నోబెల్ మిస్ అయ్యింది.. అది కావాలి.. ట్రంప్ గారి కొత్త డిమాండ్
సౌత్ కరోలినా ఎన్నికల వేదికగా ట్రంప్ తన విరహ వేదనను వెళ్లగక్కుతూ.. “నాకు నోబెల్ ఇవ్వలేదు.. పోనీ పులిట్జర్ అయినా ఇచ్చారా?
ప్రపంచంలో ఏ అవార్డు ప్రకటించినా.. ఏ ప్రశంసా పత్రం ఇచ్చినా తన పేరు లేకపోతే అసలే మాత్రం జీర్ణించుకోలేని ‘గ్రేట్’ నాయకుడు డొనాల్డ్ ట్రంప్.. “నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి.. నేనే ప్రపంచానికి శాంతిని ప్రసాదించా” అని మూడేళ్లుగా పాడుతున్న పాత పాట బోర్ కొట్టిందో ఏమో ఈసారి రూటు మార్చారు. ప్రతిష్ఠాత్మక ‘పులిట్జర్’ అవార్డుపైనా తన వ్యాపార కన్ను వేశారు. “నోబెల్ ఇవ్వకపోతే పోయారు.. కనీసం నా అద్భుతమైన రచనలకైనా పులిట్జర్ అవార్డు ఇవ్వొచ్చు కదా” అంటూ సౌత్ కరోలినా ర్యాలీలో ఆయన విసిరిన సెటైర్లు, వేసిన డిమాండ్లు ఇప్పుడు ప్రపంచ మీడియాకు భలే వినోదాన్ని పంచుతున్నాయి.
సౌత్ కరోలినా ఎన్నికల వేదికగా ట్రంప్ తన విరహ వేదనను వెళ్లగక్కుతూ.. “నాకు నోబెల్ ఇవ్వలేదు.. పోనీ పులిట్జర్ అయినా ఇచ్చారా? అదీ లేదు.. చాలామంది ‘రష్యా.. రష్యా..’ అని నాలుగు డొల్ల కథనాలు రాయగానే తెచ్చి పులిట్జర్లు ఇచ్చేశారు. మరి నా ఆణిముత్యాల్లాంటి రచనల సంగతేంటి?” అని ప్రశ్నించారు. అసలు అధ్యక్షుల వారు ఏ సాహిత్యాన్ని, ఏ పరిశోధనాత్మక జర్నలిజాన్ని ఉద్దేశించి ‘నా రచనలు’ అన్నారో విశ్లేషకులకు కూడా అర్థం కాక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఆయన రోజువారీ సామాజిక మాధ్యమాల్లో చేసే క్యాపిటల్ లెటర్ల ఆగ్రహావేశాలు, అర్ధరాత్రి పోస్టులనే రచనలుగా భావించి అవార్డు ఇవ్వమంటున్నారా? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
అసలు పులిట్జర్ అవార్డు అంటే కొలంబియా యూనివర్సిటీ పర్యవేక్షణలో అత్యుత్తమ ప్రజాసేవ, నిష్పాక్షికమైన జర్నలిజం, లోతైన పరిశోధనలకు ఇచ్చే గౌరవం. కానీ ట్రంప్ గారి దృష్టిలో అవార్డులంటే కేవలం ప్రాపర్టీ బిజినెస్సలాంటివి కాబోలు.. “నాకు కాకపోతే ఇంకెవరికి?” అనే ఈ ఆత్మవిశ్వాసం చూసి పులిట్జర్ జ్యూరీ సభ్యులు కూడా ఒక్కసారిగా అవాక్కయి ఉంటారు.
గతంలో నోబెల్ రాలేదని కమిటీపై విరుచుకుపడిన ట్రంప్, ఇప్పుడు జర్నలిజం రంగంపై పడ్డారు. “అవార్డులు డిమాండ్ చేసి తీసుకోవడం” అనే కొత్త సంప్రదాయానికి ఆయన శ్రీకారం చుడుతున్నారేమో అనిపించక మానదు. మరి ఈ సంచలన కామెంట్లకు పులిట్జర్ కమిటీ స్పందిస్తుందో లేక ‘ఫేక్ న్యూస్’ అని కొట్టిపారేస్తుందో చూడాలి...