ఉంది. ఈ - పాస్ పోర్టు గురించి తెలీదో.. కాస్తంత గందరగోళానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో తప్పించి.. మిగిలిన చోట్ల ఎప్పటిలానే సంప్రదాయ పాస్ పోర్టుల్ని జారీ చేస్తున్నారు. అందుకు భిన్నంగా ఈ-పాస్ పోర్టులను జారీ చేస్తున్నారు. మరింత సురక్షితంగా.. నకిలీలకు చెక్ పెట్టేలా వీటిని సిద్ధం చేవారు. పాస్ పోర్టు సేవా కార్యక్రమం వెర్షన్ 2.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త తరహా ఈ-పాస్ పోర్టుల్ని తెర మీదకు తీసుకొచ్చింది.

ఇప్పటివరకు అందజేస్తున్న పాస్ పార్టులకు భిన్నంగా కొత్తగా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ చిప్ తో కూడిన ఈ-పాస్ పోర్టును జారీ చేస్తున్నారు. దీన్ని రీడ్ చేస్తే క్షణాల్లో ఇమ్మిగ్రేషన్ అధికారులకు పాస్ పోర్టు హోల్డర్ మొత్తం సమాచారం లభిస్తుంది. దీంతో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ మరింత సులువుగా ముగుస్తుంది. పరిమిత సంఖ్యలో జారీ చేస్తున్న కొత్త తరహా ఈ-పాస్ పోర్టు మొదటి పేజీలో కనిపించని ఒకచిప్ ఉంటుంది.

పాత విధానంలో పాస్ పోర్టులను నకిలీలు క్రియేట్ చేసే వీలుంది. తాజా విధానంలో అందుకు అవకాశం ఉండదు. ఇంతకు కొత్త.. పాత పాస్ పోర్టులకు తేడాను ఎలా గుర్తించటం అంటారా? చాలా ఈజీ. కొత్త ఈ-పాస్ పోర్టు మొదటి పేజీపైన బంగారు రంగులో చిప్ రూపంలో ఒక చిహ్నం ఉంటుంది. అది ఉంటే.. కొత్త పాస్ పోర్టుగా చెప్పొచ్చు. పాత పాస్ పోర్టులు మనుగడలో ఉన్నంత కాలం వాటిని అలానే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే పాత పాస్ పోర్టు స్థానంలో కొత్త పాస్ పోర్టుకు అప్లై చేస్తే.. అప్పుడు ఈ-పాస్ పోర్టును జారీ చేస్తారు. ఇదండి కొత్త ఈ-పాస్ పోర్టు ముచ్చట.

Tags:    

Similar News