ఇండియా కూటమికి స్టాలిన్ దూరం ?

కానీ తాజాగా తమిళనాడులో చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తే కనుక డీఎంకే కాంగ్రెస్ కి దూరం అవుతుందా అన్న చర్చ మొదలైంది.;

Update: 2026-05-06 08:30 GMT

తమిళనాడులో అత్యంత ప్రభావవంతమైన పార్టీగా డీఎంకే ఉంది. దాని చరిత్ర ఆరున్నార దశాబ్దాలు, అధికార పార్టీగా ఆరు దశాబ్దాల పాటు ఉంది. ఎంతో మంది దిగ్గజ నేతలు కలిగిన డీఎంకే కాంగ్రెస్ తో కలసి దశాబ్దాలు ప్రయాణించింది. ఆ మధ్యలో రాజీవ్ గాంధీ హత్య తరువాత డీఎంకే మీద అనుమానం నీలి నీడలు పడడంతో కాంగ్రెస్ పెద్దలు దూరం పెట్టారు. అయితే గత పాతికేళ్ళుగా తిరిగి కాంగ్రెస్ డీఎంకే రాజకీయ ప్రయాణం ఎంతో సామరస్యంగా చేస్తూ వస్తున్నాయి. కానీ తాజాగా తమిళనాడులో చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తే కనుక డీఎంకే కాంగ్రెస్ కి దూరం అవుతుందా అన్న చర్చ మొదలైంది.

ఈ రోజుకీ బలంగా :

తాజా ఎన్నికల్లో డీఎంకే ఓటమి పాలు అయినా 74 మంది ఆ కూటమికి ఉన్నారు. అందులో డీఎంకే సొంత వాటా 60 మంది ఎమ్మెల్యేలు. అయితే ఈ కూటమి నుంచి కాంగ్రెస్ సహా ఇతర చిన్న పార్టీలు కలసి విజయ్ టీవీకే వైపు మళ్ళిపోవడాన్ని డీఎంకే పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ కి డీఎంకే ఏకంగా 28 సీట్ల దాకా ఇచ్చింది. ఆ సీట్లలోనే ఎక్కువగా టీవీకే గెలిచింది అని డీఎంకే నేతలు అంటున్నారు. తాము మద్దతు ఇచ్చినా కూడా ఓటమి పాలు అయిన కాంగ్రెస్ ఇపుడు టీవీకేకి మద్దతు ఇవ్వడం కచ్చితంగా వెన్నుపోటు రాజకీయమే అని డీఎంకే నేతలు భావిస్తున్నారు.

అసహనంతోనే :

డీఎంకే అధినాయకత్వం అయితే తాజా పరిణామాల పట్ల పూర్తి అసహనంగా ఉందని అంటున్నారు. తమకు ఎదురు నిలిచి పోటీ చేసి తమ వ్యతిరేక రాజకీయం నడిపిన టీవీకేకి ఎలా కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని డీఎంకే నేతలు ప్రశ్నిస్తున్నారు. ఓడినా గెలిచినా తామంతా ఒక కూటమి అని వారు గుర్తు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్కం ఠాగూరు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఓడిన పార్టీతో కలసి ఉండాలా అని ఆయన ప్రశ్నించారు. రెండు పదులకు మించి డీఎంకే మంత్రులు ఓటమి పాలు అయ్యారని గుర్తు చేశారు. దీంతో డీఎంకే కాంగ్రెస్ ల మధ్య గ్యాప్ బాగా పెరిగిపోతోంది అని అంటున్నారు.

సొంతంగానే అంటూ :

ఇపుడున్న రాజకీయ నేపథ్యంలో డీఎంకే ఒంటరిగానే ఉండాలని కీలక నిర్ణయం తీసుకుంటుందా అన్న చర్చ సాగుతోంది. ఇండియా కూటమిలోకి విజయ్ టీవీకే వస్తే స్థానికంగా ఆ పార్టీతో కుస్తీ చేస్తూ జాతీయ స్థాయిలో దోస్తీ చేయడం అంటే తమకు ఇరకాటంగానే ఉంటుందని డీఎంకే భావిస్తోంది. పైగా తాము 2031 లో మరోసారి తమిళనాడులో అధికారంలోకి రావాలని అనుకుంటే గట్టిగా పోరాడాల్సింది టీవీకే ప్రభుత్వం మీదనే కదా అని అంటున్నారు. అందులో కాంగ్రెస్ చేరి మంత్రి పదవులు అందుకుంటే ఆ పార్టీ మీద కూడా సహజంగా పోరు ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ తో కలసి జాతీయ స్థాయిలో ప్రయాణించేది ఉంటుందా లేదా అన్నది డీఎంకే సీరియస్ గానే డిస్కస్ చేస్తుందని అంటున్నారు. మొత్తానికి టీవీకే విజయ్ వచ్చి డీఎంకే కాంగ్రెస్ ల మధ్య పుల్ల పెట్టేశారు అని అంటున్నారు చూడాలి మరి స్టాలిన్ ఏ నిర్ణయం తీసుకుంటారో.

Tags:    

Similar News