వీటికి మాత్రమే ఉచితాలు అడుగుదాం
కాదేదీ ఉచితానికి అనర్హం. ఈ ప్రకృతిలో సమస్తం శ్రమైక జీవన సౌందర్యం. అంటే శ్రమ చేస్తేనే ఏదైనా దక్కేది.;
కాదేదీ ఉచితానికి అనర్హం. ఈ ప్రకృతిలో సమస్తం శ్రమైక జీవన సౌందర్యం. అంటే శ్రమ చేస్తేనే ఏదైనా దక్కేది. అంతే తప్ప ఉచితంగా కాదు అని పెద్దలు చెబుతారు. ఉచితం అని నీకు దక్కినది మరొకడి శ్రమ నుంచి దోచుకుని వచ్చి పెడుతున్నది అని గ్రహించాలి. అంటే వేరొకరి శ్రమ మరొకరికి ఉచితం అవుతోంది అన్న మాట. మరి ఇది వివక్షకు దారి తీయదా. సమాజంలో కొన్ని వర్గాలకు అసూయ కలగదా అన్నది ఒక వైపు చర్చ అయితే మరో వైపు ఇస్తూ పోతూ ఉంటే ఉచితాలు గుది బండలుగా మారుతాయి అని కూడా అంటారు. కొండలైన తరిగిపోవు కూర్చుని తింటే అని ఒక సామెత కూడా ఉంది.
అనుచితంగానే అన్నీ :
అన్నమో రామచంద్రా అని అల్లాడిన వారికి సహాయం చేయాలి. దానిని ఎవరూ తప్పు పట్టలేరు. ఏ సమాజంలో అయినా ఆర్థికంగా వెనకబడిన వారు ఉంటారు. వారిని ఆదుకోవడం సమాజ లక్షణం. అంటే ప్రభుత్వాల కర్తవ్యం కూడా. కానీ అదే సమాజ బాధ్యతలో అతిగా వ్యవహరిస్తే ఆ ఉచితాలు అనుచితాలు అవుతాయని అంటున్నారు. ఏది ఏవరికి ఎంతవరకూ ఇవ్వాలో చూడాలి. ఆ మీదట అది స్టాప్ చేయాలి. అంతే తప్ప ప్రతీదీ ఫ్రీ అంటూ ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు చేసే విన్యాసాల మీదనే దేశ అత్యున్నత న్యాయ స్థానం తప్పుపట్టింది. కీలక వ్యాఖ్యలను చేసింది. ఇలా ఇస్తూ పోతే రెవిన్యూ లోటు పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. దేశ అభివృద్ధికి విఘాతం కలుగుతుందని కూడా స్పష్టంగా చెప్పింది. అందరికీ ఉచితం అన్నడంలో అర్ధమే లేదని కూడా ఆక్షేపించింది.
శ్రమ తత్వం నేర్పాలి :
ప్రజలను సోమరిపోతుల మాదిరిగా చేస్తూ పోతే ఒక వెనిజులా దేశం కధ లాంటిదే అవుతుంది అన్నది మేధావుల మాట. కష్టించి పని చేయడం నేర్పాలి. వారికి ఉపాధి అవకాశాలకు బాటలు వేయాలి తగిన ప్రోత్సాహం అందించాలి. వారి చేత కుటీర పరిశ్రమలు పెట్టించాలి. అంతే తప్ప ఫ్రీగా సొమ్ములు అంటూ నగదు బదిలీ పధకాలను అమలు చేసుకుంటూ పోతే ఖజానాకి చిల్లు తప్ప చివరికి మిగిలేది ఏదీ లేదని అంటున్నారు.
ఉచితం ఉండాల్సిందే :
చదువును ఉచితం చేయాలి. ప్రతీ విద్యార్థి డిగ్రీ చదివేంతవరకూ ఫీజు లేకుండా ఉచితంగా ప్రభుత్వం చదివిస్తుంది అని హామీ ఇవ్వాలి. అది పధకంగా అమలు చేయాలి. అలాగే ఉచితంగా వైద్యం కూడా ఇవ్వాలి. ప్రాణానికి ఆరోగ్యానికి సంబంధించిన విషయం ఇది. అందువల్ల పేదలు వైద్యానికి దూరం అవుతున్నారు. కాబట్టి ఉచితం ఆరోగ్యం విషయంలో తప్పనిసరి. దానికి పధకాలు పెట్టినా భేష్ అంటారు. అలాగే పంట పండించే రైతులు అవసరం అయిన ఎరువులు విత్తనాలు ఉచితంగా ఇవ్వాలి. లేదా సబ్సిడీ మీద అయినా ఇవ్వాలి. రైతు లేకపోతే మనిషి జీవనం లేదు, ఆహారం అంతకంటే లేదు, అందువల్ల వ్యవసాయ రంగానికి ఉచితాలు అమలు చేసినా తప్పు పట్టేది ఉండదు. అలా కాకుండా ఇచ్చే ఏ ఉచితం అయినా దండుగ మారినదే అని అంటున్నారు.
అవగాహన పెరగాలి :
ఉచితాల మీద ఆశ పడడం కంటే ప్రజలు అవగాహన పెంచుకోవాలి. మన దేశం మన రాష్ట్రం బాగుండాలని అప్పులు లేని విధంగా ఉండాలని కోరుకోవాలి. ఉచితం ఇస్తున్నారు మనకేమి పోయింది అనుకుంటే రేపటి రోజున అప్పుల కుప్ప అయిన రాష్ట్రాలలో పౌరులుగా వడ్డీలు కట్టేది కూడా ప్రజలే అని గుర్తు పెట్టుకోవాలి. సుప్రీంకోర్టు హిత వచనాలతో అయినా రాజకీయ పార్టీలు అలాగే ప్రజలు కూడా నూతన ఆలోచనలతో ముందుకు సాగితే ఉచితాలకు ముగింపు కార్డు పడుతుంది.