డీకే పట్టాభిషేకానికి ముహూర్తం ఫిక్స్
ఎట్టకేలకు కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం చేయబోతున్నారు. అది ఆయన దశాబ్దాల కలగా చెప్పాల్సి ఉంటుంది.
ఎట్టకేలకు కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం చేయబోతున్నారు. అది ఆయన దశాబ్దాల కలగా చెప్పాల్సి ఉంటుంది. డీకే ఈ శనివారం అంటే 30వ తేదీన కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. దానికి రంగం కూడా సిద్ధం అయింది. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదవీ వియోగం ఖాయం అయింది. ఆయన సీఎం గా కుర్చీ దిగిపోఉన్నారు. ఈ నెల 28 గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు సిద్ధరామయ్య గవర్నర్ ని కలిసి తన రాజీనామాను సమర్పిస్తారు అని తెలుస్తోంది.
టోటల్ గా ఎనిమిదేళ్ళు :
ఎనభయ్యేళ్ళ సిద్దరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా తన ఇన్నింగ్స్ ని ముగించినట్లే అని అంటున్నారు. ఆయన మొత్తంగా ఎనిమిదేళ్ల పాటు కర్ణాటకకు సీఎం హోదాలో సేవలను అందించారు. ఆయన 2013 నుంచి 2018 దాకా సీఎం గా తొలి టెర్మ్ వ్యవహరించారు. ఇక 2023 మేలో మరోసారి సీఎం గా ప్రమాణం చేసి సరిగ్గా మే నెలలోనే కుర్చీ దిగిపోనున్నారు. ఇలా సిద్ధ రామయ్య సీఎం గా చూస్తే సుదీర్ఘ కాలమే పనిచేశారు అని చెప్పాలి.
లోక్ దళ్ నుంచి వచ్చి :
అంతకు ముందు సీఎం లలో కొద్ది మంది మాత్రమే ఎక్కువ కాలం పనిచేసిన చరిత్రను సొంతం చేసుకున్నారు. నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘమైన రాజకీయ జీవితం సిద్ధరామయ్యది లోక్ దళ్ లో తొలుత ప్రవేశించి జనతా పార్టీ ద్వారా రాజకీయం కొనసాగించి, జనతాదళ్ లోనూ జేడీఎస్ లోనూ కీలక పదవులు చేపట్టారు సిద్ధ రామయ్య ఎన్నో కీలక మంత్రిత్వ శాఖలతో పాటు ఉప ముఖ్యమంత్రిగానూ జేడీఎస్ లో పనిచేసిన ఆయన సీఎం కోరిక మాత్రం కాంగ్రెస్ తోనే తీరింది అని చెప్పాలి.
డీకే ట్రబుల్ షూటర్ :
ఇక డీకే శివ కుమార్ ట్రబుల్ షూటర్ గా కాంగ్రెస్ లో పేరు తెచ్చుకున్నారు. ఆయన 1980 నుంచే విద్యార్థి రాజకీయాల ద్వారా కాంగ్రెస్ లో ప్రవేశించారు. 1985లో ఆయన ఎమెంల్యేగా తొలిసారి పోటీ చేసి ఓటమి చెందినా 1989లో మాత్రం గెలిచారు. అలా ఇప్పటికి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాదు ఎన్నో సార్లు కీలకమైన మంత్రి పదవులు చేపట్టి కర్ణాటక కాంగ్రెస్ లో అత్యంత ముఖ్య నాయకుడిగా ఎదిగారు. ఆయన 2023లో కచ్చితంగా సీఎం అవుతారు అని అంతా భావించారు. కానీ రాహుల్ గాంధీ ఫార్ములా ప్రకారం మొదట సిద్ధరామయ్యకు చాన్స్ ఇచ్చారు ఇపుడు మిగిలిన రెండేళ్ళ కాలానికి డీకేకి చాన్స్ దక్కుతోంది. మరి డీకే ఈ చాన్స్ తో పాటు టఫ్ టాస్క్ ని తన మీద వేసుకున్నారు అని అంటున్నారు. కేవలం 24 నెలల వ్యవధిలో వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ ని మళ్లీ గెలిపిస్తే డీకే మరో అయిదేళ్ళ పాటు తిరుగులేని ఆధిపత్యంతో సీఎం గా ఉంటారు అని అంటున్నారు. మళ్లీ కాంగ్రెస్ ని గెలిపించే సత్తా ఉన్న వారుగా భావించే డీకేకి కాంగ్రెస్ అధినాయకత్వం పగ్గాలు అందిస్తోంది అని అంటున్నారు.