బెంగాల్ లో అసలైన విజేత ఆయనే !

పశ్చిమ బెంగాల్. రాజకీయంగా చారిత్రాత్మకంగా ఎంతో పేరున్న రాష్ట్రం. స్వాతంత్ర్య సమరంలో కూడా బెంగాల్ ది అతి ముఖ్య పాత్ర.;

Update: 2026-04-30 04:02 GMT

పశ్చిమ బెంగాల్. రాజకీయంగా చారిత్రాత్మకంగా ఎంతో పేరున్న రాష్ట్రం. స్వాతంత్ర్య సమరంలో కూడా బెంగాల్ ది అతి ముఖ్య పాత్ర. వందేమాతరం అంటూ యావత్తు భారతీయులలో స్పూర్తిని నింపిన నేల కూడా అదే. ఎంతో మంది విద్వత్తు గల వారు మేధావులు రవీంద్రుడు వంటి గొప్ప వారు వివేకానందుడు, రామకృష్ణ పరమహంస వంటి ఆధ్యాత్మిక పరులు నడయాడిన గడ్డ అది. ఇక రాజకీయంగా చూస్తే బెంగాల్ ఎపుడూ హాట్ టాపిక్ గానే ఉంటూ వచ్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక తొలి మూడున్నర దశాబ్దాలు కాంగ్రెస్ ఏలుబడిలో ఆ తరువాత మరో మూడున్నర దశాబ్దాలు వామపక్షాల ఏలుబడిలో సాగిన బెంగాల్ 2011 నుంచి తృణమూల్ కాంగ్రెస్ పాలనలో ఉంది.

ఎపుడూ హింసతోనే :

బెంగాల్ లో ఎన్నికలు అంటే హింసనే గుర్తుకు వస్తుంది. అక్కడ పోలింగ్ ప్రశాంతంగా సాగిన సూచనలు ఎపుడూ లేవు. అంతే కాదు పోలింగ్ బూత్ లను కబళించడం రిగ్గింగ్ చేయడం అన్నది సర్వ సాధారణంగా సాగుతూ వచ్చింది. ఇక ఎన్నికల్లో హింస తారస్థాయికి చేరుకుని జనాలు చనిపోవడం కూడా దేశంలో బెంగాల్ లో తప్ప మరే చోటా కనిపించని వినిపించని విషయం. అక్కడ ఓట్లు వేయాలంటే కూడా జనాలకు భయం. రాజకీయ పార్టీలు అధికారంలో ఉండడమే కాదు పాలనను శా సిస్తాయి. అధికారుల పెత్తనం పూర్వ పక్షం చేస్తాయి. చట్టాలను అపహాస్యం చేస్తూ విచ్చలవిడిగా రెచ్చిపోయే మూకలకు కొదవ లేదు అన్నది కూడా ప్రచారంలో ఉన్న మాట. అందుకే బెంగాల్ లో పోలింగ్ శాతం ఎపుడూ భారీగానే ఉన్నా అందులో స్వచ్చందంగా ఓటు వేసిన వారు ఎంత మంది అన్న ప్రశ్నలు అయితే కచ్చితంగా వస్తాయి.

రికార్డు బద్ధలు :

అలాంటి బెంగాల్ లో ఫస్ట్ టైం రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. ఈసారి ఏకంగా 90 శాతం పైగా పోలింగ్ జరగడం గొప్ప విషయం. ఇది బెంగాల్ పోలింగ్ చరిత్రనే తిరగరాసింది. అంతే కాదు దేశంలో సైతం ఇప్పటిదాకా మరే రాష్ట్రంలోనూ ఇంతటి పోలింగ్ జరిగిన దాఖలాలు లేవు. ఇక చూస్తే జనాలు పోలింగ్ బూతులకు విరగబడి వచ్చారు. మండే ఎండలను లెక్క చేయకుండా క్యూ కట్టి మరీ ఓటెత్తారు. ఇదంతా జన చైతన్యం అని చెప్పాల్సి ఉంది. అయితే దాని కంటే ముందు జనాలు ఇంత స్వేచ్ఛగా భయం లేకుండా ఓటేయడానికి తరలి రావడానికి సదుపాయాలను సమకూర్చిన ఎన్నికల సంఘాన్ని కూడా మెచ్చుకోవాలని అంటున్నారు.

అన్ని విధాలుగా కట్టుదిట్టం :

ఈసారి పశ్చిమ బెంగాల్ పోలింగ్ లో అన్ని విధాలుగా కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఏకంగా కేంద్ర బలగాలను రంగంలోకి దించింది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ పెద్ద ఎత్తున బలగాలని మోహరించింది. మరో వైపు చూస్తే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఈసారి జరుగుతాయన్న భరోసా జనంలో నింపడంలో కేంద్ర ఎన్నిక సంఘం సక్సెస్ అయింది దాంతోనే జనాలు చాలా కూల్ గా వచ్చి ఓటేసే వెళ్లిపోయారు. మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ లలో కనిపించినా వృద్ధులు సైతం ఓటేసేందుకు ఉత్సాహం చూపించినా దానికి ప్రధాన కారణం ఎన్నికల సంఘం ఇచ్చిన అండదండలు అన్న విశ్లేషణలు అయితే ఉన్నాయి.

అన్నింటికీ ఫుల్ స్టాప్ :

ఈసారి ఎన్నికల అవక తవకలకు కేంద్ర ఎన్నికల సంఘం ఫుల్ స్టాప్ పెట్టింది, రిగ్గింగ్ అన్న మాట వినిపించకుండా చేసింది. హింసకు చోటు లేదని చాటి చెప్పింది. దాంతో ఎన్నికల్లో చావులు ఎక్కడా నమోదు కాలేదు. ఓటర్లలో ఓటు వేయడానికి భయం అన్నది లేకుండా చెక్ పెట్టేసింది. దాంతోనే ప్రజలు ఓటు హక్కుని వినియోగించారు. అందుకే అంతా ఒక్కటే మాట చెబుతున్నారు. ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ ఈజ్ గ్రేట్ అని. తన మీద ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన లెక్క చేయలేదు, ఆఖరుకి విపక్షాలు అభిశంశన తీర్మానం ఇచ్చినా కూడా వెనక్కి తగ్గలేదు. తాను అనుకున్నది చేసి చూపించారు. దాంతోనే బెంగాల్ లో ఎన్నాళ్ళుగానో ఓటేయాలనుకుని భయపడి ఇళ్ళలోనే ఉండిపోయిన వారంతా వచ్చి ఓటు వేశారు. మరి వారి తీర్పు ఎలా ఉంటుంది ఏమిటి అన్నది పక్కన పెడితే ఈ ఎన్నికల్లో గెలిచిన సిసలైన విజేత జ్ఞానేశ్ కుమార్ అని అంతా అంటున్నారు.

Tags:    

Similar News