అమెరికన్లకు ఉద్యోగాలు నిల్.. H1B ఫుల్.. స్థానిక యువతకు అన్యాయం?
అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేసిన యువత ఇప్పుడు ఒక్క ఉద్యోగం పొందడానికే కాదు, ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తున్నాయన్న అంశంపై కూడా ఆలోచిస్తున్నారు.;
అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేసిన యువత ఇప్పుడు ఒక్క ఉద్యోగం పొందడానికే కాదు, ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తున్నాయన్న అంశంపై కూడా ఆలోచిస్తున్నారు. టాప్ యూనివర్సిటీల నుంచి పట్టా పొందిన యువత.. ఇంటర్న్‌షిప్లు పూర్తి చేసి, ప్రాజెక్టులు చేసి, మెరిసే గ్రేడ్‌లు తెచ్చుకున్నా ఉద్యోగం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అదే సమయంలో అంతర్జాతీయ విద్యార్థులకు మాత్రం రిక్రూటర్ల కాల్స్ త్వరగా వస్తున్నాయి. ఇది అందరిదీ కాదేమో కానీ, చాలా మందికి అనుమానాలు కలిగించేదిగా ఉంది.
- H-1B వీసా: అసలు ఉద్దేశం మారిందా?
H-1B వీసా కొన్నేళ్ల కిందట దేశంలో సరిపడా నైపుణ్యం గల కార్మికులు లేనప్పుడు తాత్కాలికంగా వెలుపలి నిపుణులను తీసుకునేందుకు రూపొందించబడింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడిప్పుడే కాలేజ్ ముగించిన అమెరికన్ పౌరులు కూడా "ఈ వ్యవస్థ ఇంకా మన కోసం ఉందా?" అని అడుగుతున్నారు. కొన్ని కంపెనీలు వీసా మీద ఉండే ఉద్యోగులను తక్కువ వేతనంతో నియమించడం, లేదా వారు గళమెత్తలేని పరిస్థితిని ఉపయోగించుకోవడం వలనే ఈ వ్యవస్థను "లూప్‌హోల్"గా చూస్తున్నారు.
-ఇది వలసదారులపై నింద కాదు
విదేశీయులపై నింద వేయడం సహేతుకం కాదు.. వారూ తమ స్థిరత్వం కోసం అమెరికాకు వచ్చి ఉద్యోగం చేస్తున్నారు. కానీ ఈ పరిణామం అమెరికన్ పౌరులు, ముఖ్యంగా విద్యా రుణ భారం మోస్తున్న తాజా గ్రాడ్యుయేట్లు, తమకు అవకాశాలు లేకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. కొన్ని కంపెనీలు అమెరికన్ ఉద్యోగులను తొలగించి అదే పని విదేశాల్లో తక్కువ వేతనంతో నిర్వహిస్తే, అది కేవలం ఆర్థిక నిర్ణయంగా కాదు..వ్యక్తిగత దెబ్బలా అనిపిస్తోంది.
- "అమెరికన్ డ్రీం" – ఇంకా అందుబాటులో ఉందా?
ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటంటే ఈ వ్యవస్థ ఇప్పుడు ఎవరిని ప్రాధాన్యంగా చూస్తోంది? అమెరికన్ పౌరులకు, వలసదారులకు సమాన అవకాశాలున్నాయా? ఇద్దరూ కలసి ఎదగగలుగుతారా? లేక ఒకరికి ఊహించని అన్యాయం జరుగుతుందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనికి పరిష్కారం దొరక్కపోతే స్థానిక అమెరికా నిరుద్యోగుల నుంచి ఈ నిరాశ త్వరలో ఆగ్రహంగా మారే ప్రమాదం ఉంది.