కొత్త రూల్ : ఎంత ఎక్కువ జీతం ఉంటే వారికే H-1B

ఇప్పటివరకు కొనసాగిన రాండమ్ లాటరీ పద్ధతికి స్వస్తి పలికి.., "వర్కర్ వెయిటెడ్ సెలక్షన్" అనే కొత్త నిబంధనను అమలు చేయాలని వైట్ హౌస్ నిర్ణయించింది.;

Update: 2025-08-12 06:18 GMT

నిపుణులైన విదేశీ ఉద్యోగులను ఆకర్షించేందుకు ఉద్దేశించిన అత్యంత కీలకమైన H-1B వీసా ఎంపిక విధానంలో ఒక చారిత్రాత్మక మార్పు దిశగా అమెరికా ప్రభుత్వం పటిష్టమైన అడుగులు వేసింది. ఇప్పటివరకు కొనసాగిన రాండమ్ లాటరీ పద్ధతికి స్వస్తి పలికి.., "వర్కర్ వెయిటెడ్ సెలక్షన్" అనే కొత్త నిబంధనను అమలు చేయాలని వైట్ హౌస్ నిర్ణయించింది. వైట్ హౌస్ యొక్క బడ్జెట్, నిర్వహణ కార్యాలయం (OMB) ఈ కొత్త నిబంధనపై తన సమీక్షను పూర్తి చేసింది. ఈ పరిణామంతో ఈ కొత్త రూల్ ఇక అధికారికంగా ప్రచురించబడి, అమలులోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ మార్పు అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ టెక్‌ నిపుణులకు, అలాగే వారికి స్పాన్సర్ చేసే కంపెనీలకు గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది.

-కొత్త నియమం ఏం చెబుతుంది?

పాత విధానంలో H-1B వీసా కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతీ అప్లికేషన్‌కు లాటరీలో సమాన అవకాశాలు ఉండేవి. ఎంత ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగం అయినా ఎంత తక్కువ జీతం ఉన్న ఉద్యోగం అయినా లాటరీలో వాటికి సమానమైన విలువ లభించేది. ఈ విధానం కొంతమంది ఉద్యోగులు తక్కువ జీతాలకు ఉద్యోగాలు చేస్తూ వీసాలు పొందేందుకు, లేదా కొన్ని కంపెనీలు వీసాను దుర్వినియోగం చేసేందుకు దారితీసింది. కొత్త విధానంలో ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని ప్రకారం H-1B వీసా ఎంపిక ప్రక్రియలో ఉద్యోగికి ఆఫర్ చేయబడిన వేతనం ఆధారంగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ వ్యవస్థలో అధిక వేతనాలు ఉన్న అప్లికేషన్లకు ముందుగా ప్రాధాన్యత ఇస్తారు. దీనికి సంబంధించిన ఎంపిక క్రమం ఇలా ఉంటుంది.

అత్యధిక వేతనం ఉన్న వేజ్ లెవల్ 4 ఉద్యోగాలకు... వేజ్ లెవల్ 3, ఆ తర్వాత లెవల్ 2 ఉద్యోగాలకు... అత్యంత తక్కువ వేతనం ఉన్న వేజ్ లెవల్ 1 ఉద్యోగాలకు క్రమంలో వర్తిస్తుంది.. ఈ కొత్త విధానం వల్ల కేవలం వీసా కోసం తక్కువ జీతంతో దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య తగ్గించవచ్చని, నిజంగా నిపుణులైన.. ఎక్కువ జీతం పొందగలిగే అభ్యర్థులకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

-ఈ మార్పు వల్ల ప్రభావాలు ఎలా ఉంటాయి?

ఈ కొత్త విధానం అమలులోకి వస్తే, దాని ప్రభావం వివిధ వర్గాలపై స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే అధిక వేతనాలు పొందే వారికి, లేదా అధిక నైపుణ్యాలు కలిగిన వారికి ఈ మార్పు వల్ల మరింత లాభం చేకూరుతుంది. వారి వీసా పొందే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. కంపెనీలు నిజంగా అత్యుత్తమ టాలెంట్ కోసం అధిక వేతనాలు ఆఫర్ చేస్తే, ఆ అభ్యర్థులకు వీసా పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొత్తగా ఉద్యోగంలో చేరే ఎంట్రీ-లెవెల్ టెక్ నిపుణులకు (వేజ్ లెవల్ 1) H-1B వీసా పొందడం చాలా కష్టమవుతుంది. ఈ మార్పు వల్ల వారు లాటరీలో ఎంపికయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అమెరికాలోని కంపెనీలు ఇప్పుడు గ్లోబల్ టాలెంట్ కోసం పోటీ పడాలంటే.. ఉద్యోగులకు మరింత మెరుగైన, పోటీతత్వ వేతనాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తక్కువ వేతనాలతో ఉద్యోగులను నియమించుకోవాలని చూసే కంపెనీలకు ఈ వీసా పొందడం కష్టమవుతుంది.

-తదుపరి చర్యలు.. భవిష్యత్తు

ఈ నిబంధనను ఇప్పుడు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ (DHS) , అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) అధికారికంగా "ఫైనల్ రూల్" గా ప్రకటించే అవకాశం ఉంది. సాధారణంగా, ఈ ప్రకటన తర్వాత, కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఈ మార్పులు మార్చి 2026లో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరం 2026 H-1B వీసా క్యాప్ సీజన్ నాటికి అమల్లోకి రావచ్చు.

అయితే, ఈ కొత్త నిబంధనపై చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. కొన్ని కంపెనీలు లేదా సంస్థలు ఈ మార్పులపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తే, దాని అమలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా, ఈ మార్పు అమెరికాలో ఉన్న టెక్ మార్కెట్‌లో ఒక కొత్త పోటీ వాతావరణాన్ని సృష్టించనుంది. “ఎవరు ఎక్కువ చెల్లిస్తారో, వాళ్లకు అత్యుత్తమ టాలెంట్” అనే నినాదం ఇప్పుడు మరింత బలంగా వినిపించనుంది.

Tags:    

Similar News