షేక్ హసీనా అప్పగింత : బంగ్లాతో భారత్ వియ్యమా కయ్యమా ?

బంగ్లా దేశ్ మరో దాయాదిగా మారింది. పాకిస్థాన్ మాదిరిగానే తయారు అయింది. యాభై ఏళ్ళ పాటు సన్నిహితంగా ఉన్న దేశం ఒక్కసారిగా రివర్స్ అయింది.;

Update: 2025-11-22 03:56 GMT

బంగ్లా దేశ్ మరో దాయాదిగా మారింది. పాకిస్థాన్ మాదిరిగానే తయారు అయింది. యాభై ఏళ్ళ పాటు సన్నిహితంగా ఉన్న దేశం ఒక్కసారిగా రివర్స్ అయింది. షేక్ హసీనా ప్రధానిగా ఉన్నపుడు భారత్ బంగ్లాల మధ్య మంచి దోస్తీ సాగేది. రెండు దేశాలు అన్యోన్యంగా ఉండేవి. అయితే గత ఏడాది ఆగస్టులో షేక్ హసీనాను గద్దే నుంచి దించేసిన తిరుగుబాటు ఉద్యమంతో భారత్ బంగ్లాదేశ్ ల మధ్య గ్యాప్ అలాగే పెరిగిపోయింది. ఏడాది పై దాటుతున్నా అది ఇంకా పెద్దదిగా మారుతోంది తప్ప తగ్గడంలేదు.

పుండు మీద కారంగా :

షేక్ హసీనా బంగ్లా దేశ్ నుంచి నేరుగా బ్రిటన్ వెళ్ళిపోతుందని లేదా మరోచోట ఆశ్రయం పొందుతుందని బంగ్లా తాత్కాలిక పాలకులు భావించారు. కానీ నేరుగా భారత్ కే ఆమె వచ్చారు. భారత్ సైతం అంతే మర్యాదగా ఆమెని ఒక ఇంటి ఆడపడుచుగా అక్కున చేర్చుకుని తమ వద్దనే ఉంచుకుంది. ఢిల్లీలో ఎవరికీ తెలియని ఒక చోట షేక్ హసీనా ఉంటున్నారు. ఆమె ఎక్కడ ఉంటున్నది భారత్ లో రాజకీయ నేతలకే కాదు చాలా మంది ప్రముఖులకు సైతం తెలియదు అంటే ఆశ్చర్యమే. అంతలా ఆమెకి భద్రత కల్పిస్తూ భారత్ సమాదరిస్తోంది. ఇదే బంగ్లాదేశ్ ని మండిస్తోంది. అంత యుద్ధమూ చేసింది షేక్ హసీనా కోసమే కదా అన్నదే బంగ్లా పాలకుల వేడి నిట్టూర్పులు. ఆమెను న్యాయ స్థానం పేరుతో శిక్షించి ఉరి కంబం ఎక్కించాలని ఉబలాట పడుతున్న వారికి భారత్ మధ్యలో కొరుకుడు పడడంలేదు అని అంటున్నారు.

ఎన్నో విన్నపాలు :

భారత్ లో తలదాచుకుంటున్న షేక్ హసీనాను తమకు అప్పగించమని బంగ్లా దేశ్ పాలకులు గతంలోనూ ఈ మధ్య ఎన్నో విన్నపాలు చేశారు. రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలను కూడా గుర్తు చేస్తూ వచ్చారు అయితే ఎవరెన్ని చెప్పినా ఎలాంటి ఒత్తిడులు చేసినా భారత్ పాలకులు అయితే షేక్ హసీనా విషయంలో వెనక్కి తగ్గడంలేదు. ఆమెకు ఆశ్రయం కల్పిస్తామన్న విధానానికే కట్టుబడి ఉన్నారు ఇక లేటెస్ట్ గా బంగ్లా దేశ్ లోని కోర్టు ఇచ్చిన తీర్పులో ఏకంగా షేక్ హసీనాకు ఉరి శిక్షనే విధించారు అయితే ఇది తప్పుడు తీర్పు అని షేక్ హసీనా ఖండించారు. అంతే కాదు లండన్ లో ఉంటున్న ఆమె కుమారుడు సైతం బంగ్లా పాలకుల మీద విమర్శలు చేశారు. తన తల్లిని చంపాలని వేసిన ఎత్తుగడ అన్నారు తన తల్లికి ఇండియా సురక్షితమైన స్థావరం అన్నారు. పైగా బంగ్లా పాలకులు కోరినట్లుగా ఆమెని అప్పగించ వద్దు అని కూడా ఆయన అభ్యర్ధించారు.

పంపేది లేదా :

అయితే భారత్ షేక్ హసీనా విషయంలో బంగ్లాకు అప్పగిస్తుందా అంటే లేదు అనే జవాబు వస్తోంది. ఆమె రాజకీయ శరణార్ధిగా భారత్ లో ఉంటున్నారు అని అందువల్ల ఆమెని అప్పగించమని కోరే ఏ ఒప్పందమూ లేదని అది వీగిపోతుందని కూడా అంటున్నారు అందుకే భారత్ బంగ్లా విన్నపాలను తిరస్కరిస్తోంది అని అంటున్నారు. అయితే భారత్ తీసుకుంటున్న ఈ వైఖరితో బంగ్లా పాలకులకు మరింతగా ఆగ్రహం కలగవచ్చు అని అంటున్నారు. అయినా సరే బంగ్లా ఏమి చేస్తుంది అన్నది కూడా ఉంది. అయితే పొరుగు దేశంగా ఉన్న బంగ్లా దేశ్ తో పేచీలు ఏ విధమైన పరిణామాలకు దారి తీస్తాయన్నది చూడాల్సి ఉంది. మొత్తానికి బంగ్లాతో కయ్యానికి భారత్ నేరుగా దిగకపోయినా ఆ దేశం మాత్రం భారత్ మీద నిప్పులు కక్కుతూనే ఉంది.

Tags:    

Similar News