దేశ చరిత్రలోనే తొలిసారి: విమానాన్ని అమ్మేసిన ఈడీ.. బాధితులకు 'మూడు కోట్లు' మాత్రమేనా సార్?
గతంలో విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి పెద్దల కార్లు, ఇళ్లను ఈడీ జప్తు చేయడం చూశాం కానీ ఇలా ఒక ఎగిరే విమానాన్ని ఆన్‌లైన్ వేలంలో పెట్టడం మాత్రం దేశ చరిత్రలోనే ఇదే మొదటిసారి.
పోంజీ స్కామ్‌లు చేసి కోట్లు కొల్లగొట్టే కేటుగాళ్లు విలాసాలకు ఏమాత్రం లోటు రానివ్వరు. లగ్జరీ కార్లు, బంగళాలు దాటి ఏకంగా సొంత విమానాల్లో చక్కర్లు కొట్టేస్తుంటారు. అయితే పాపం పండినప్పుడు చట్టం చేతికి చిక్కితే ఎలా ఉంటుందో చూపించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). దేశ చరిత్రలోనే తొలిసారిగా తాము స్వాధీనం చేసుకున్న ఒక ప్రైవేట్ చార్టర్డ్ విమానాన్ని ఈ-వేలం వేసి మరీ అమ్మేసింది. హైదరాబాద్ జోనల్ ఈడీ పరిధిలో జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆకాశంలో విహరించిన సదరు విమానం భూమిపైకి దిగి, ఇలా ఆన్‌లైన్ బజార్లో పడటం వెనుక ఒక పెద్ద 'స్కామ్ కథే' ఉంది.
కథేంటంటే.. రూ. 792 కోట్ల స్కామ్.. రూ. 3 కోట్ల విమానం
ఈ లగ్జరీ విమానం కథ 'ఫాల్కన్ పోంజీ స్కామ్' అనే భారీ మోసంతో ముడిపడి ఉంది. ఈ స్కామ్ సూత్రధారి అమర్‌దీప్ కుమార్, అతని గ్యాంగ్ కలిసి 'ఫేక్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్' అనే సరికొత్త టోపీని కనిపెట్టారు. "మా దగ్గర డబ్బులు పెట్టండి.. కొండంత లాభాలు తెచ్చిపెడతాం" అంటూ నమ్మించి, దేశవ్యాప్తంగా వందలాది మంది అమాయక పెట్టుబడిదారులను ముంచేశారు. ఒకరి దగ్గర తీసుకుని మరొకరికి ఇస్తూ.. మధ్యలో తాము మాత్రం జల్సాలు చేశారు. అలా వీరు కొట్టేసిన మొత్తం ఎంతో తెలుసా? అక్షరాలా రూ. 792 కోట్లు!
ఇంత భారీ స్కామ్ చేసిన నిందితుడు అమర్‌దీప్ కుమార్ సొంతంగా తిరగడానికి ఒక హాకర్ 800A చార్టర్డ్ విమానాన్ని కొనుగోలు చేశాడు. అయితే 2025 మార్చి 7న హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఈడీ అధికారులు ఈ 'గగన శకటానికి' బ్రేకులు వేసి సీజ్ చేశారు.
రూ. 14 కోట్ల విమానం.. మూడు కోట్లకే 'ఖతం'
నిజానికి మార్కెట్లో ఈ విమానం విలువ సుమారు రూ. 14 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. కానీ ఒకసారి ప్రభుత్వ ఖాతాలోకి వెళ్లాక దాని మెయింటెనెన్స్, వయస్సు, సాంకేతిక సమస్యలు, చట్టపరమైన కొర్రీలు అన్నీ కలిసి దాన్ని కాస్తా సెకండ్ హ్యాండ్ కారు రేంజ్‌కి తెచ్చేశాయి. ఎట్టకేలకు జూలై 1, 2026న ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ ఈ-ఆక్షన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా నిర్వహించిన వేలంలో ఇది కేవలం రూ. 3 కోట్లకే అమ్ముడైంది.
పోయిన రూ. 792 కోట్లతో పోలిస్తే ఈ రూ. 3 కోట్లు సముద్రంలో కాకి రెట్ట లాంటిదే అయినప్పటికీ ఈడీ మాత్రం "బాధితులకు త్వరలోనే ఈ రూ. 3 కోట్లు పంచుతాం" అని చాలా ఉదారంగా ప్రకటించింది. అంటే.. వంద రూపాయలు పోగొట్టుకున్న వాడికి ఆశగా ఒక రూపాయి చేతిలో పెడుతున్నారన్నమాట!
డిజిటల్ ఇండియా మహిమ.. ఈ-వేలంలో రికార్డు
గతంలో విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి పెద్దల కార్లు, ఇళ్లను ఈడీ జప్తు చేయడం చూశాం కానీ ఇలా ఒక ఎగిరే విమానాన్ని ఆన్‌లైన్ వేలంలో పెట్టడం మాత్రం దేశ చరిత్రలోనే ఇదే మొదటిసారి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కోర్టు అనుమతితో అంతా డిజిటల్ పద్ధతిలో, ఎంతో పారదర్శకంగా కానిచ్చేశారు.
ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితుడు అమర్‌దీప్ కుమార్‌తో పాటు ముగ్గురు కీలక నిందితులు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. వీరు అక్రమంగా సంపాదించిన మరిన్ని ఆస్తులు, విదేశీ బ్యాంక్ ఖాతాల కోసం ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది.
ఏదేమైనా ప్రజల సొమ్ముతో విమానాల్లో తిరిగే ఆర్థిక నేరగాళ్లకు ఈ విమానం వేలం ఒక గట్టి హెచ్చరికే. కాకపోతే బాధితులకు చెందాల్సిన మిగతా రూ. 789 కోట్లు ఎప్పుడు వస్తాయో ఆ దేవుడికే తెలియాలి.