ఇంధ‌న సంక్షోభం చూపించిన దారి..21 ఏళ్ల యువకుడి సోలార్ విప్లవం!

క్యూబా దేశం ప్రస్తుతం చమురు కొరత, నిరంతర విద్యుత్ కోతలు.. వృద్ధాప్య థర్మోఎలెక్ట్రిక్ ప్లాంట్ల కారణంగా తీవ్రమైన ఇంధన, శక్తి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

Update: 2026-05-21 01:30 GMT

క్యూబా దేశం ప్రస్తుతం చమురు కొరత, నిరంతర విద్యుత్ కోతలు.. వృద్ధాప్య థర్మోఎలెక్ట్రిక్ ప్లాంట్ల కారణంగా తీవ్రమైన ఇంధన, శక్తి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అగ్ర‌రాజ్యం అమెరికా ఆంక్ష‌లు ఒక‌వైపు ఆర్థిక సంక్షోభం ఒక‌వైపు క్యూబాను ఒణికిస్తున్నాయి.ఈ దేశానికి ఆయిల్- గ్యాస్ వంటి దిగుమ‌తులు కూడా నిలిచిపోవ‌డంతో ర‌వాణా స‌హా ప్ర‌తిదీ సంక్షోభంలో ప‌డ్డాయి. అనేక గ్యాస్ స్టేషన్లు నెలల తరబడి మూతపడగా.. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు కేవలం 25 శాతానికి పడిపోయాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సామాన్య ప్రజలకు, సరుకు రవాణాకు ఎలక్ట్రిక్ మూడు చ‌క్రాల బ‌ళ్లు (ట్రైసికిల్స్) ఏకైక జీవనాధారంగా మారాయి. అయితే నిరంతర పవర్ కట్స్ వల్ల ఈ వాహనాలను ఛార్జ్ చేయడం రోజువారీ సవాలుగా మారింది.

ఈ సమస్యకు క్యూబా రాజధాని హవానా శివార్లలోని అరోయో నారన్జోకు చెందిన యాదాన్ పాబ్లో ఎస్పినోసా అనే 21 ఏళ్ల యువకుడు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నాడు. తన ఇంటినే ఒక చిన్న సోలార్ వర్క్‌షాప్‌గా మార్చి, దేశంలోనే తొలిసారిగా మొబైల్ సోలార్ క్లీన్-ఎనర్జీ బిజినెస్‌ను ప్రారంభించాడు. ఎలక్ట్రిక్ ట్రైసికిల్స్ పైభాగంలో ఇనుప ఫ్రేమ్‌ల సహాయంతో 550 నుండి 650 వాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానెళ్లను అమర్చడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. ఈ వినూత్న `చక్రాలపై సోలార్ రూఫ్‌లు` వాహనానికి నిరంతరం ఛార్జింగ్ ఇవ్వడమే కాకుండా క్యూబాలోని విపరీతమైన ఎండల నుంచి డ్రైవర్లకు చల్లని నీడను కూడా అందిస్తున్నాయి.

ఈ మొబైల్ సోలార్ టెక్నాలజీ పనిచేసే విధానం చాలా సింపుల్ గా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. వాహనం రోడ్డుపై కదులుతున్నప్పుడు సోలార్ ప్యానెల్ నేరుగా మోటారుకు శక్తిని అందిస్తూ రన్నింగ్ బ్యాటరీపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒకవేళ వాహనాన్ని ఎక్కడైనా నిలిపివేస్తే... ఆ సమయంలో ప్యానెల్ ద్వారా జనరేట్ అయ్యే సూర్యశక్తి బ్యాటరీని ఆటోమేటిక్‌గా రీఛార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల సాధారణ ఎలక్ట్రిక్ వాహనదారుల్లో ఉండే ``బ్యాటరీ ఎంతసేపు వస్తుంది? తదుపరి ప్లగ్ పాయింట్ ఎక్కడ దొరుకుతుంది?`` అనే ఆందోళనలకు పూర్తిగా చెక్ పడింది. పగటిపూట ఛార్జింగ్ కోసం ప్రత్యేకంగా సమయాన్ని వృథా చేయాల్సిన అవసరం లేకుండా పోయింది.

ఈ ప్రాజెక్ట్‌కు ఎలాంటి ప్రభుత్వ నిధులు గానీ... కార్పొరేట్ మద్దతు గానీ లేకపోవడం గమనార్హం. యువ పారిశ్రామికవేత్త ఎస్పినోసా తన తండ్రి, ముగ్గురు సోదరులు .. ఒక స్నేహితుడితో కలిసి ఒక చిన్న కుటుంబ బలగంగా ఏర్పడి ఈ ఇనుప సపోర్టులను, ప్యానెళ్లను సొంతంగా తయారు చేస్తూ ఇప్పటివరకు 15కు పైగా వాహనాలకు సోలార్ ఎన‌ర్జీని అందించారు.

క్యూబాపై ఉన్న చమురు దిగ్బంధనాన్ని ఐక్యరాజ్యసమితి (యుఎన్) నిపుణులు `ఇంధన ఆకలి`గా అభివర్ణించినా ఈ సంక్షోభమే క్యూబా పునరుత్పాదక ఇంధనం వైపు అడుగులు వేయడానికి ఒక కొత్త మార్గాన్ని చూపింది. కేవలం 15 ట్రైసికిల్స్ మార్చడం వల్ల క్యూబా దేశ ఉద్గారాలు మొత్తం తగ్గిపోవు లేదా జాతీయ గ్రిడ్ సమస్యలు తీరవు. కానీ రోజువారీ పనుల కోసం ఇబ్బంది పడే సామాన్యుడికి ఇది పక్కా గ్రౌండ్ లెవెల్ నిశ్శబ్ద విప్లవాన్ని పరిచయం చేసింది.

Tags:    

Similar News