జగన్ కోసం.. రోశయ్యను కెలికి.. మైనింగ్ 'గాలి' దుమారం వెనుక ఏం జరిగింది?
ఓబుళాపురం మైనింగ్ అక్రమాల వ్యవహారంలో తాజాగా ఆ సంస్థ అధిపతి గాలి జనార్దన్ రెడ్డి, ఆయన బావమరిది, అధికారి బీవీ శ్రీనివాసరెడ్డి సహా పలువురికి నాంపల్లిలోని సీబీఐ కోర్టు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.;
ఓబుళాపురం మైనింగ్ అక్రమాల వ్యవహారంలో తాజాగా ఆ సంస్థ అధిపతి గాలి జనార్దన్ రెడ్డి, ఆయన బావమరిది, అధికారి బీవీ శ్రీనివాసరెడ్డి సహా పలువురికి నాంపల్లిలోని సీబీఐ కోర్టు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇక, వీరిలో గాలి జనార్దన్‌రెడ్డి సొంత బావమరిది బీవీ శ్రీనివాసరెడ్డి అధికారి అయి ఉండి.. అక్రమాలను కట్టడి చేయలేదని భావించిన కోర్టు.. ఆయనకు మరో నాలుగు సంవత్సరాల జైలు శిక్షను విధించింది. సరే.. అసలు ఈ కేసు ఎలా బయటకు వచ్చింది? దీనికి కారణం ఏంటి? అనేది ప్రస్తుతం చాలా మంది వెతుకుతున్న వ్యవహారం. మరి ఈ విషయం ఎలా బయటపడిందో చూద్దాం.
అది 2007. అప్పటికి ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఉంది. మరో రెండేళ్లలో ఎన్నికలకు వెళ్లాల్సి ఉంది. ఇంతలో మైనింగ్ లావాదేవీలు, అనుమతుల కోసం.. రాజశేఖరరెడ్డి ఫ్యామిలీ ఫ్రెండ్, బ్రాహ్మణి ఇండస్ట్రీస్‌లో సహ భాగస్వామి అయిన.. కర్ణాటకకు చెందిన గాలి జనార్దన్‌రెడ్డి, ఆయన సోదరులు సోమశేఖరరెడ్డి, కరుణాకరరెడ్డిలు.. వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆశ్రయించా రు. ఈ క్రమంలోనే వారికి అనంతపురం-కర్ణాటకలోని బళ్లారి సరిహద్దుల్లో అత్యంత విలువైన ఇనుప ఖనిజం మైనింగ్ కోసం అనుమతులు ఇచ్చారు. దీనికి అప్పటి ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి సహా మరో ఇద్దరు, అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు సంతకాలు చేశారు.
ఇది అనుమతులు తెచ్చుకుని.. 2008-09 మధ్య ప్రాంతంలో పనులు ప్రారంభించి..రేయింబవళ్లు తవ్వకాలు చేపట్టింది. ఈ క్రమంలోనే హద్దులు కూడా చెరిపేసి చొచ్చుకుపోయింది. ఇక, గాలి జనార్దన్‌రెడ్డి అప్పట్లో కర్నాటక రాజకీయాలను శాసిస్తున్నారు. ఆయన బీజేపీలో ఉన్నారు. పైగా యడియూరప్ప సీఎంగా ఉన్న కర్ణాటక కేబినెట్‌లో గాలి జనార్దన్‌రెడ్డి, ఆయన సోదరుడు సోమశేఖరరెడ్డి కూడా మంత్రులుగా ఉన్నారు. అయితే.. అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో మరో మంత్రి బీ. శ్రీరాములు వీరు చేస్తున్న వ్యాపారాలపై(మైనింగ్ కాదు) లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీంతో తొలిసారి లోకాయుక్త కేసులు నమోదు చేసింది.
