గాజాను స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ అత్యంత సంచలన ప్రకటన

ప్రపంచంలోనే అత్యంత సంక్షుభిత ప్రదేశం అయిన గాజాను స్వాధీనం చేసుకుంటామని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.;

Update: 2025-02-05 05:40 GMT

ఇప్పటివరకు పనామ కాల్వను స్వాధీనం చేసుకుంటాం.. గ్రీన్ ల్యాండ్ ను కొనేస్తాం.. అని మాత్రమే ప్రకటనలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏకంగా అత్యంత సంచలనకర విషయం ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత సంక్షుభిత ప్రదేశం అయిన గాజాను స్వాధీనం చేసుకుంటామని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. అది కూడా గాజా శత్రు దేశమైన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో సమావేశం అనంతరం.

తాను అధికారంలోకి వస్తే వారం రోజుల్లో హమాస్ –ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపివేయిస్తానని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ దిశలోనే ఆయన అధ్యక్షుడు కావడానికి అటుఇటు ముందుగానే హమాస్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు ఒప్పుకొన్నాయి. ఇప్పుడు తాజాగా నెతన్యాహూతో సమావేశం అయ్యారు ట్రంప్.

ఇటీవల ట్రంప్ ఒక ప్రకటన చేశారు... అదేమంటే, గాజాపై యుద్ధం కారణంగా నిరాశ్రయులైన పాలస్తీనీయులకు చుట్టూ ఉన్న అరబ్‌ దేశాలు ఆశ్రయం కల్పించాలని కోరారు. కానీ దీనిని ఆయా దేశాలు ఒప్పుకోలేదు. అలా చేస్తే తమ తమ దేశాల్లో అస్థిరత నెలకొంటుందని ఈజిప్ట్, జోర్డాన్‌, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్‌, పాలస్తీనా అథారిటీ, అరబ్‌ లీగ్‌ లు ఒక సంయుక్త ప్రకటన చేశాయి. అంటే.. ట్రంప్ గాజాను స్వాధీనం చేసుకునే ముందుచూపుతోనే అరబ్ దేశాలకు ప్రతిపాదన చేసినట్లు స్పష్టం అవుతోంది.

ఇప్పుడు నెతన్యాహూతో సమావేశం అనంతరం మాట్లాడుతూ.. గాజాను తాము తీసుకుని, అక్కడ ధ్వంసమైన భవనాలను పునరుద్ధరిస్తామని, ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని, స్థానిక ప్రజలకు భారీగా ఉద్యోగాలు కల్పిస్తామని, ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. ఇక దీనిని నెతన్యాహూ సమర్థించారు. ట్రంప్‌ ప్రకటన చరిత్రను మారుస్తుందన్నారు.

ట్రంప్ ఆఫర్ ను హమాస్‌ ఖండించింది. ఆయన గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. తమ ప్రజలకు ట్రంప్ ఆఫర్ ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. తమ భూమి నుంచి తమవారిని తరలింపును, దురాక్రమణను అడ్డుకోవాల్సి ఉందని తెలిపింది.

Tags:    

Similar News