ఇదిలావుంటే.. యడియూరప్ప ప్రభుత్వాన్ని తామే నిలబెట్టామని ఆరోపించడంతోపాటు.. తమకు వ్యతిరేకంగా లోకాయుక్త కేసులు నమోదు చేయడాన్ని వ్యతిరేకించిన జనార్దన్‌రెడ్డి.. యడియూరప్ప ప్రభుత్వాన్ని కుప్పకూల్చారు. ఇంతలోనే.. ఏపీలో 2009లో వైఎస్ ప్రభుత్వం మళ్లీ ఏర్పడింది. కానీ, కొన్నాళ్లకే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఈ పరిణామాల క్రమంలో వైఎస్ కుమారుడు, ప్రస్తుత వైసీపీ అధినేత జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని గాలి జనార్దన్‌రెడ్డి ప్రయత్నించారు. ఇది వాస్తవం కూడా. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రోశయ్యను ముఖ్యమంత్రిని చేసింది.
ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న గాలి జనార్దన్‌రెడ్డి.. పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డికి అండగా ఉంటానని.. జగన్ను ముఖ్యమంత్రిని చేసి తీరాల్సిందేనని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఆయన బహిరంగంగా ఓ తెలుగు పత్రికపై తీవ్ర విమర్శలు చేయడంతోపాటు.. రోశయ్యకు కూడా యడియూరప్ప పరిస్థితి పడుతుందని(ప్రభుత్వం కుప్పకూలుతుందనే కోణం లో) హెచ్చరించారు. దీనిని రోశయ్య తొలినాళ్లలో లైట్ తీసుకున్నారు. కానీ, అధిష్టానం సీరియస్‌గా తీసుకుని.. రోశయ్యకు క్లాస్ పీకేసింది. ఈ పరిణామాలు ఇలా సాగుతుండగా.. టీడీపీ ఎంట్రీ ఇచ్చింది. అనంతపురంలో గాలి బ్రదర్స్ మైనింగ్ అక్రమాలపై నిరంతరం మీడియా ముందుకు తీసుకువచ్చింది.
ఇలా.. 2009 డిసెంబరు(వైఎస్ చనిపోయిన మూడు మసాలకు)లో రోశయ్య ప్రభుత్వం ``అసలు అనంతపురంలో ఇచ్చిన ఓబులా పురం మైనింగ్ కంపెనీ ఏం చేస్తోందో చూడాలి`` అని పేర్కొంటూ ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీని వేసింది. దీంతో మరింత రెచ్చిపోయిన గాలి జనార్దన్‌రెడ్డి.. రోశయ్యను టార్గెట్ చేసుకుని ప్రభుత్వాన్ని కూల్చేస్తానని బహిరంగ వ్యాఖ్యలు చేశారు. దీంతో రోశయ్య కూడా జోరుగానే రియాక్ట్ అయ్యారు. ఆ వెంటనే.. ముగ్గురు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదికను వెంటనే ఆయన కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పంపించడం.. వెంటనే.. సీబీఐ విచారణ కోరడం జరిగిపోయాయి. అలా.. మొదలైన వ్యవహారం.. తర్వాత కాలంలో జోరుగా సాగి.. కేంద్రంలో బీజేపీప్రభుత్వం వచ్చాక మందగించింది.
ఇక్కడే మరో మలుపు తిరిగింది. గాలి జనార్దన్‌రెడ్డి కనుక బీజేపీలోనే ఉండి ఉంటే.. ప్రస్తుతం ఈ కేసు ఇంతగా హైలెట్ అయ్యేది కాదు. కానీ.. బీజేపీ నుంచి బయటకు వచ్చిన గాలి.. ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పడకుండా.. అడ్డుకున్నారు. పార్టీని చీల్చి.. సొంత గా పార్టీ పెట్టుకుని.. బీజేపీకి కంట్లో నలుసుగా మారారు. ఫలితంగా కమల నాథులు కూడా ఆయనను పక్కన పెట్టారు. ఎట్టకేలకు.. అన్ని విచారణలు.. ఆగమేఘాలపై కాకపోయినా.. ఒక పద్ధతి ప్రకారంముందుకు సాగాయి. ఏదేమైనా ఆనాడు రోశయ్యను కెలికి.. జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడం కోసం.. గాలి చేసిన ప్రయత్నాలు.. ఆయన చేసిన అవినీతి, అక్రమాలకు చుట్టుకుని ఇప్పుడు జైలుకు వెళ్లేలా చేశాయి.